వ్యాసరచనలో భాషాప్రయోగాలు డిగ్రీ 5వ sem

 వ్యాసరచనలో భాషాప్రయోగాలు


భావవ్యక్తీకరణకు భాష ఒక సాధనం. పదజాలం ద్వారా అది ఆలోచనలు, సమాచార వినిమయానికి దోహదం చేస్తుంది. వ్యక్తులు తమను తాము వ్యక్తం చేసుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి భాష ఒక వాహికగా పనిచేస్తుంది. ప్రక్రియ ఏదైనా పరమార్ధం అదే. ఆధునిక కాలంలో వ్యాసం మిగతా ప్రక్రియల కంటే ఈ కర్తవ్యాన్ని ఎక్కువగా నిర్వర్తిస్తున్నది.


-వ్యాసంలో భాష ఎంతో ముఖ్యమైనది. వ్యాసంలోని సారాంశాన్ని పాఠకుని దగ్గరకు చేర్చేది అందులోని భాషనే. కాబట్టి అందుకు అనుగుణమైన భాషను వ్యాసంలో ప్రయోగించాలి. పలుకుబడులతో కూడిన జనవ్యవహార భాష పాఠకుని హృదయానికి హత్తుకుంటుంది.


భాష ఒక నదిలాంటిది. అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. పిల్ల కాలువలా ఉద్భవించి మధ్యలో ఉపనదులు, వాగులు, వంకలు, కాలువలను కలుపుకొని ముందుకు సాగుతుంది. దేనినీ నిరాకరించదు. అది క్రమంగా మహానదియై విస్తరిస్తుంది. భాష కూడా అలాంటిదే. సాహిత్య రూపం పొందిన భాష సజీవ స్రవంతిలా వృద్ధి చెందుతుంది. ఇతరు భాషా పదాలను తనలో మేళవించుకొని వికసిస్తుంది. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా శాస్త్రసాంకేతికరంగ పారిభాషిక పదాలను కూడా తనలో కలుపుకుంటుంది. అవన్నీ సాహిత్యరూపాల్లో వ్యక్తమవుతాయి. జనవ్యవహార భాషతో పాటు శాస్త్రసంబంధ భావనలను ప్రతిబింబించే పదాలు తెలుగువ్యాసంలో వ్యక్తమవుతున్నాయి.


కాలక్రమంలో సంస్కృత, ప్రాకృత, తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా, హిందీ వంటి భారతీయ భాషలు, ఆంగ్లం, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్ లాంటి విదేశీ భాషా పదాలతో తెలుగుభాష ఎంతో విస్తృతమైంది. ఆదాన ప్రదానాలతో పరిపుష్టమైంది. తిరుపతి వేంకట కవులు 'కాలము బట్టి, దేశమును గాంచి, ప్రభుత్వము నెంచి, దేశ భాషా లలితాంగి మారుటది సత్కవి సమ్మతమౌట' అనటంలో ఉద్దేశం అదే. కాలం, దేశం, పాలకుల ప్రాధాన్యతలను బట్టి భాష మార్పులకు లోనవుతుందని వారి సూత్రీకరణ. ఆ మార్పు అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు వ్యాసంలోనూ వచ్చింది.

రచయిత ప్రజలకు ప్రతినిధి. ప్రజల ఆరాట పోరాటాలను అక్షరాలలోకి తర్జుమా చేస్తాడు. ఆయా రంగాలు, విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రజల్లోకి పంపిస్తాడు.. అది వ్యాసం ద్వారా ఎక్కువ మంది వద్దకు వెళ్తుంది. రచయిత కలం నుంచి వెలువడే వ్యాసం మానవ చైతన్యానికి, బుద్ధి వికాసానికి దోహదం చేస్తుంది. ప్రజల అక్షరాస్యతా స్థాయి వృద్ధి చెందుతున్నకొద్దీ తెలుగు వ్యాసం విశాలత్వం అనంతంగా పెరిగిపోయింది. 

ఆరంభదశ

తొలుత వ్యాస రచన చేసిన సామినేని ముద్దు నరసింహం గ్రాంధిక భాషలోనే వ్యాసాలు రచించాడు. పానుగంటి లక్ష్మీనరసింహారావు 'సాక్షి' వ్యాసాలు గ్రాంథికంలో ఉన్నా అప్పటి వ్యవహార శైలికి దగ్గరగా ఉన్నాయి. వాడుక భాషలో రాసి గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి తెలుగు వ్యాసానికి ఔన్నత్యం కల్పించారు. సాహిత్యం, చరిత్ర పరిశోధన, నైతిక విలువలు, దేశభక్తి వంటి అంశాలను కూడా సరళ గ్రాంధిక భాషలోనే వెలువరించారు.


అనంతర కాలంలో పత్రికలు భాషా ప్రయోగాలకు వేదికలుగా నిలిచాయి. జనవాణి పత్రిక సంపాదకునిగా తాపీ ధర్మారావు తన వ్యాసాల్లో జనవ్యవహార భాషకు పట్టం కట్టాడు. సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దిరాజు సోదరులు తెలంగాణ తెలుగుకు ప్రాధాన్యతనిస్తూ వ్యాసాలు రచించారు. అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠకుల ఆదరణ పొందడానికి పత్రికలు భాషను ఆధునీకరిస్తూనే ఉన్నాయి. నిత్యం సరళీకరణ చేసుకుంటూ భాషాపరమైన ప్రయోగాలతో కసరత్తు చేస్తున్నాయి. సమాజ అవసరాలకు అనుగుణంగా కొత్త పదజాలాన్ని సృష్టించుకుంటున్నాయి. ఆ పదజాలం విద్య, కులం, మతం, ప్రాంతం, వృత్తి వంటి అంశాల ఆధారంగా వైవిధ్యంతో కూడి ఉంటుంది. 

ఆధునిక దశ

వ్యాసం లక్ష్యం నెరవేరాలంటే భాష సరళ సుబోధకంగా ఉండాలి. వ్యాసం అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలి. 'ప్రజల భాషలో రాయడం తమ హెూదాకు తక్కువని భావించేవారు. రాసే శ్రమ తీసుకోనక్కర లేదు' అన్న టాగోర్ మాటలు ఇక్కడ గమనించదగినవి.


ప్రాచీన సాహిత్యం వల్ల సంస్కృత, ప్రాకృత పదాలు వస్తే, బ్రిటిషు పాలన ఫలితంగా ఆంగ్ల పదాలు తెలుగులో ప్రవేశించాయి. అవి గుర్తు పట్టలేనంతగా కలిసిపోయాయి. ఆంగ్లపదాలకు తెలుగు ప్రత్యయం జోడించి బస్సు, రోడ్డు, పెన్ను, పేపరు, చైరు, టేబులు వంటి లెక్క లేనన్ని పదాలు నిత్య వ్యవహారంలో నిరక్షరాస్యులు కూడా వాడుతున్నారు.


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిపెట్టిన సౌకర్యంతో అభివృద్ధి ప్రతీకలను, ఫలాలను తెలుగులోకి అనువదించుకుంటున్నారు. కొత్త పదాలు తయారుచేసుకుంటున్నారు. అందులో అర్ధానికి కాకుండా వ్యవహారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ను 'పాలనాధికారి' అని ప్రయోగించడం అందుకు ఉదాహరణ. సెల్ ఫోన్ను 'చరవాణి' అని, అవుట్ సోర్సింగ్ను 'పొరుగు 'సేవలు' అనే పదాలను రూపొందించారు. గతంలో కాంట్రాక్టర్ అనే పదానికి ఇప్పుడు 'గుత్తేదారు' అని వాడుతున్నారు. నాయకుల కాన్వాయ్ ని 'వాహనశ్రేణి' అంటున్నారు. ఇంటర్నెట్ 'అంతర్జాలం' పేరును వ్యాప్తిలోకి తెచ్చారు. ఇంతకు ముందు ఫైనాన్స్ మినిస్టర్ ను విత్తమంత్రి' అనేవారు. ఇప్పుడు 'ఆర్ధికమంత్రి' అంటున్నారు. క్యాబినెట్ అనే పదానికి 'మంత్రివర్గం' అని స్థిరపడిపోయింది. భాష సరళీకరించే క్రమంలో త్రాగునీరును తాగునీరు అని వాడుతున్నారు. ఈ ప్రయోగాలను వ్యాసాలు స్థిరపరుస్తున్నాయి..


ఇలా నిరంతరం సమాచార వ్యాప్తికి అనువైన, సులువైన పదాల కోసం శోధన జరుగుతున్నది. రచయితలు సృష్టించిన, తయారుచేసుకున్న పదాలు తెలుగు వ్యాసాలలో ప్రయోగించబడుతున్నాయి. పాఠకుల ఆదరణ పొందిన పదాలు కొనసాగుతున్నాయి. పొందనివి. మరుగున పడుతున్నాయి. ఇంతకు ముందు రైలును 'పొగబండి' అన్నారు. బొగ్గుతో నడవడం, దాని నుంచి పొగ వెలువడటంతో ఆ పేరుతో వ్యవహరించారు. బొగ్గు ఇంజన్లు అంతరించి. పోయాయి. తర్వాత వచ్చిన డీజిల్ ఇంజన్ల నుంచి కూడా పొగ రావడంతో ఆ పేరు కొంతవరకు చెల్లుబాటు అయింది. ఇప్పుడు పొగ అసలే వెలువడని విద్యుత్తు రైలును పొగబండి. అనలేకపోతున్నారు. రైలు అనే పేరుతోనే వ్యవహరిస్తున్నారు. అలాగే విమానం అనే పదానికి గాలిమోటరు, లోహ విహంగం అనే పదాలు ఉన్నా విమానం అనేదే ప్రాచుర్యంలోకి వచ్చింది.. 'టూవీలర్'ను ద్విచక్ర వాహనం అంటున్నారు. ఇది జన వ్యవహారంలో స్థిరపడిపోయింది. కానీ 'ఆటోను త్రిచక్ర వాహనం అనడం ప్రచారంలోకి రాలేదు.


కొన్ని సందర్భాల్లో భాషాపరమైన సంకరం చేసి కొత్త పదాలు, పదబంధాలను సృష్టించుకుంటున్నారు. అలాగే సంకర పదబంధాలను కూడా సృష్టించుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకు ఓటర్ల జాబితా, బడ్జెట్ ప్రసంగం, వేర్వేరు గ్రూపులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వంటి పదాలలో ఒకటి ఆంగ్లం కాగా మరొకటి తెలుగు పదం.


ఆంగ్లంలో ప్రసిద్ధమైన వ్యాసాల నుంచి అనువాదం చేసేటప్పుడు రెండు రకాలుగా పదసృష్టి జరుగుతున్నది. ఒకటి పదానువాదం, రెండోది భావానువాదం. పదానువాదానికి ఉదాహరణ కుటుంబ సంక్షేమం (ఫ్యామిలీ వెల్ఫేర్), ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్), భావానువాదం చేసుకున్న వాటిలో ట్రెజరీ బెంచ్ అనే పదాన్ని 'అధికార పక్షం' అని, ప్రివిలేజ్ మోషన్ 'సభా హక్కుల ఉల్లంఘన' వంటి ప్రయోగాలు వాడుతున్నారు.

సమాజం ఆధునీకరణ చెందుతున్న క్రమంలో భాష ప్రజాస్వామికీకరణకు లోనవుతుంది. నూతన భావాల వ్యక్తీకరణ, వ్యాప్తికి అనువైన సాధనంగా భాష పరిణతి చెందుతూ ఉంటుంది. ప్రజల అన్ని అవసరాలకు పనికి వచ్చే ఆధునిక ప్రసార సాధనంగా భాష పరిణతి చెందుతుంది... ఎందుకంటే సమాజాభివృద్ధి, భాషాభివృద్ధి రెండూ పెనవేసుకున్న అంశాలు. పరస్పర ప్రభావితాలు పరస్పర పూరకాలు కూడా,


సృజనాత్మక రంగంతో పాటు పరిపాలన, న్యాయ, ప్రసార మాధ్యమాలు, విజ్ఞాన రంగాలలో జ్ఞానప్రసారం చేయడంలో కీలక సాధనంగా ఉపయోగపడుతున్నది. ఆ ' నేపథ్యంలో వచనం ద్వారా భావప్రసారం చేయడానికి వ్యాసం ముఖ్యమైన వేదిక. 

తెలంగాణ భాషా చైతన్యం

తెలంగాణ భావన గల కాళోజీ వంటి రచయితలు మొదట్నుంచి స్థానిక పలుకుబడులు ప్రయోగించి రచనలు చేశారు. తెలంగాణ అస్తిత్వ చైతన్యం పెరిగిన తర్వాత దాని ప్రభావం అన్ని ప్రక్రియలపై పడింది. వ్యాసంలోనూ ఆ ప్రభావం గమనించవచ్చు. కాళోజీ మాటలు చూడండి- 'ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లే, ఈ బానిస భావన పోవాలి. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల -భాష పలుకు బడుల భాషగావాలె. ఓ స్వచ్ఛమైన అనువజ్ఞుడు చెప్పిన ముచ్చటలా కాళోజీ భాష ఉంటుంది. పై మాటల్లో క్రియాపదాల వాడకాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి.


బహుభాషావేత్త సామల సదాశివ 'యాది' వ్యాసాలు తెలంగాణ నుడికారాలకు పట్టుగొమ్మలు, వాటిలో తెలుగుతో పాటు ఉర్దూ భాషా మాధుర్యం కూడా తేనెలూరుతుంది. 'యాది' వ్యాసాల్లో తెలంగాణ భాషాసొగసులు చిన్న చిన్న వాక్యాల్లో వెలుగులీనుతాయి. ఆయనది నిరాడంబర వచనం. సుబోధకమైన శైలి. తరచూ 'ఔ మల్ల నేను అదిలాబాదోన్నే' అంటారు. మరలా" రూపమే మల్ల' అని ప్రయోగించడంలో సదాశివ విశిష్టత కనిపిస్తుంది. 'యాది' చదువదగిన మంచి వ్యాసాలు పుస్తకం.


కవిత్వం, కథలు, నవలల వలె తెలంగాణ భాషా ప్రయోగం వ్యాసాల్లో కనిపించక పోయినా చాలామంది రచయితల్లో తెలంగాణతనం అంతర్లీనంగా గుబాళిస్తుంది. రవ్వా శ్రీహరి, ముదిగంటి సుజాతారెడ్డి, అల్లం రాజయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కాలువ మల్లయ్య, బి.ఎస్. రాములు వంటి రచయితలు ఇక్కడి భాషా చైతన్యాన్ని, నుడికారాలను రంగరించి వ్యాసాలు రచించారు. తెలిదేవర భానుమూర్తి 'చల్నే దో బాలకిషన్' శీర్షికతో తెలంగాణ పల్లెభాషలో రాసిన వ్యాసాలు చెప్పుకోదగినవి. ప్రత్యేకరాష్ట్ర భావజాలం విస్తృతమవుతున్న దశలో స్థానీయ భాషా ప్రయోగాలతో కూడిన చక్కని రచనలు వెలువడ్డాయి.

క్రియా పదాలు తెలంగాణ భాష విశిష్టతను చాటిచెబుతాయి. నందిని సిధారెడ్డి జై తెలంగాణ వ్యవహారిక భాష తీరుతెన్నులు' అనే వ్యాసంలో "మానవుని జీవన అవుసరం 3 నుంచి భాష పుడుతది... లోకంలోని జ్ఞానమంతా భాష రూపంలనే ఉంటది. విశేషమైన అనుభవసారమంతా భాష రూపంలనే వ్యక్తీకరించబడుతది' అంటాడు. 'పుడుతది, ఉంటది, బడుతది అనేవి తెలంగాణకు ప్రత్యేకమైన క్రియారూపాలు, తెలంగాణా భాషా పదాలకున్న వాద గుణం, మాధుర్యం నలిమెల భాస్కర్ వ్యాసాల్లో చూడవచ్చు: 'తెలంగాణ పదకోశం'లో ''కడుపులోని మాట' అనే వ్యాసంలో పిలిచెటోడు మంచిగనే పిలిచిండు. పోయేటోనివి మంచిగనే పోతున్నవ్. ఇంతకూ నీకు తెలంగాణ భాషోత్తదా? అని ఇంట్లో ఎదురైన ప్రశ్నను వ్యాస ప్రారంభంలో ప్రస్తావించాడు. పదోత్పత్తి రీత్యా తెలంగాణ పదాలకు ఉన్న ప్రామాణికత వివరిస్తూ మెత్తగా ఉండేది 'మెత్త' (దిండు), గోళాకారంలో ఉండేది 'గోలీ' (మాత్ర) వంటి పదాలు ఉదహరించాడు. నాగుంబాము (నాగుపాము), తాంబేలు (తాబేలు), చాంతాడు (చేరత్రాడు), రాంగ (రాగా), తెల్లందాకా (తెల్లవారు దాకా) వంటి పదాలలో అనుస్వారం వల్ల కలిగిన నాదమాధుర్యం గమనించవచ్చు. గోంగూరను 'పుంటికూర' అని, సొరకాయను 'అనిగెంకాయ" అని రాయడానికి ఇక్కడి రచయితలు నామోషీగా భావించడం లేదు.


భాషా ప్రయోగంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సొంత మార్గంలో నడిచిన రచయిత శైలి విలక్షణంగా ఉంటుంది. దేవులపల్లి రామానుజరావు రాసిన 'యాభై సంవత్సరాల జ్ఞాపకాలు' లోని ఈ వ్యాసశకలం గమనించండి.


'ఆ రోజుల్లో హైదరాబాదులో ఏ ముఖ్యమైన సాహిత్య సభ జరిగినప్పటికిని అధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి. అందుకు కారణం ఆయన బహు గ్రంథావలోకనం, వైదుష్యం, గోలకొండ పత్రిక సంపాదకత్వం, సాహిత్యరంగంలో సమున్నత స్థానం. ప్రతాపరెడ్డి గారికి ఒక అలవాటు ఉండేది. అదే సకాలంలో సభను ప్రారంభించవలెననే పట్టుదల, సరిగ్గా సభ జరిగే కాలానికి కొన్ని నిమిషాల ముందు వచ్చి ఉపన్యాసకులు, సమావేశకర్తలు వచ్చినా రాకపోయినా నిర్ణయించిన సమయానికి స్వయంగా వెళ్లి అధ్యక్షస్థానంలో కూర్చొని సభను ప్రారంభించేవారు.


ఏది ఏమైనా వ్యాసరచనలోని భాషా ప్రయోగ లక్ష్యం పాఠకుడే. కనుక పాఠకునికి బోధపడటమే ప్రధానం. భాష అందుకు తగినట్లుగా ఉండాలి. వ్యాసరచనలో భాషా విషయమై ఈ నిబంధనలు పాటించడం మంచిది.


1. వ్యాసంలో అస్పష్ట, అనవసర పదాలు ఉపయోగించకూడదు. 2. వ్యాసంలోని మూల విషయానికి సంబంధం లేని పదాలు ప్రయోగించవద్దు. 3. విసుగు పుట్టించే మాటలు, దీర్ఘవాక్యాలు ఉండకూడదు. 4. అర్ధపరంగా పునరుక్తి లేని పదాలే వాడాలి. ఉదా- నల్లని కాటుక కళ్ళు, తెల్లని పాల వెన్నెల.

మనిషి అనుభవ సారాన్ని తెలిపే విశేషమైన పదాలు, పదబంధాలు, పలుకుబడులు, జాతీయాలు, సామెతలు వ్యాసానికి వన్నె తెస్తాయి. వ్యాస వస్తువు ఏది తీసుకున్నా దానికి తగిన భాష ఉండాలి. అది ప్రజల జీవభాష అయి ఉండాలి. జనవ్యవహారంలోని భాషాపదాలు తార్కిక పద్ధతిలో, క్రమమైన కూర్పుతో విషయం చుట్టూ పేర్చుకుంటూ పోతే చక్కని వ్యాసం. రాయవచ్చు. ప్రయత్నించి చూడండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?