పుస్తక సమీక్ష Degree 5th sem Telugu

 

పుస్తక సమీక్ష పుస్తక రచయితకు, పాఠకుడికి మధ్య వంతెన లాంటిది. సాహిత్యంలో అస్పష్టత, అన్వయ క్లిష్టత పెరుగుతున్న నేటి కాలంలో సమీక్షా వ్యాసం ఎంతో ప్రజాదరణ పొందుతున్నది. అవగాహనకూ, అనుభూతికి పుస్తక సమీక్ష తోడ్పాటునందిస్తున్నది. సాధారణ పాఠకుడికి మార్గదర్శనం చేస్తూ పఠనాభిలాషను పెంపొందిస్తుంది. పుస్తక సమీక్ష దూరతీరాల్లో ఉన్న సహృదయ పాఠకుడి దగ్గరికి పుస్తకాన్ని చేరవేస్తుంది.


' ఈక్ష' అనే ధాతువుకు 'సం' అనే ఉపసర్గ చేరి 'సమీక్ష' అనే పదం ఏర్పడింది. అంటే లోతుగా చూడడం, పరిశీలన, అవగాహన, అన్వేషణం, ఆలోచన అనే అర్ధాలున్నాయి. విమర్శ. సమీక్ష రెండూ ఒకటి కాదు. రెండింటి మధ్య సన్నటి విభజనరేఖ ఉంది. విమర్శ అంటే 'గుణదోష వివరణ' సమీక్ష అనే పదానికి శబ్దరత్నాకరము 'చక్కగా చూచుట', 'వెదుకుట' అనే అర్ధాలనిచ్చింది. ఆంగ్లంలోని Review అనే పదానికి సమానార్ధకంగా తెలుగులో 'సమీక్ష' అనే పదాన్ని వాడుతున్నారు. ఆంగ్ల సాహిత్య పరిచయంతో తెలుగులో సమీక్ష మరింత పరిణతి సాధించింది. ముద్రణా సౌకర్యాలు పెరగడం, పత్రికలు పెరగడం, విరివిగా పుస్తకాలు వెలువడటం ఇత్యాది కారణాల వలన గ్రంథ సమీక్ష ఒక ప్రత్యేకమైన సాహిత్యాంగంగా అభివృద్ధి చెందింది.


సమీక్షావ్యాసానికి కొంత సాహిత్య విమర్శ స్వభావం ఉన్నది. శైలిలో జర్నలిజం లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నది. సమీక్ష వ్యాసానికి గల శక్తి చర్చనీయత. ఏ పుస్తకమైనా దాని ప్రయోజనాన్ని ఎంత వరకు సాధించిందో వివరించడంతో పాటు పుస్తకం నాణ్యతను, ప్రాధాన్యతను తెలుపుతుంది.


నిర్వచనం


ఒక పుస్తకాన్ని లోతుగా చదివి, పూర్తిగా అవగాహన చేసుకొని పుస్తక ప్రాధాన్యాన్ని, నేపథ్యాన్ని తెలుపుతూ మంచితో పాటు లోటు పాటులను కూడా సూచిస్తూ చేసే రచనే పుస్తక సమీక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తక హృదయావిష్కరణే పుస్తకసమీక్ష.

పద్దతులు

పుస్తక సమీక్షను ఎన్నో పద్ధతుల్లో చేస్తారు. ఏ పద్ధతిని పాటించి సమీక్ష చేసినా పుస్తకం ఆత్మను పట్టించే సమీక్ష ఉత్తమమైందిగా చెప్తారు.

1. పరిచయాత్మకం:

 దీన్నే ఉపరితల సమీక్ష లేదా గ్రంథపరిచయం అని కూడా పిలుస్తారు. దీనికి పెద్ద ప్రతిభా వ్యుత్పత్తులు అవసరం లేదు. సాధారణంగా ఇది కేటలాగులాంటిరి 'విశ్వంభర' కావ్యాన్ని రచించింది సి. నారాయణరెడ్డి. ఇది కవితా ప్రక్రియలో దీర్ఘకవితా శాఖకు చెందింది. ఆదిమానవుడి తొలి అడుగుల నుంచి ఇప్పటి సాంకేతిక దశ మానవున్ని ప్రస్థానమంతా ఇందులో కవితారూపం దాల్చింది. ప్రచురణ వివరాలు, పుటల సంఖ్య వెల, లభించుచోటు రాస్తారు. ఈ పద్ధతిలో కొత్త రచయితలను ప్రోత్సహించడం.

 

2) వివరణాత్మకం: 

ఒక పుస్తకంలోని అన్ని విషయాలను వివరంగా చర్చించడం, వస్తువు, కథాసారాంశం, పాత్రపోషణ, సందేశం, సంభాషణలు, సాహిత్యంలో దాని స్థానం మొదలైన విషయాల ఆధారంగా చేసే సమీక్ష.. 2.


3. విశ్లేషణాత్మకం: 

పుస్తకాన్ని చాలా లోతుగా చదివి, ఆలోచించి చేసే విమర్శన్నమాటు . తీసుకున్న వస్తువేమిటి, ఏ శైలీ, శిల్పాల్లో రాశాడు. రచయిత ఎంత వరకు విజయం || సాధించాడు. రసపోషణ ఎలా ఉంది. ఏ వర్గాల వారికి ఉపయుక్తం. ఏ దృక్పథంతో రాశాడు మొదలైన విషయాల వెలుగులో సాగే సమీక్ష. ఇది విజ్ఞులు ఒప్పుకున్న విలువలు, సాహితీ ప్రమాణాల ఆధారంగా సాగే సమీక్షగా చెప్పొచ్చు. సామాజిక


4. చారిత్రాత్మకం: 

ప్రచురణ పొందిన పుస్తకం ఆ కాలంలోనే ఎందుకు వెలువడింది. దాని వెనకగల చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని కారణాలను చర్చించడం ఇందులో కనిపిస్తుంది. ఎప్పుడో ముద్రణ పొందిన పుస్తకాన్ని ఇప్పటి స్థల, కాలాల దృష్టితో చూడడం. ఉదా. మహాభారతాన్ని ఇప్పటి కాలానికి అనువర్తింపజేస్తూ సమీక్షించడం.


5. తులనాత్మకం: 

ఏవేని రెండు పుస్తకాలను, అందులో వర్ణితమైన వస్తువులను, స్థల, కాలాలను ఆధారంగా చేసుకొని చేసే సమీక్ష. రెండుభాషల మధ్య, రెండు ప్రాంతాల మధ్య, రెండుతరాల మధ్య వ్యత్యాసాన్ని, సామీప్యతను చెప్పవచ్చు. ఒకే వస్తువు మీర వచ్చిన రెండు పుస్తకాలనూ సమీక్షించవచ్చు.


ప్రయోజనాలు


"ఆధునిక సాహిత్య ప్రయోగాలు వెలువడినంత వేగంగా వాటిని గురించిన విశ్లేష గాని, వివేచనగాని, తత్త్వదర్శనంగాని, సాహిత్య సమాలోచనంగాని, పారిభాషిక పద కల్పను గాని, ప్రయోగశిల్పరహస్యాలుగాని, ప్రక్రియా స్వరూపస్వభావాలుగాని సాహిత్య క్షేత్రంలోకి రావు. ఈ అంశాలన్నీ ఆవిష్కృతమైతే తప్ప ప్రయోగాల విలువలు ప్రపంచితం కావు. సాహిత్య పరిణామగతి నిరూపితం కాదు. వికాసదశాస్ఫూర్తి ప్రసన్నం కాదు. ఈ అవగాహనను సాహిత్య రంగంలో కల్పించే బాధ్యత ఈనాడు సమీక్షా వ్యాసం స్వీకరించింది" అంటాడు జి.వి. సుబ్రహ్మణ్యం.. ఎంత పుస్తక ప్రేమికుడైనా మార్కెట్లోకి వచ్చిన ప్రతి పుస్తకాన్ని చదవలేదు. కాబట్టి అనివార్యంగా సమీక్ష మీద ఆధారపడవలసిందే. కొత్త రచయితల పుస్తకాన్నయితే ముందుగా దాని మీద వచ్చిన సమీక్షలను చదివి, కొనాలో వద్దో నిర్ణయించుకుంటాడు. వేగవంతమైన జీవన విధానంలో ఎవరు ఏ పుస్తకం అచ్చు వేస్తున్నారో తెలుసుకోవడం కష్టమే. అటువంటి పరిస్థితుల్లో ఈ సమీక్షలే కొత్త పుస్తకాల వివరాలు, వాటి మంచి చెడులను అందిస్తాయి. ఈ క్రింద ఒక నమూనా పుస్తకసమీక్షను పరిశీలిద్దాం.


సంక్షుభిత సందర్భంలో 'వేపచెట్టు'


ఈ కథలు ప్రపంచీకరణని వ్యతిరేకించే కథలు కావు. ప్రపంచీకరణ పట్ల వ్యతిరేకత తప్ప మిగతా గందరగోళాన్నంతా సందర్భాన్ని చర్చకు పెట్టే కొన్ని పాత్రల చిత్రణలు అనో లేదా వాటి చుట్టూ అల్లిన సన్నివేశాలు అనో అంటే బావుంటుంది. అందుకే పెచ్చుపెరిగిన సామ్రాజ్యవాద దాడిలో ధ్వంసమవుతున్న విలువలకీ, మానవ సంబంధాలకీ అధివాస్తవికతా ప్రతీకలుగా తయారైన పాత్రలు. ఇది ఇలాగే ఇంత సహజంగానో అసహజంగానో జరుగుతుందా! అనే దిగమని కలిగిస్తాయి... అన్ని విలువల్ని వదిలేసి 'ఏవిధంగానైనా' డబ్బు సంపాదించడమే. అభివృద్ధిగా భావించిన గాలివాటంగాళ్ళు ఈ సంపుటిలో చాలా మంది కనిపిస్తారు.


'కామన్వెల్తు'లోని ఎల్లాకర్ అందుకు సరైన ఉదాహరణ. ఒక పాజిటివ్ పాత్రని సృష్టించే క్రమంలో రచయిత చేతి నుంచి జారిపోయిన ఆ పాత్ర పచ్చి అవకాశవాదిగా 'ఎదిగింది'. ఈ పాత్రలన్నిటి వెనుకనున్న అదృశ్యశక్తుల గురించి ఆలోచించమని పాఠకుల్ని ఒక్క క్షణం నిలబెట్టగలిగితే రచయిత సఫలమైనట్టే. ఈ క్రమంలో తమ ఉపాధుల్ని, వృత్తుల్ని, సంస్కృతిని, అస్తిత్వాన్ని, సర్వస్వాన్ని కోల్పోతున్న వాళ్ళనిగానీ, జీవితంలో ఎటువంటి ఎదుగుదలకీ నోచుకోని వాళ్లనిగానీ ప్రధాన పాత్రలుగా చేసుకొని కథల్ని నడిపి ఉంటే వీటి ప్రయోజనం వేరుగా ఉండేది. -ఎ. కె. ప్రభాకర్


వేపచెట్టు (కథలు) రచన: బి.ఎస్. రాములు,


వెల: రూ. 100, పేజీలు: 150, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,


సమీక్షకుడి లక్షణాలు


సమీక్షకుడు అంటే "ఏ పనియైనను చక్కగా యోచించి చేయువాడు" అన్నారు. సమీక్షకుడు. ముందుగా మంచి చదువరి అయి ఉండాలి. విషయ పరిజ్ఞానం కాస్త ఎక్కువ ఉండాలి.. రచయిత కన్నా తాను అధికుడిననే భావన ఉండకూడదు. సంయమనం, సహృదయత ఉండాలి. పుస్తకంలోని విషయం మీద ఆసక్తి ఉండాలి. ఆ పుస్తకంపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. నిష్పక్షపాత దృష్టి ఉండాలి. ప్రపంచంలో వెలువడుతున్న ఏ పుస్తకం నిష్ప్రయోజనమైంది కాదు. దేని పాఠకులు దానికి ఉంటారు. కాబట్టి ప్రతిపుస్తకాన్ని సానుకూలం దృష్టితోనే చదవాలి. సమీక్ష చేసే వ్యక్తి ఏదో ఒక్క సిద్ధాంతానికి కట్టుబడి ఉండకూడదు. 

సమీక్ష రాసే విధానం


మంచి సమీక్షలు సాహిత్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతాయి. పుస్తక సమీక్ష రాయడానికి నిర్దిష్టమైన పద్ధతి ఏదీ లేదు. ఇది పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిత్వం మీద ఉంటుంది. అలాగే సమీక్ష ఇంతే ఉండాలని కొలమానం ఏమీ లేదు. ఒక పేరాలో ఆధారపడి రాయవచ్చు. ఒక పెద్ద వ్యాసంగానూ రాయవచ్చు. పైన ఉదాహరించిన సమీక్షను మరోసారి చదవండి.


ఏదైనా పుస్తకం మీద సమీక్ష రాయాలంటే ముందుగా ఆ పుస్తకాన్ని విమర్శనాత్మక దృష్టితో, ఏకాగ్రతతో, లోతుగా, ముందస్తు నిర్ణయాలతో కాకుండా ఓపెన్ మైండ్ చదవాలి వీలయితే నోట్స్ రాసుకోవాలి. పుస్తకం చదివేటపుడే టెక్స్ట్లోని కీలక పదాలను హైలైట్ చేసుకోవాలి. ముఖ్య భాగాలను, పదాలను, వాక్యాలను గుర్తించాలి. పుస్తకాన్ని ఎంత ఎక్కువసార్లు చదివితే అంత బాగా అర్థం అవుతుంది. ప్రతిసారి భిన్నమైన కోణంలో చూడడానికి వీలవుతుంది. పుస్తకంలోని నిర్మాణాత్మక అంశాలను రాసుకోవాలి. పుస్తకం దాని శైలిలో, అధ్యయన రంగంలో సరిపోయిన తీరును గమనించాలి.


పుస్తకం అర్ధం కాకపోతే అర్థం చేసుకోవడానికి ఇతర వనరుల మీద ఆధారపడాలి. ఒక నవల మీద సమీక్ష రాస్తున్నప్పుడు అదే అంశం మీద వచ్చిన ఇతర పుస్తకాలను చదివి అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కథల్ని లేదా నవలల్ని సమీక్షిస్తుంటే ఈ అంశం మీద వచ్చిన చరిత్ర పుస్తకాలను, సినిమాలను, డాక్యుమెంటరీలను, వ్యాసాలను, కరపత్రాలను, ఆత్మకథలను, జీవిత చరిత్రలను చదివి ఆనాటి సామాజిక పరిస్థితులను, అవగాహనను, పరిధిని విస్తృత పర్చుకోవాలి. పుస్తకం ప్రధాన వాదన ఏమిటి? ఇతివృత్తం ఏమిటి? నిర్ణయించుకోవాలి. పంక్తుల మధ్య (Between the lines) పాఠకుడు గ్రహించే మొత్తం సందేశాన్ని గ్రహించాలి. థీమ్, పుస్తకంలోని సార్వత్రిక ఆలోచనలను పసిగట్టాలి.


చాలా పుస్తకాలకు ముందుమాటలుంటాయి. వాటిని క్షుణ్ణంగా చదవాలి. పుస్తకం ఇతివృత్తం, దృక్కోణం, దృక్పథం ఇందులో ప్రస్తావిస్తారు. పుస్తకం సారాంశాన్ని ఒక వాక్యంలో లేదా కొన్ని వాక్యాల్లో కుదించి చెప్పాలి. పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారో వారికి ఈ శైలి, భాష, విషయం సరిపోతుందా? లేదా? అని ప్రశ్నించుకోవాలి. ఈ విషయానికి, వస్తువుకు ఈ ప్రక్రియ, భాష, శైలి వ్యక్తీకరించే విధానం సరిపోయిందా? గమనించాలి. పుస్తకంలో వర్ణనలు కాల పరిమితి, పాత్రల వికాసం జరిగిన తీరును విశ్లేషించుకోవాలి. నాన్్ఫక్షన్ అయితే కవరేజీ, విశ్లేషణ, విమర్శ కుదిరిన విధానాన్ని చర్చించాలి. రచన సమగ్రతను, రచయిత మిగిల్చిన ఖాళీలను పరిశీలించాలి.


పుస్తకం ఉపరితల పరిశీలన కూడా చేయాలి. ఆకృతి, లే అవుట్, బైండింగ్, టైపోగ్రఫీ, ముఖచిత్రం, అంతర చిత్రాలు, పట్టికలు మొదలైనవాటిని పరిశీలించాలి. ఇవి పుస్తక ఇతివృత్తానికి ఏ మేరకు దోహదకారో పరిశీలించాలి. కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన పుస్తకం అంటే నవల, కథ, నాటకం, పద్యకావ్యం లేదా ఆత్మకథ, జీవిత చరిత్ర.. లాంటివైతే వాటిలో కథాంశం అభివృద్ధి చెందిన తీరును, పాత్రల అమరిక, వాటి మానసిక స్థితి, కంఠస్వరాన్ని విశ్లేషించాలి. పుస్తకం ప్రత్యేకతను, ఈ ప్రక్రియకు, ఈ ఇతివృత్తానికి జోడించిన సమాచారాన్ని మదింపు చేయాలి. రచయిత కళా ప్రక్రియ ప్రస్తుత నియమాలను, నిబంధనలను సవాలు చేస్తూ రాస్తే దాన్ని పేర్కొనాలి. పుస్తకం ఉద్దేశాన్ని కూలంకషంగా చర్చించాలి. రచయిత పుస్తకాన్ని ముగించిన విధానాన్ని తెలిపాలి. ఈ పుస్తకం ఏ పాఠకులకు ఉపయుక్తంగా ఉందో చెప్పాలి,


మనం రాసే పుస్తక సమీక్షకు ఒక శీర్షిక పెట్టాలి. ఉదాహరణకు 'కవిత్వ సాధకులకు ఆకర గ్రంధం', 'తెలంగాణ కథాత్య', 'జ్ఞాపకాల్లో జీవితసారం', 'సంక్షుభిత సందర్భంలో 'వేపచెట్టు' మొదలైనవి. తరువాత పుస్తకం గురించిన పరిచయం రాయాలి. మంచి పరిచయం పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా పాఠకులు మిగిలిన సమీక్షను కూడా చదవడానికి ఆసక్తి చూపి ముందుకు వెళ్తారు. పరిచయంలో రచయిత నేపథ్యం లేదా పూర్వసమాచారం ఇవ్వవచ్చు. ఆ కళా ప్రక్రియలో వారి మునుపటి కృషి, ఆ రంగంలో వారి స్థానాన్ని చర్చించవచ్చు. ఆ పుస్తకాన్ని ఎలా చూడాలో ఒక సూచన ఇవ్వాలి. మనం రాసే ప్రతి వాక్యం ఆ పుస్తకానికి సంబంధించినదేనని నిర్ధారించుకోవాలి.


సమీక్షా వ్యాసానికి శీర్షిక, పరిచయం రాసిన తరువాత పుస్తక ఇతివృత్తం, ప్రధానాంశం, సారాంశం రాయాలి. సారాంశం క్లుప్తంగా ఉండాలి. దీనికి మద్దతుగా పుస్తకం నుంచి కోట్స్ ఇవ్వవచ్చు. పుస్తకం అసలు సారాంశాన్ని మార్చి రాయకూడదు. పుస్తక ప్రారంభం, కొనసాగింపు, ముగింపు వివరాలు ఇవ్వకపోవడం మంచిది. దీని వల్ల పాఠకుడికి పుస్తకం చదవాలనే ఆసక్తి పోతుంది. పుస్తకాన్ని మూల్యాంకనం చేయాలి. పుస్తకం అసలు ఉద్దేశం, సారాంశాన్ని పట్టు విడుపులతో చెప్పాలి. మనకు ఇష్టమైన రీతిలో విశ్లేషించాలి. ఇదే మన సమీక్షకు హృదయం వంటిది. ఉదాహరణగా ఇచ్చిన సమీక్షలో ఇవన్నీ ఉండడం గమనించవచ్చు.


పుస్తకంలో ఏవైనా వివాదాస్పద అంశాలుంటే చర్చించాలి. పుస్తకం లక్ష్యం, ఇతర పుస్తకాలతోగల పోలిక, విభేదనను వివరించాలి. నమ్మశక్యంకాని, తిరోగామి విషయాలేమైనా ఉంటే పేర్కొనాలి. దీనికి మద్దతుగా కొటేషన్స్ ఇవ్వాలి. ఇది మన దృక్యోణాన్ని నమ్మదగిన మూలాధారంతో బలోపేతం చేయడమేగాక, పుస్తక రచనా శైలి, కంఠస్వరాన్ని పాఠకుడికి తెలియజేస్తుంది.


సమీక్షను పేరాలుగా విభజించాలి. చెప్పే విషయం మారినపుడు పేరా మార్పు చేయాలి. రచయిత రాసిన టెక్స్ట్ ను, దృష్టికోణాన్ని పట్టుకొని వివరించాలి. రచయిత లేవనెత్తుతున్న ప్రధానమైన ఆలోచనలను వివేచించాలి. సమీక్షకు స్వీకరించిన పుస్తకం పద్యమా, గద్యమా, వ్యాసమా,ఫిక్షన్, నాన్ ఫిక్షన్, కవిత్వం, నవల, ట్రావెలాగ్, జ్ఞాపకాలు, ఆత్మకథ, జీవితచరిత్ర వంటిదేదైనా నిర్దిష్టశైలిలో, ప్రక్రియా స్వభావాన్ని పాటించిన తీరును చర్చించాలి. కంఠస్వరానికి తగిన భాష, పదాలు, వచనం ప్రతిబింబించిన పద్ధతిని గమనించాలి. మన వాదనకు సరిపోయిన కొటేషన్స్ మాత్రమే ఇవ్వాలి. మన ఆలోచనల సారాంశంతో సమీక్షను ముగించాలి. ఏదేమైనా సమీక్షను నిష్పాక్షికంగా చేయాలి. రచయితను కులం, మతం, వాదం, రాజకీయ దృష్టితో చూడకుండా ఉంటే మంచిది.


మన వ్యాఖ్యానాల మీద కొటేషన్ మార్క్ు అవసరం లేదు. పుస్తకం నుండి ఏవైనా ఎత్తిరాస్తే వాటి చుట్టూ కొటేషన్ గుర్తులు ఉపయోగించాలి. హడావుడిగా పుస్తక సమీక్షకు పూనుకోవద్దు. రాసిన సమీక్షను కొన్ని రోజులు పక్కన పెట్టి, తదుపరి బయటకు తీసి తాజా కళ్లతో, ఆలోచనతో తిరిగి చదవాలి. భాషాదోషాలు, అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. విరామ చిహ్నాలు, లోపాలు కోసం మరోసారి చదవాలి. ప్రతి వాక్యం చివర విరామ చిహ్నాన్ని ఉంచాలి. అక్షరాల మధ్య, పదాల మధ్య సరైన వ్యవధి ఇవ్వాలి. చివరిసారిగా ఇంకోసారి చదువుకోవాలి. సమీక్ష పుస్తకాన్ని చదవడానికి ప్రేరణ కలిగించాలి. ఆఖరున పుస్తకం వివరాలు ఇవ్వాలి. రచయిత పేరు, ప్రక్రియ పేరు, పేజీలు, వెల, పుస్తకం లభించు స్థలం మొదలైనవి. ఉదాహరణగా ఇచ్చిన సమీక్షలో ఈ వివరాలు ఎలా ఇచ్చారో గమనించండి.


శ్రీశ్రీ సమీక్షలు చదవడానికి విరసం ప్రచురించిన 'వ్యూలు.. రివ్యూలు' అనే పుస్తకం చూడవచ్చు. ఇంకా సర్దేశాయి తిరుమలరావు, విద్వాన్ విశ్వం, కోవెల సుప్రసన్నాచార్య సి.నారాయణరెడ్డి మొదలైన వారు రాసిన సమీక్ష వ్యాసాలను కూడా చదవచ్చు. రాచమల్లు రామచంద్రారెడ్డి పుస్తక సమీక్షలు కూడా చదవదగ్గవే. ఆయన పుస్తక సమీక్షను ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లాడు. వీటితోపాటు ఇప్పుడు వస్తున్న దిన, వార, పక్షపత్రికలలో, ఆన్లైన్ పత్రికలలో వస్తున్న పుస్తక సమీక్షలను విమర్శనాత్మక దృష్టితో చదివితే సమీక్షలు ఎలా రాయాలో తెలియడంతోపాటు సమకాలీన అంశాలెన్నో బోధపడుతాయి.


మంచి సమీక్ష కోర్టు తీర్పుకంటే కూడా విలువైంది. సాహిత్య సృజనకన్నా పుస్తక సమీక్ష చేయడం కష్టతరమైంది. వ్యక్తిగత దూషణలకు పోకుండా కేవలం వాచకాన్ని ఆధారంగా చేసుకొని 'లోనారసి' చేసే గ్రంధసమీక్షలు మార్గదర్శకంగా నిలుస్తాయి. సమీక్ష కొంతమంది. రచయితలను చంపేస్తుంది. మరికొంత మంది రచయితలు కాని వారిని కూడా ప్రోత్సహిస్తుంది. మంచి సమీక్షలు ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో చెప్పడమేగాక రచయితలకు, విమర్శకులకు, పరిశోధక విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తాయి. పాఠకులకు సాహిత్యాభిరుచిని, పఠనాసక్తిని కలిగిస్తాయి. అందుకే మంచి సమీక్ష రాయడం ఎప్పటికీ సవాలే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?