సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు Degree 5th sem Telugu

సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు


పాటలు, గేయగాథలు, సామెతలు, పొడుపు కథలు, తోలుబొమ్మలాటలు, యక్షగానం, కోలాటం మొదలైన రూపాలలో శ్రామికవర్గాల సాహిత్యం ప్రజలలో సజీవంగా ఒక తరం నుంచి మరో తరానికి కొనసాగుతున్నది. దీనినే మనం విద్యాసంబంధ పాఠ్య ప్రణాళికలలో జానపద సాహిత్యం అంటున్నాం. ఇది కాకుండా మార్గ సాహిత్యంగా ఉండిన కావ్యాలు, ఇతిహాసాలు సామాజిక ప్రతిబింబాలుగా కోకొల్లలుగా వచ్చాయి. వేదాలలో ఉన్న భావాన్ని పురాణంగా, ఇతిహాసంగా, సాహిత్యంగా మార్చి ప్రజలలోకి తీసుకొచ్చారు. వేదం రాజులాంటిదని, పురాణం మిత్రుల వంటిదని, కావ్యం కాంత వంటిదని మన పెద్దలు చెప్పారు. వేదంలోని విషయాలను, పురాణంలోని అంశాలను సున్నితంగా, రసాత్మకంగా అందరికీ అర్ధమయ్యేలా ప్రేమగా చెప్పవలసిన అవసరం ఆనాటి సమాజానికి ఏర్పడింది. కనుక ధర్మశాస్త్రాలు, ప్రకృతి శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు, మంత్రగత విషయాలు, నీతిశాస్త్రాలు, వైదిక విషయాలు మొదలైన శాస్త్ర సంబంధ అంశాలన్నింటిని సాహిత్యంగా మార్చి చెప్పటం వలన ప్రజలు ఆకర్షితులయ్యారు. ఆనాటి సమాజానికి సాహిత్యం రూపొందవలసిన అవసరం ఏర్పడింది. మనిషిలో ఉండే సహజాతమైన ఉద్వేగాలు, సామాజిక సంబంధాలు కళాత్మకంగా వ్యక్తమవుతాయి,

ప్రకృతి, శ్రమ, ఆట, పాట, సామూహిక జీవితం, వేట మొదలైనవన్నీ కళాత్మకంగా నిర్మాణమయ్యాయి. కనుక వీటి చలనాన్ని అక్షరీకరిస్తూపోతే దానికదిగా సాహిత్యం అవుతుంది. చదువురానివాళ్లు అల్లుకుంటూ పోతే, అది సాహిత్యంగా మారుతుంది. పాట, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కళాత్మక వ్యక్తీకరణలే. ఈ కళలే సాహిత్యానికి జీవం, జీవితం. సామాజిక జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని మన కవులు సౌందర్యాత్మకంగా రాస్తూ పోయారు. అలా రాసిందల్లా సాహిత్యంగా పరిణామం చెందింది. ఏ శాస్త్రం నెరవేర్చలేని సామాజిక ప్రయోజనాన్ని సాహిత్యం నెరవేర్చింది. మనిషి జీవితంలో అవిభాజ్య అంశంగా సాహిత్యం మారింది. '

సాహిత్యం నిర్వచనం

శ్రీ వాఙ్మయం, సారస్వతం, సాహిత్యం అను పదాలను ఒకే అర్థంలో వాడుతున్నారు. కానీ సూక్ష్మంగా చూస్తే వీటి అర్థాలలో భిన్నత్వం ఉంటుంది. లిఖిత, అలిఖిత సమాచారమంతా వాఙ్మయం. అక్షరరూపం దాల్చిన ప్రతీ విషయం సారస్వతం అవుతుంది. కేవలం కళాత్మక | వ్యక్తీకరణను సాహిత్యం అంటారు. కానీ ఆంగ్లంలోని లిటరేచర్ అనే పదానికి అక్షరబద్ధమైన సమాచారమంతా అనే అర్ధాన్ని చెబుతున్నారు. మనం ఇక్కడ సాహిత్యమంటే సామాజిక జీవితాన్ని సౌందర్యాత్మకంగా వ్యక్తం చేసే రచయిత కలాపమని అర్ధం చేసుకుందాం.


'హితేన సహితం సాహిత్యమ్' అని సంస్కృతంలో అంటారు. అంటే మేలును చేకూర్చేది. సాహిత్యమని అర్ధం. నీతిని బోధించి, ధర్మ ప్రతిపాదనను చేసేది సాహిత్యం. సకల శాస్త్రాల సమ్మేళనం సాహిత్యం. ప్రాకృతిక విషయాలను కూడా సౌందర్యవంతంగా చెప్పేది సాహిత్యం. తద్వారా చదువరిని ఆనందమయం చేస్తుంది. కావ్యం రాసేవాళ్లు క్రాంతదర్శులుగా ఉంటారు. కనుక వారి రచన ఉపదేశంతో కూడి ఉంటుంది. అందుకే ప్రపంచ శ్రేయస్సును కాంక్షించి రాసేది సాహిత్యం. కాలాతీతంగా ప్రజలందరికి ఆనందాన్ని చేకూర్చేది సాహిత్యం, సాహిత్యం ఒక జాతి ఉనికిని, విస్తృతిని, భిన్నత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక అంశాలలో ముఖ్యమైన సాహిత్యంలేని జాతులను మనం ఊహించలేం. సకలశాస్త్ర విషయాలతో కూడుకొన్నది. సాహిత్యమని నిర్వచించుకుంటే, అందులో కవిత్వం, కథ, నవల, నాటకం మొదలైనవన్ని సాహిత్యంగా పరిగణిస్తాం. నిస్సారంగా చెప్పే భాషా నైపుణ్యం ఎన్నటికి సాహిత్యం కాదు. మన జీవితం భిన్నరసాలతో మిళితమయినప్పుడు సాహిత్యం కచ్చితంగా రసాత్మకంగా ఉండి తీరాలి. అయితే కేవలం రసాత్మకం మాత్రమే కాకుండా సృజనాత్మకతను కూడా సాహిత్యం. సంతరించుకోవాలి. ఆధునిక యుగారంభంలో మానవతను పునాదిగా చేసుకొని సమాజంలో సమభావనను వ్యాపింపచేసే లక్షణం సాహిత్యానికి ఉండాలని కోరుకున్నారు.


రాను రాను సాహిత్యాన్ని ప్రకృతి, మనిషి కోణంలో చూసే దృష్టి పెరిగింది. సామాజిక శాస్త్రాల అభివృద్ధి తర్వాత, ప్రకృతి శాస్త్రాలు ఇచ్చిన శాస్త్ర జ్ఞానంతో రచయితలలో సాహిత్య దృక్పథం మారింది. సంప్రదాయ దృష్టి నుంచి శాస్త్రీయ కోణాన్ని సాహిత్యానికి అన్వయించటం మొదలయింది. అందుకే ప్రకృతి ఆరాధన స్థాయి నుంచి కళాత్మకంగా చూసే దృష్టియే సాహిత్యంగా భావించారు. దేనికైనా మనిషే కేంద్ర బిందువు. సాహిత్యాన్ని రక్తమాంసాలున్న మనిషి లేకుండా ఊహించలేం. సుదీర్ఘ కాలంలో మనుషులు ఎన్నో అనుభవాలను సొంతం చేసుకొని ఉన్నారు. ఆ అనుభవాల కళాత్మక వ్యక్తీకరణనే సాహిత్యంగా మనం భావించవచ్చు. అయితే మనిషికి మెదడు ఉంది, ఆ మెదడు చలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంది. భూమ్యాకాశాల గురించి ఎన్నింటినో భావిస్తుంది. ఇలాంటి అనేక భావాలతో కూడిన వ్యక్తీకరణనే సాహిత్యంగా ఉంటుంది.

మనం సాహిత్యాన్ని విడి అంశంగా కాకుండా సామాజిక సంబంధాలలో భాగంగానే అర్ధం చేసుకోవాలి. సాహిత్యానికి అమూర్త భావన పునాది ఎంత ఉందో, మూర్తభావన పునాది కూడా అంతే ఉంది. ఈ రెండు భావాలను అధ్యయనం చేస్తున్న క్రమంలో సాహిత్యం పట్ల ఒక శ్రీ స్పష్టత ఏర్పడాలి. సాహిత్యం కేవలం రచయితలకు, పాఠకులకు సంబంధించిన విషయం - మాత్రమే కాదు, సాహిత్యం పూర్తిగా సామాజిక జీవితానికి సంబంధించినది. ఎందుకంటే రచయితలు, పాఠకులు కూడా సమాజంలోని మనుషులే, కనుక సమాజమే సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. తిరిగి సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సమాజంలోని మనుషులలో రూపొందే భావజాలాన్ని కూడా సాహిత్యం ప్రభావితం చేస్తుంది. సాహిత్యం ఒక సామాజిక వ్యవస్థ. కనుక సమాజాలకు పరిణామక్రమం ఉన్నట్లే సాహిత్యానికి కూడా అభివృద్ధి క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సమాజంలోని వ్యవస్థలన్ని/రాజ్యం, కుటుంబం, ఆస్తి, కులం, మతం) సాహిత్యంలో ప్రతిఫలించిన తీరు అర్ధమవుతుంది.


మనిషి భావాలకు రూపాన్నివ్వటమే సాహిత్యమని మనం బయలుదేరుతే తార్కిక ముగింపు దగ్గర ఆగుతాం. సాహిత్యం వ్యక్తమయ్యే మాధ్యమం భాష, భాష కూడా సామాజిక జన్యమే. భాష దానికదిగా సాహిత్యం కాదు. అలా అయ్యేటట్లు అయితే శాస్త్ర గ్రంథాలన్ని సాహిత్యమే అవుతాయి. సామూహిక సృష్టిగా ఉండే భాష, సామాజికమై జీవితాన్ని కళాత్మకంగా దర్శించే సందర్భంలో సౌందర్యాత్మకతను పొందుతుంది. శ్రమజీవుల నుంచి పుట్టిన భాష తిరిగి వారి జీవితాన్ని కళాత్మకంగా వ్యాఖ్యానిస్తుంది. కనుక భాషను ఆశ్రయించుకొని ఉన్నంతకాలం సాహిత్యానికి జీవితం ఉంటుంది. సాహిత్యానికి వస్తువు, రూపం రెండు కళ్లు అయితే సమాజంలో పుట్టిన భావాలను ఆలంబనగా చేసుకొని సాహిత్య వస్తువు రూపొందుతుంది. భావాలు సామాజికమైనప్పుడు సహజంగానే సాహిత్యం కూడా సామాజికమే. సామాజిక చరిత్రలోని ఒక కాలాన్ని తీసుకొని ఆనాటి భావాలను, సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే రెండింటి మధ్య అభేదం కన్పిస్తుంది. కనుక సామాజిక చరిత్ర, భావాల చరిత్ర, సాహిత్య చరిత్ర ఒకే సరళరేఖలో సాగుతాయి. అందుచేత భావాలు, సాహిత్యం సమాజ ఉమ్మడి ఆస్తి, సాహిత్యంలో సమాజం, రచయిత, రచన, పాఠకులు ఉంటారు. ఈ నాలుగు ఒక దానితో ఒకటి సంబంధాలలో ఉంటాయి.


సాహిత్య అధ్యయన ప్రయోజనాలు


ప్రయోజనం, వ్యాపారం, కార్యం, వ్యవహారం పర్యాయపదాలుగా వాడుతున్నాం. సాహిత్య ప్రయోజనం అంటే సాహిత్యం నిర్వహించే సామాజిక పాత్ర అని అర్ధం. సాహిత్య ప్రయోజనాన్ని మనం కేవలం సాహిత్య కోణంలోనే, పరిమితులలోనే చూడకూడదు. చరిత్ర, రాజకీయార్థిక అంశాలు పునాది, ఉపరితలంలో అవి నిర్వహించే పాత్రను ప్రామాణికం చేసుకొని సాహిత్య ప్రయోజనాన్ని చూడాలి. శ్రమ నిర్వహించే పాత్ర, శ్రమ విభజన మొదలైన అంశాల ప్రాతిపదిక పరిశీలించినప్పుడే సాహిత్య ప్రయోజనాన్ని శాస్త్రీయంగా విశ్లేషించగలుగుతాం. సాహిత్య అధ్యయన ప్రయోజనాలను సౌలభ్యం కోసం ఐదు రకాలుగా విభజన చేసుకుందాం.

 1. సామాజిక ప్రయోజనాలు 2. రాజకీయ ప్రయోజనాలు 3. సాంస్కృతిక ప్రయో జనాలు 4. వైయక్తిక ప్రయోజనాలు 5. సాహిత్య ప్రయోజనాలు.


సామాజిక ప్రయోజనాలు: 

సాహిత్యం సమాజానికి విడిభాగం కాదు. దానికొక ప్రత్యేక అస్తిత్వం లేదు, సాహిత్యానికి పునాది, ఉపరితలం సమాజమే. సాహిత్య రచన ఎన్ని తీర్లుగా వ్యక్తమైనా దాని అంతిష ప్రయోజనం సమాజాన్ని వ్యాఖ్యానించటమే. సామాజిక సమస్యలను ప్రతిబింబించి వాటికి పరిష్కారాలను మానవీయంగా, ఆత్మీయంగా చూపెట్టే శక్తి సాహిత్యానికి ఉంటుంది. మార్పు కోసం జరిగే సామాజిక చలనాలను ఆశ్రయించి అక్షరగుణాన్ని పొందే సాహిత్యం తిరిగి సామాజిక ఆకాంక్షలకు అద్దం పడుతుంది. ఏ సామాజిక సిద్ధాంతాన్నైనా సాహిత్యం కళాత్మకంగా వ్యక్తం చేస్తుంది. సమాజాన్ని, ప్రకృతిని మార్చటానికి రచయితలకు సాహిత్యమిక బలమైన సాధనం. మనుషులు నిత్య జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వారి జీవిత గమనానికి అవి ఆటంకంగా మారుతాయి. ఇలాంటి సందర్భంలో ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి, శక్తిమంతం చేసే సాధనం సాహిత్యం, మనుషులు స్వేచ్ఛాయుత జీవితానికి సామాజిక అవరోధాలు అడ్డంకిగా మారినప్పుడు, సాహిత్యం జోక్యం చేసుకుంటుంది. అవరోధాలను తొలగించటానికి కావలసిన వాతావరణాన్ని సానుకూలం చేస్తుంది. ఒక సమాజం వేరొక సమాజం అధిపత్యం కింద ఉన్నప్పుడు, ఆ అధికారాన్ని ధిక్కరించి ప్రజలను స్వేచ్ఛాజీవులుగా మార్చడానికి సాహిత్యం కృషిచేస్తుంది. వేమన, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు. రాయప్రోలు సుబ్బారావు, గుర్రం జాషువా మొదలైన వారంతా వారి సమకాలీనంలోని సామాజిక సమస్యలైన కులం, మతం, బాల్య వివాహాలు, స్త్రీ విద్య, వరకట్నం లాంటి అవరోధాలకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని ఉపయోగించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు. 

రాజకీయ ప్రయోజనాలు

రాజకీయమంటే ఒక రాజ్య యంత్రాంగం నిర్వహించే రోజు వారి కార్యకలాపాలు. ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామ్యం పొందాలనుకునే వారి ఆచరణ రాజకీయం. సమాజంలో అంతర్భాగంగానే రాజకీయాలు ఉంటాయి. దేశంలోని ప్రతి పౌరుడు రాజకీయ వ్యవస్థలో భాగస్వామిగా ఉంటారు. రాజకీయాలలో పౌరుల ఆవేశాలు ఆయా సందర్భాలలో వ్యక్తమవుతుంటాయి. అనేక రాజకీయ సిద్ధాంతాలతో సమాజంలో వైరుధ్యం నడుస్తుంటుంది.

రచయితలు జాగ్రత్తగా వీటిని గమనిస్తారు. మనిషి ఆవేశాల మీద పట్టు సాధించి సాహిత్యంగా మలుస్తారు. రాజకీయ వ్యవస్థలలో మార్పులు తీసుకురావటానికి అనేక ఉద్యమాలు నిర్మాణ మవుతాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమం, ప్రజాస్వామ్య రక్షణ కోసం రాజకీయోద్యమం, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం హక్కుల ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన అస్తిత్వ ఉద్యమాలు... ఇలా బరువుగా ఉన్న ఒక రాజకీయ వ్యవస్థ నుంచి మార్పును కోరుతూ సామూహిక స్పందనలు వ్యక్తమవుతుంటాయి. ఈ సందర్భంలో రచయిత, కవి, కళాకారుడు మౌనంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్లు కూడా పౌరులే కదా! జాతి ఉద్ధరణ కోసం సాహిత్యాన్ని ఖడ్గం వలె ఉపయోగించే శక్తి రచయితలకు ఉంటుంది.


కవులు పరపీడన పాలనకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రచనలు చేస్తారు. ఆయా సందర్భాలలో ప్రభుత్వం చేసే చట్టాలు ప్రజానుకూలంగా ఉన్నప్పుడు తమకు తాముగా రచయితలు వాటికి విస్తృత ప్రచారాన్ని కల్పిస్తారు. జాతినంతా ఒక తాటిపైన నడిపించి ఐక్యతా భావాన్ని తీసుకరావటంలో సాహిత్యం కృషిని విలువ కట్టలేం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్, గురజాడ, చిలుకమర్తి, గరిమెళ్ల సత్యనారాయణ, ఉన్నవ మొదలైన రచయితలు కవితలు, పాటలు, కథలు, నవలలు, వ్యాసాల ద్వారా ప్రజలలో జాతీయభావాన్ని కల్గించారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు ఉద్యమ ఆకాంక్షను ప్రజలలో రగిలించారు. తమ రచనలలో అస్తిత్వ ఆకాంక్షను ప్రతిబింబించారు.


సాంస్కృతిక ప్రయోజనాలు


ప్రతి సమాజానికొక సాంస్కృతిక వారసత్వం ఉంటుంది. సంస్కృతిలో ఉండే గుణాత్మక విలువలను బట్టే ఆయా సమాజాల స్థాయిని అంచనా వేస్తారు. సంస్కృతి ఒక కాలంలో వికసించి అన్నికాలాల పాటు అదే వర్ధిల్లదు. కాలానికి అనుగుణంగా మార్పులకు గురవుతుంది. అయితే వర్తమానంలో రూపొందుతున్న సంస్కృతికి గతం తాలూకు సాంస్కృతిక వారసత్వం ఉంటుంది. మన పూర్వీకుల సంస్కృతిని, విలువలను చరిత్ర నిక్షిప్తం చేస్తుంది. కానీ అదొక మ్యూజియంగా ఉంటుంది. అదే సాహిత్యమైతే సజీవంగా ప్రజలలో సాంస్కృతిక రూపాల ద్వారా ప్రచారం చేస్తూ నిలబెడుతుంది. మనిషి భావోద్వేగాల ఆధారంగా సాహిత్యం రూపొందటం వలన ప్రతి జీవిత పార్వాన్ని సాహిత్యం పట్టుకుంటుంది. లలిత కళల ద్వారా, ఇతర ప్రక్రియల ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని సాహిత్యం కాపాడుతుంది. నాగరికతలోని సంస్కారాన్ని ప్రజలలో పెంచటానికి సాహిత్యం విస్మరించలేని పాత్రను పోషిస్తుంది. మన గత కాలపు సంస్కృతి, సంప్రదాయం. సత్యాన్వేషణ సాహిత్యం ద్వారా కాక ఇంకో రూపంలో మనం తెలుసుకోలేం.


వైయక్తిక ప్రయోజనాలు


వ్యక్తి సంఘజీవి, సాహిత్యజీవి. మనిషే పాఠకుడు, రచయిత, కళాకారుడు, పాఠకుల పొందిన సంస్కారం తోనే రచయితలుగా, కళాకారులుగా వ్యక్తమవుతారు. సాహిత్య అధ్యయన ప్రయోజనాన్ని మొదట పొందేది వ్యక్తిగత స్థాయిలో మనిషే మనిషి ఆత్మసంతృప్తి కోసం సాహిత్యం, ఆనందం కోసం, సౌందర్యం కోసం సాహిత్యం అనే భావన అలంకారికుల కాలం నుంచి ఉంది. వ్యక్తి మానసిక ఉల్లాసం నుంచి సామూహిక ఆనందం విలసిల్లుతుంది. మనిషి అజ్ఞానాంధకారం నుంచి బయట పడటానికి సాహిత్యం తోడుంటుంది. మనిషి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ప్రతిఘటించడానికి అవసరమైన మానసిక శక్తిని సాహిత్యం ఇస్తుంది.. సాహిత్య అధ్యయనం మనిషిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతుంది. 

సాహిత్య ప్రయోజనాలు

సాహిత్య అధ్యయనం వలన ఇంతటి విస్తృత ప్రయోజనం ఉన్నప్పుడు సాహిత్య పరిణతికి దాని విస్తృతికి కూడా అధ్యయన ప్రయోజనం ఉండాలి. ఉత్తమ పాఠకులు ఉన్నచోట ఉత్తపు సాహిత్యం వెలువడుతుంది. ప్రతిభావంతమైన విమర్శకులు ఉన్నచోట ప్రయోజనాత్మకమైన సాహిత్య సంపద సమకూరుతుంది. సాహిత్యం తిరోగమనంలో నడవకుండా ఉండటానికి చైతన్యవంతమైన పాఠకులు ఉండితీరాలి. సాహిత్యాన్ని అభ్యాసంగా అధ్యయనం చేయటం వలన సాహిత్యాన్ని, సమాజాన్ని విమర్శించి వాఖ్యానించే శక్తి పాఠకులు పొందుతారు. ఇది సాహిత్యానికి మేలుచేస్తుంది. సాహిత్య అధ్యయనం వలననే సాహిత్యం పట్ల చైతన్యపూర్వకంగా ఆలోచించటానికి అవకాశం దొరుకుతుంది. ఫలితంగా విశ్వరహస్యాలను తెలుసుకోవచ్చు. సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో కావ్య నిర్మాణగత విషయాలను తెలుసుకుంటాం. కావ్యంలో వ్యక్తమైన సమాజం, కవుల కవితాశైలి, కావ్య స్పృహ పాఠకులకు అర్ధమవుతాయి. శ్రమ ద్వారా, ప్రయోగం ద్వారా, అధ్యయనం వలన మనిషి పొందిన అనుభవాన్ని జీర్ణింపచేసే శక్తిని సాహిత్యం ఇస్తుంది. మనిషికి జీవితం ద్వారా స్పష్టతకు రాని విషయాలు సాహిత్య అధ్యయనం వలన సంపూర్ణమవుతాయి. జీవితాన్ని విమర్శించటం, అలంకరించటం సాహిత్యం చేయగల ఉత్తమ కార్యం.


సాయంత్రం కిటికి దగ్గర ఉన్న పరదా లాగి ఓ పుస్తకాన్ని తెరచి చదవడం ప్రారంభిస్తే ఆ పుస్తకంలోని వాతావరణంలోకి మనం ఇంకిపోవాలి. అప్పుడే ఆ రచన మన విజ్ఞాన పరిధిని విస్తృతం చేస్తుంది. రచనలో పేర్కొన్న కొత్త విషయాలను నేర్చుకోవడానికి కావలసిన పద్ధతిలో అధ్యయనం చేస్తే అధ్యయన ప్రయోజనం నెరవేరుతుంది. ఏ రచనను అయిన అర్థం చేసుకోవడానికి ఒక విధానం ఉండాలి, దాని లక్ష్యం నెరవేరాలి. సాహిత్యాన్ని, కళలను ఆనందం కోసం మాత్రమే కాకుండా ప్రయోజనం కోసం చదవాలి, ఎలా చదివి సంసారాన్ని అట్టి సాహిత్య అధ్యయన ప్రయోజనం నెరవేరుతుందని ఈ కింద పేర్కొన్న స్థల ప్రయోజలను ఇట్టి నిర్ణయించవచ్చు.


1. రచన చదవటం వలన పాఠకులు ఆనందాన్ని పొందుతారు. అధ్యయనం వలన పాఠకులు జీవిత అనుభవాన్ని పొందుతారు.


3. ఒక తరం పాఠకుల శాస్త్రీయ అధ్యయనం వలన తర్వాతి తరానికి మంచి వారసత్వ అందుతుంది.

 4. అధ్యయనం వలన ఒక రచనా సారాంశం తెలుస్తుంది.

5. బాల్యంలోనే అధ్యయనం ఒక సంస్కృతిగా పరిణమిస్తే సమాజం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. బాల్యంలో చదివిన రచనలు ఎవరికైనా ఒక అందమైన స్వప్నజగత్తును నిర్మించి ఇస్తాయి. మనం మానసిక పరిపక్వత చెందే క్రమంలో అధ్యయన సంస్కృతి ఇచ్చిన సంస్కారంతో యదార్ధ జగత్తులోకి ప్రవేశిస్తాం.


6. వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా వికసింపచేసి, మనస్తత్వ నిర్మాణానికి సహాయపడి జీవితం పట్ల ఒక దృక్పథాన్ని అలవర్చుకునేటట్లు అధ్యయనం తోడ్పడుతుంది. అధ్యయన సంస్కృతిలో భాగంగానే పుస్తకాలు మన జీవితాలను మార్చివేస్తాయి.


7. నైతిక విలువలు, కులం, విజ్ఞానశాస్త్రం, కళలు, ప్రకృతి, మానవసేవ, నాగరికత- వీటన్నింటికి సంబంధించిన అనేక సందేహాలు బాల్యంలో, యౌవనంలో తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం మన చుట్టూ ఉన్న మేధో ప్రపంచం నుంచి రానప్పుడు, స్వయంగా మనమే తెలుసుకోవలసినప్పుడు అధ్యయనం తప్ప మరో మార్గం లేదు. ఈ అధ్యయన సంస్కృతి గతానుక్రమంగా ఉన్నప్పుడు సమాధానాలు వెతుక్కోవడం సులభమవుతుంది.


8. తెలుసుకోవడమనే అరుదైన లక్షణం కలిగిన మనుషులకు అధ్యయన సంస్కృతి ద్వారా


ప్రపంచ జ్ఞానం అలవడుతుంది. 3. మనకు తెలియని సామాజిక వాస్తవికతలను కథనో, కవితనో అధ్యయనం చేయటం వలన తెలుసుకుంటాం.


10. పాఠకులలో దేశం, సరైన దేశభక్తి, సామాజిక బాధ్యతల గురించి చైతన్యం ఇచ్చే ఏకైక సాధనం సాహిత్య అధ్యయనం.

11. సాహిత్య అధ్యయనం మనిషి సంస్కారాన్ని పెంచుతుంది.

12. పాఠకులు రచయిత స్థాయిని అందుకునే సంస్కారాన్ని అధ్యయనమే కలిగిస్తుంది. 13. సమాజంలోని బాల్య జీవితానికి సాహిత్య అధ్యయన సంస్కృతిని అలవాటు చేస్తే సామాజి


సంబంధాలలో పరిణతి వస్తుంది.


14. సాహిత్య అధ్యయనం వలన మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోగలుగుతాడు. సామాజిక, సాంకేతిక, తాత్విక, మేధో రంగాలను ప్రభావితం చేసే అధ్యయనం సమాజంలో ప్రవర్తించటం అలవాటు చేస్తుంది.


వేదంలోని భావజాలాన్ని కావ్యంగా ఉపదేశం చేయటమే సాహిత్య ప్రయోజనంగా ఒక కాలంలో ఉండింది. ఇంకో కాలంలో దర్మార్ధ కామ మోక్ష సాధననే సాహిత్య లక్ష్యంగా ఉన్నది.? రాజాస్థాన, అంతఃపుర సాహిత్య రచననే ఆనాటి ప్రయోజనం. వీటి పునాది మీద సాహిత్యం పరిణామం చెందుతూ సామాజిక ఆంక్షలు లేని రచయితలు చేసే వాస్తవిక జీవిత చిత్రణనే సాహిత్య ప్రయోజనంగా సాహిత్యం రూపొందుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?