ముందుమాట Degree 5th sem

 ముందుమాట

ఇంటికి ప్రధాన ద్వారం ఎలాగో పుస్తకానికి ముందుమాట అలాంటిది. పుస్తక పుటల్లోకి ప్రవేశించడానికి ముందుమాట ఒక సన్నని బాట ఏర్పరుస్తుంది. పుస్తక స్వరూప, స్వభావాలను సారాంశాన్ని ముందుమాట ప్రతిబింబిస్తుంది. ముందుమాట కొత్త పాఠకులకు ఒక దీపధారిలాంటిది.


'Fore word ' అనే ఆంగ్ల పదానికి సమానార్ధక పదంగా తెలుగులో ముందుమాట అని వాడుతున్నారు. గ్రంథం లేదా రచనకు ప్రారంభంలో ముందుగా ఉంటుంది. కాబట్టి ముందుమాట అని వ్యవహరిస్తున్నాం. తెలుగు గ్రంథాలలో మున్నది, ఆముఖం, పీఠిక, ప్రస్తావన, పరిచయం, భూమికలాంటి మాటలతో సూచించారు. జె.ఎ. కర్జన్ (J. A. Cuddon) తన డిక్షనరీ ఆఫ్ లిటరరీ టెక్స్ట్ fore word అంటే usually a short introductory piece to a book. It is similar to preface (Q.V) and an introduction, but is generally com- posed not by the author but by some are else" అని వివరించాడు. ఇది నిర్వచనం కాకపోయినా fore word అంటే ఏమిటో వివరిస్తుంది. తెలుగులో 'ముందుమాట' అనే అర్ధాన్నే ఇస్తూ అనేక పదాలున్నట్లుగానే ఆంగ్లంలోనూ Preface, introduction అనే పదాలున్నాయి. ఆయా కాల, సందర్భాల్లో వారి వారి అవసరాలను బట్టి భిన్నమైన పేర్లు వాడుకున్నట్లు భావించాలి. ఈ పేర్లు వైవిధ్యాన్నే కాకుండా వాడినవారి అభిరుచిని తెలియజేస్తున్నాయి.


కర్దన్ ఇచ్చిన వివరణను పరిశీలిస్తే ఏదైనా రచనకు లేదా పుస్తకానికి రాసే సంక్షిప్త పరిచయమే ముందుమాట అని తేలుతున్నది. అలాగే పుస్తక రచయిత కాకుండా ఇతరులెవరో రాసే పరిచయవాక్యాలను ముందుమాటగా చెప్పుకోవలసి ఉంటుంది. కర్జన్ చెప్పిన వివరణకు దగ్గరగానే ఆక్స్ఫర్డ్ నిఘంటువు నిర్వచిస్తున్నది. "a short introduction to a book, typically by a person other than the author" దీనికి ఉపోద్ఘాతం, పరిచయం అని తెలుగులో వాడుకలో ఉంది.


సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు చేకూరి రామారావు తన 'కవిత్వానుభవం' అనే గ్రంథానికి 'చిరువాదం - గురుమోదం' పేరుతో ముందుమాట రాశాడు. అంటే కడ్డన్ చెప్పిన వివరణ తెలుగు గ్రంథాలకు వర్తించదని భావించవచ్చు. ఇందులో కవిత్వానుభవంలోని వ్యాసాలు, ఎంపిక, ప్రచురణ, ప్రస్తావనలు, వివాదాలు, తన వాద పద్ధతి, విభేదించే విషయాలు ఇలా అందులో చేర్చిన వ్యాసాలు వాటి ప్రత్యేకతలు చర్చించాడు. అదే విధంగా చేకూరి రామారావు 'స్మృతికిణాంకం' అనే రచనకు బేతవోలు రామబ్రహ్మం చేత ముందుమాట రాయించాడు. నే 'నాస్తికుల్లోనూ స్థిర ప్రజ్ఞులుంటారు' అని తన ముందుమాటకు పేరు కూడా పెట్టాడు. తపు ముందుమాటలో ఇలా అంటాడు. "చేరాగారి పుస్తకాలకి పీఠికలు రాసే సాహసం నుంచి ఒకటి రెండుసార్లు తప్పించుకున్నా లౌక్యంగా, ఈసారి తప్పించుకోలేకపోయాను. చదువుతారో పుటలు తిప్పేస్తారో మీ ఇష్టం... ఏ పుస్తకానికైనా పీఠిక రాయాలంటే ఆ వ్యక్తి ఆ పుస్తకరచయిత కంటే విద్యాధికుడయ్యుండాలి అనేది నా పిచ్చినమ్మకం అవడం" అన్నాడు. బేతవోలు రామబ్రహ్మం ముందుమాటను పీఠిక అనే అర్థంలో ప్రస్తావించటం గమనార్హం. అలాగే ముందుమాట రాసే వ్యక్తి గ్రంథ రచయిత కంటే అధికంగా తెలిసినవాడై ఉండాలని చెప్పటం కూడా గమనించాలి. ఈ ముందుమాట లేదా పీఠికలో చేరా అధ్యయనశీలత, వ్యక్తిత్వం, ఇందులోని వ్యాసాల ప్రత్యేకతలు మొదలైన వాటిని గురించి తెలిపాడు.


దీనిని బట్టి చూస్తే రచయితను గురించి, రచన గురించి అత్యంత సన్నిహితంగా ఉన్న మరొక రచయిత, విద్వాంసుడు, కవి, విమర్శకుడు, వాఖ్యాత ఇచ్చే పరిచయ విశ్లేషణకు ముందుమాట అనే పేరు స్థిరపడింది. అయితే ముందుమాట అనేది ఎక్కువగా సాహిత్య సంబంధమైన రచనల విషయంగానే వాడుతుండటం పరిపాటి. ముఖ్యంగా కథలు, కవిత్వం, వ్యాసం, నవల, నాటకం లాంటి ప్రక్రియలు, జీవితచరిత్ర, ఆత్మకథ లాంటివి, పరిశోధనలు, సిద్ధాంత గ్రంథాలు, అభినందన సంచికలు, సదస్సు పత్రాలు, ప్రాజెక్టు నివేదికలు తదితరమైన వాటికి కూడా విషయ నిపుణత కలిగిన వారి అభిప్రాయం, సూచన, సలహాలు తీసుకోవడానికి కూడా ముందుమాటలు పనికొస్తాయని భావించాలి. జె.బి.ఎస్. హాల్డెన్ అనే పండిత శాస్త్రవేత్త రాసిన శాస్త్ర సంబంధ వ్యాసాలను What


I Require from life' అనే పేరుతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఆసక్తికర


విషయం ఏమంటే దీనికి Arthur C. clarke ముందుమాట రాశాడు. దీనిలో ఆయన తనకూ హాల్డెన్ పండితునికీ గల అనుబంధం వివరించాడు. అలాగే ఒక గొప్ప శాస్త్రవేత్తగా సైన్సు రచనలను ప్రఖ్యాతపరచటంలో హాల్డెన్ కృషి ఎంతటిదో తెలిపాడు. హాల్డెన్ వ్యక్తిత్వంలోని విశేషాలను పేర్కొన్నాడు. హాల్టెన్ దృక్పథ విశిష్టతను ఆ ముందుమాట ఎంతగానో ప్రస్తుతించింది. ఆర్థర్ క్లార్క్ చెప్పిన విషయాల ఆధారంగా ముందుమాటలో ఏముంటాయో క్రోడీకరించవచ్చు. 

1. ముందుమాట రాసే వ్యక్తి గ్రంథ రచయిత వ్యక్తిత్వం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు.

2. ముందుమాటకారుడు గ్రంథరచయిత దృక్పథంలోని విశేషాలను తెలియపరుస్తాడు.

3. ముందుమాట రాసే వారు రచనను సమగ్రంగా అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తారు.

4. ముందుమాట రాసే వ్యక్తి రచయిత రచనకు, రచయిత దృక్పథానికి, పాఠకుడికి అనుసంధానకర్తగా ఉంటాడు.


5. రచన దృక్పథబలం, రచన శైలి సంవిధానం రచయిత గ్రంథం, రచన చూపగల ప్రభావం రచన వల్ల కలిగే ప్రయోజనం ఇలా ఎన్నో అంశాలు ముందుమాట ద్వారా తేటతెల్లమవుతాయి.


రచయిత కాకుండా ఇతర ప్రసిద్ధ వ్యక్తి ఆ పుస్తకం లేదా రచన గురించి వెల్లడించే అభిప్రాయ విశేషమే ముందుమాట, ఇది ఆ పుస్తక లక్ష్య, ప్రయోజనాలను విశదపరుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో రచయితలు కూడా తమ రచన గురించి 'ముందుమాట'గా చెప్పుకొనే విషయాలుంటాయి. 'పిల్లలకే నా హృదయం అంకితం' అనే గ్రంథం వి. సుహొహ్దీన్ స్క్రీ రాశాడు. ఇది తల్లిదండ్రులకు, పిల్లలకు ఉద్దేశించిన పుస్తకం. అందులో ఆయన ఇలా చెప్తాడు. "ప్రియమైన పాఠకులారా, సహోద్యోగులారా ఉపాధ్యాయులారా, బోధకులారా, పాఠశాల - అదిపతులారా!


ఈ పుస్తకం ఒక పాఠశాలలో ఎన్నో సంవత్సరాలు నేను చేసిన కృషి ఫలితం. ఆలోచన, చింత, వ్యాకులం, ఉద్రేకాల ఫలితం ఇది. ముప్ఫైమూడు సంవత్సరాల నిరంతరాయ పాఠశాల ఉద్యోగం నాకు మహదానందదాయకమైంది. నేను నా జీవితాన్ని పిల్లలకే అంకితం చేశాను."


"సున్నిత మానవ సంబంధాల భాషలో చెప్తే, ఈ పుస్తకం ఉపాధ్యాయుని హృదయానికీ అంకితం ఇవ్వబడింది. బాల బాలికలు చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని ఎలా గ్రహించాలి. వాళ్లకు అభ్యసించడానికి ఎలా సహాయపడాలి. వాళ్ళ మేధోశ్రమని ఎలా సులభతరం చెయ్యాలి. వాళ్ళ హృదయంలో ఉన్నత భావాలూ అనుభూతులూ ఎలా జాగృతం చేసి పదిలం చేయ్యాలి. మానవ గౌరవ భావన, మానవుడు మంచి వాడన్న విశ్వాసం యెలా పాదుకొల్పాలి, సోవియెట్ మాతృదేశానికి తమ ప్రేమని ఎలా ఇవ్వాలి, గ్రహించగల శక్తి ఉన్న వివేకానికి, సున్నిత పసివాళ్ళ హృదయానికి ఉన్నత కమ్యూనిస్టు ఆదర్శాల పట్ల తొలి భక్త బీజాలని ఎలా సంతరింపచెయ్యాలి అనే దాన్ని నేను చెప్ప ప్రయత్నించాను" అని పుస్తక రచన లక్ష్యాన్ని విశిష్టతను పేర్కన్నాడు.


ఒక్క సాహిత్య సంబంధమైన విషయానికి కాదు. ప్రతి భాషా సమాజ సమూహాల్లోనూ వివిధ విషయ సంబంధ రచనలకు ముందుమాట రాయించే సంప్రదాయం ఉంది. తెలుగులో మహాకవి శ్రీశ్రీ 'మహాప్రస్థానం'కు చలం 'యోగ్యతాపత్రం' పేరిట ముందుమాట రాశాడు. దీనిలో చలం ప్రస్తావించిన అంశాలపై ఇప్పటికీ సాహిత్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో చలం అంటాడు "తన కవిత్వానికి ముందుమాట రాయమని అడిగితే, కవిత్వాన్ని తూచేరాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం.” “తూచవద్దు అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ" అని చెపుతూ శ్రీశ్రీ కవిత్వం, దృక్పథం, సాహిత్య వైఖరులు, ప్రపంచ పోకడలు, ప్రజల ఉదాసీనత, కవిత్వం ఎలా ఉండాలి లాంటి ఎన్నో విషయాలను చలం ఉద్వేగభరితంగా ప్రస్తావించాడు. చలం ముందుమాట చదివితే ఇంకెన్నో విషయాలు ఆకళింపు చేసుకోవచ్చు.


వేంకటపార్వతీశ్వర కవులు రాసిన 'ఏకాంతసేవ'కు మరొక ప్రసిద్ధమైన ముందుమాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించాడు. కృష్ణశాస్త్రి చెప్పిన విషయాలు ఎంతో విలువగలవి, ఏకాంత సేవ వెలువడిన తరువాత కాలంలో అవే భావకవితా లక్షణాలుగా స్థిరపడ్డాయి. కృష్ణశాస్త్రి మాటలో "ఆంధ్ర సారస్వత చరిత్రములో నౌక నూతన శకము ప్రారంభమైనది. కవులు బయలుదేరినారు. ప్రాత కవులవంటి వారు గానమొనర్చుచున్నారు. వెనుకటి వారివలెఁగాడు. విషయంలో మార్పు, రీతిలో మార్పు, స్వరంలో మార్పు. ఔను, కాలం మారినప్పుడు కాలంలోఁబరిస్థితులన్నియు మారినప్పుడు కవిత్వం మాత్రం మారకుండునా" అని అడుగుతాడు. భావ కవిత్వం పేరిట కొత్త తరహా కవిత్వం రానున్న విషయాన్ని భావ కవిత్వ లక్షణ, స్వభావాన్ని కూడా కృష్ణశాస్త్రి ఈ 'ముందుమాట'లో అంచనావేశాడు. కృష్ణశాస్త్రి కవిత్వంలో వచ్చిన మార్పును గుర్తించటమే కాకుండా దానిని ఆహ్వానిస్తున్నాడు. ఈ ముందుమాటలో కృష్ణశాస్త్రి 'నవ్యకవులు' అనే పదప్రయోగం చేశాడు. నవ్యకవులు ఎలాంటివారో కూడా ఇందులో చెప్పాడు. "నవ్యకవులకు స్వేచ్ఛ ప్రాణం, వీరు ప్రాణమైనఁ గోల్పోవుదురుగాని శృంఖలములు ధరింపరు. వీరికి బ్రాణముకన్న గానము తీపు - సంకెలలో సంగీతమా? కట్టుబాటులో గవిత్వమా?" అని భావకవుల స్వేచ్ఛా ప్రియత్వం ఎలా ఉందో తేల్చి చెప్పాడు. దీనిలో నవ్యకవుల గుణశీలాలు చెప్పడం గమనించదగింది. నవ్యకవులను 'ప్రకృతికి బిడ్డలు' అనటం ద్వారా ఆ కవుల ప్రకృతి ఆరాధన గురించి సూచించాడు. కృష్ణశాస్త్రి ముందుమాటవల్ల ఏకాంతసేవను గౌరవించి ఆదరించడమెలాగో నేర్చుకుంది తెలుగు పాఠకలోకం.


'ముందుమాట' వల్ల ప్రయోజనాలు ఎన్నో ముందుమాటను ఆధారంగా చేసుకుని గ్రంథ ప్రత్యేకతను గ్రహించే వీలుంది. సాహిత్య, సాహిత్యేతర రచనలపట్ల ఒక అభిరుచిని ముందుమాటలు కలిగిస్తాయి. ముందుమాట రచనను ఏ కోణంలో, ఏ దృక్పథంలో చూడాలో తెలుపుతుంది. 

ఒక నిర్ణీత కాలవ్యవధిలో వచ్చిన కవిత్వ సంపుటాలు, కథా సంకలనాలు, ఇతర రచనలకు రాసిన ముందుమాటల ఆధారంగా సాహిత్యాభిరుచి, సాహిత్య ఆదరణను అంచనావేయవచ్చు. ముందుమాటలు సాహిత్య విశ్లేషణ, ప్రశంసకు మాత్రమే కాకుండా సాహిత్యం చరిత్ర నిర్మాణానికి ఉపకరిస్తాయి. వివిధ వాదాలు, ధోరణులు, ఉద్యమాలు నడిచిన తీరును సమీక్షిస్తాయి. ఒక రచనను మనం చదివే ముందు ఆ రచనకు రాసిన ముందుమాటను చదివి దాని ఆధారంగా ఆ రచన విలువను బేరీజు వేయవచ్చు. ఉత్తమ పఠనాభిలాషకు, ఉత్తమ సాహిత్యాభిరుచికి ముందుమాటలు దోహదకారులుగా నిలుస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

వ్యాస రచనా పద్ధతులు Degree 5th semester Telugu

పేదలకు న్యాయం జరగాలి