జానపదం Degree 5th sem

జానపదం


భారతదేశం జనపదాలకు పుట్టినిల్లు, జనపదాల్లోనే తన ఉనికిని నిలుపుకుందీ దేశం. జనపదులకు సంబంధించింది జానపదం. జనపదం అంటే పల్లె లేదా చిన్న గ్రామం. జనపదాల్లో నివసించేవారు జానపదులు, జానపదుల జీవితం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. వారి జీవితానికి సంబంధించిన విశేషాల సమాహారాన్ని జానపద విజ్ఞానం (Folklore) అంటారు. జానపదుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, వస్తు వైవిధ్యం, ఆటపాటలు మొదలైన విషయాలను జానపద విజ్ఞానం అధ్యయనం చేస్తుంది. జానపద విజ్ఞానంపై మొదటిసారిగా దృష్టి సారించినవారు గ్రిమ్స్ సోదరులు. వీరు తమ కాలంనాటి జానపద కథల్ని సేకరించారు. ప్రజలకు ఇష్టమైన ప్రాక్తన విషయాలైన 'Popular Antquities'ను వీరు 'VolksKunde' అనే పేరుతో పిలిచారు. అలా జానపద విజ్ఞానానికి తొలిసారి VolksKunde అనే పేరు స్థిరపడింది. విలియం థామ్స్ 1846లో The Athacnacum అనే పత్రికకు రాసిన వ్యాసంలో జానపద విజ్ఞానానికి Folklore అనే పదాన్ని సూచించాడు. Folk అనే మాటకు 'నిరక్షరాస్యులైన కర్షకులని' అర్థం. Lore అనే మాటకు 'పాండిత్యం లేదా విజ్ఞానం' అని అర్ధం. నిరక్షరాస్యులైన కర్షకులకు సంబంధించిన విజ్ఞానాన్ని జానపద విజ్ఞానంగా చెప్పవచ్చు.


జానపదులు తమదైన సంస్కృతిని, జీవితాన్ని కలిగి ఉంటారు. మట్టితో పెనవేసుకుపోయిన శ్రామిక జీవితం వారి సొంతం. వారినుంచి ఉత్పత్తి అయ్యే పాటలు, ఆటలు, కళా సంబంధ విషయాలు, మట్టి పరిమళాన్ని నింపుకున్నట్లుగా ఉంటాయి. వారు చెప్పుకునే తమ పూర్వీకుల కథలు, వీరగాధలు, దైవ సంబంధ గాథలు, పురాణ కల్పనలు అన్నింటిని జానపద విజ్ఞానం తన పరిధిలోకి తీసుకుంటుంది. అందుకే జానపద విజ్ఞానకారులు జానపద విజ్ఞానాన్ని జానపద జీవితం (Folklife) అని పిలువడానికి ఇష్టపడతారు.


జానపద విజ్ఞానాన్ని 'శాబ్దికకళ' లేదా 'వాగ్రూపకళ' అని William R. Bascom అంటాడు. మానవశాస్త్ర పరిభాషలో జానపద విజ్ఞానమంటే మౌఖిక ప్రచారంలో ఉన్న పుక్కిట పురాణాలు, ఐతిహ్యాలు, జానపద కథలు, సామెతలు, పొడుపుకథలు, కవిత్వం, కళాత్మక వ్యక్తీకరణం ఉన్న ప్రక్రియలన్నీ జానపద విజ్ఞానంలోకి వస్తాయంటాడు విలియం బాస్యం.

జానపద సాహిత్యం


"జనానామ్ పదమ్ జానపదమ్" అని జానపద శబ్దానికి నిర్వచనం చెప్పారు. జనపరు శబ్దం జాతి, ప్రజల, విషయపరంగా ప్రయోగించారని యాజ్ఞవల్క్యంలో కలదు. జనపద జానపద శబ్దాలను దేశం, గ్రామం, పల్లె, జనులుండే తావు అని వివిధ నిఘంటువులు నిర్వచించాయి. ఈ జానపదుల వాగ్రూప సాహిత్యాన్ని తెలియజేసేది జానపద సాహిత్యం, జానపదుల సంస్కృతి వైభవాన్ని గురించి ఆధునికులే కాదు ప్రాచీన కవులు కూడా వర్ణించారు.


ఎర్రన భారత అరణ్యపర్వంలో 'జానపరుల్ పురీజనులు సంతనముం బ్రమదం విన్ దైన శుభోదయం హృదయంబుల గోరుచున్న వారు' అని జానపదులను పల్లె ప్రజలు, పురజనులనే అర్ధంలో సంబోధించాడు. ఎర్రన జానపదులను కేవలం పల్లెలకే పరిమితం చేయలేదు. పట్టణాలలోనూ వీరి ఉనికిని తెలియజేశాడు. పల్లీయులు, జానపదులు ఎక్కడుంటే అక్కడ జానపదత్వం ఉంటుంది. అల్లసాని పెద్దన 'దేశం' అనే అర్థంలో జానపద శబ్దాన్ని 'జనపడంద్వా పుణ్య నదీ నదంబులున్' అన్నాడు. తెనాలి రామకృష్ణకవి తన పాండురంగమహాత్మ్యంలో 'జానపదగ్రామి' అన్న మాటను ప్రయోగించాడు. దీనినిబట్టి జానపదుల ఉనికి, జానపద పదప్రయోగం లిఖిత సాహిత్యంలో తొలినాటినుంచే ఉన్నదని స్పష్టం అవుతుంది.


జానపదుల వాక్కు నుంచి వెలువడిన సాహిత్యాన్ని జానపద సాహిత్యం అంటారు. జానపదుల మాటల్లో చోటు చేసుకునే సామెతలు, పొడుపుకథలు, జాతీయాలు, పదబంధాలు, కథలు, ఐతిహ్యాలు, గాథలు, పురాణాలు, గేయాలు మొదలగునవి జానపద సాహిత్యంలో భాగంగా ఉంటాయి. జానపదుల ఆధ్యాత్మిక, ఆదిభౌతిక భావవ్యాప్తికి లక్షీభూతమైంది. జానపద సారస్వతం అంటాడు బిరుదురాజు రామరాజు. జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యం ఒక భాగమని ఆయన అన్నాడు. ఇది మౌఖిక ప్రచారం ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా సంక్రమిస్తుంది. Folk Literature, Oral Literature, Unwritten literature అనే ఆంగ్లపదాలకు 'జానపదసాహిత్యం' అనే తెలుగుమాటను బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, ఆర్.వి.ఎస్. సుందరం, తంగిరాల వెంకట సుబ్బారావు, రఘుమారెడ్డిలు స్వీకరించి ఉపయోగించారు. జానపద సాహిత్యాన్ని ఉత్తర భారతీయులు 'గ్రామ్ సాహిత్య' అని 'లోక్ సాహిత్య' అని పిలిస్తే కన్నడ ప్రజలు 'జనపదసాహిత్యమని వ్యవహరిస్తున్నారు. 

జానపద సాహిత్య లక్షణాలు


జానపద సాహిత్యానికి ముఖ్యంగా ఐదు లక్షణాలున్నాయి. అవి అజ్ఞాత కర్తృత్వం, ఆశురచన, మౌఖిక ప్రచారం, నియమిత స్వరూప రాహిత్యం, అనిర్ణీత రచనా కాలం మొదలైనవి.

 అజ్ఞాత కర్తృత్వం :

 జానపద సాహిత్యంలో కథను, గేయాన్ని ఎవరు రాశారో మనం చెప్పలేం. కేవలం ఆ సారస్వతం మాత్రమే ప్రచారంలో ఉంటుంది. సాహిత్య సృష్టికర్తకు సంబంధించిన

వివరాలేవీ. లభ్యం కావు. అందుకే అజ్ఞాత కర్తృత్వం అనేది ఒక ప్రధాన లక్షణంగా పేర్కొనబడింది. 

ఆశురచన:

 జానపదుల మనస్సులోని స్పందనలను సందర్భానికి అనుగుణంగా వెంటవెంటనే పదాలను అల్లడాన్ని ఆశురచన అంటారు. పల్లె ప్రజలు పనిలో భాగంగా తమ అలసటను మరిచిపోవటానికి అప్పటికప్పుడే పాటను కట్టి పాడడం, కథను అల్లి చెప్పుకోవడం ఆశురచనలో భాగం.


మౌఖిక ప్రచారం: 

జానపద సాహిత్యం లిఖిత రూపాన్ని సంతరించుకోకపోవడం వల్ల అధిక భాగం మౌఖిక రూపంలో వ్యక్తమవుతుంది. ఒక తరం నుండి మరొక తరానికి 'ముఖే ముఖే 'సరస్వతి' అన్నట్లు జానపద గాథలు, సామెతలు, పదబంధాలు, జాతీయాలు మౌఖిక రూపంలోనే అందుతున్నాయి.


నియమిత స్వరూప రాహిత్యం: 

శిష్ట సాహిత్యంలో మాదిరిగా స్థిరమైన వ్యాకరణ, ఛందో నియమాలు జానపద సాహిత్యంలో ఉండవు. ఈ లక్షణాన్ని నియమిత స్వరూప రాహిత్యం అంటారు. జానపద సాహిత్యం జానపదుల భావాలకనుగుణంగా సాహిత్య రూపాన్ని ధరిస్తుంది. 

అనిర్ణీత రచనాకాలం : 

జానపద సాహిత్యం ఎప్పుడు పుట్టిందో నిర్ణయించలేం. మానవ వికాస పరిణామంలో జానపదులు తమ సంస్కృతిని, ఆచార వ్యవహారాలకు సంబంధించిన విజ్ఞానాన్ని పాటలు, కథల రూపంలో తెలియజెప్పారు. అవి పుట్టిన కాలాన్ని నిర్ణయించలేం.


జానపదసాహిత్య వర్గీకరణ


జానపద సాహిత్యం ప్రధానంగా మూడు విభాగాలు, దీనిని బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, తంగిరాల వెంకట సుబ్బారావు మొదలైనవారు శాస్త్రీయంగా విభజించారు. అవి గేయశాఖ, వచనశాఖ, దృశ్యశాఖ. ఆర్.వి.ఎస్. సుందరం ప్రకారం జానపద సాహిత్యం. నాలుగు రకాలు. అవి జానపద కవిత్వం, గద్య ఆఖ్యానాలు, సామెతలు, పొడుపుకథలు.. వీటిలో సామెతలు, పొడుపుకథలు ప్రత్యేకమైనవి. ఇవి పరిమాణం దృష్ట్యా చిన్నవే అయినా. అనంతమైన జీవన పరమార్థాన్ని బోధిస్తాయి.


గేయశాఖ


జానపద సాహిత్యంలో విశిష్టమైన శాఖ గేయశాఖ. గేయాలలోని పరిమళాన్ని అందరికి పంచే ఒక సహజమైన సాహితీ విభాగం ఇది. జానపదులు తమకు ఆనందం, బాధ కలిగినప్పుడు లయాత్మకంగా వ్యక్తం చేయడానికి తీసిన కూనిరాగమే గేయంగా రూపుదిద్దుకుంది. గేయానికి పాట, గీతం, పదం అనే పర్యాయపదాలున్నాయి. ఈ పాట పుట్టడానికి గల కారకులెవరో కచ్చితంగా చెప్పలేం. పూర్వకాలంలో చెట్లు, పుట్టల వెంబడి తిరిగే మానవుడి ఆనందంలోంచి పుట్టిన ఉత్తేజగానాలు, వినసొంపైన రాగాలు, నిరాశ నిస్పృహలోంచి పుట్టిన నిస్తేజ గానాలు అన్నీ మొదట జానపదుల నుంచి పుట్టినవే. తొలుత పనిలో, ప్రయాణంలో, ఆటలో అన్నింటాగేయం జానపదుని జీవితంలో తనదైన స్థానాన్ని నిలుపుకుంది. శ్రోతలను రంజింపజేయడం దీని సహజ లక్షణం. మొదట ఆకలి, అవసరం, ఆశ్చర్యంలోంచి పుట్టిన గేయం, తరవాత కాలంలో వినోదానికి, విజ్ఞానానికి నెలవుగా మారింది. మనిషి పుట్టినప్పటి నుంచి జీవితపు చరమాంకం వరకు పాట తన ఉనికిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. గేయం వస్తువు రీత్యా అనేక రూపాల్లో దర్శనమిస్తుంది.


స్థూలంగా గేయాలు రెండు రకాలు. అవి కథా సహిత గేయాలు, కథారహిత గేయాలు, కథా సహిత గేయాలలో శ్రామిక స్త్రీల గేయాలు, వృత్తి సంబంధిత గేయాలు కనిపిస్తాయి. స్త్రీల పాటల్లో పౌరాణిక గాథలు, సామాజిక ఇతివృత్తాలు కనబడితే, వృత్తి సంబంధిత గేయాలలో వీరగాథలు, అద్భుతగాథలు, చారిత్రక గాథలు, మత సంబంధిత గాథలు ఉంటాయి. కథా రహిత గేయాల్లో స్త్రీల పాటలు, పారమార్థిక గేయాలు, కౌటుంబిక గేయాలు దృశ్యమాన మవుతాయి. వీటిలో కథ ఉండదు. కొంత వినోదం మాత్రమే ఉంటుంది..


కథాసహిత గేయాలకు పల్నాటి కథ, బొబ్బిలి కథ, కాటమరాజు కథ, సన్యాసమ్మ కథ, కాకమ్మ కథ, సీతమ్మ కథ, సర్దార్ సర్వాయి పాపన్నకథ, బీరప్ప కథ మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. చారిత్రిక గేయాలకు జానపద సాహిత్యంలో ప్రముఖ స్థానం ఉన్నది. ఇవి శ్రవణపేయంగా ఉంటూనే చరిత్రను కథా కథనంలో చక్కగా తెలియజేస్తాయి. సర్వాయి పాపన్న గౌడ్ శక్తియుక్తులను, మాతృభక్తిని తెలియజేస్తూ...


వస్తాడె తాను సర్వాయి పాపడు

తల్లి కొలువుకు వడిగా వెళ్ళేను  

తల్లికి దండము బెట్టి నిలిచెను.......


అంటూ పాడుకునే గీతం నేటి ప్రజలకు సైతం ధీరత్వాన్ని పంచుతుంది.


కథారహిత గేయాలలో..


ఒక్కేసి పువ్వేసి సందమామ 

ఒక్క జాములయె సందమామ 

సూడొచ్చె యాల్లయే సందమామ 

శివుడు రాకపాయె సందమామ...


వంటి బతుకమ్మ పాటలు ఉంటాయి. ఈ పాటలో పారమార్ధిక భావన నిగూఢంగా కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కనిపించే పూలు, ఆకాశంలో కనిపించే చంద్రుడు, అభౌతిక రూపంలో వ్యాపించివున్న శివుడిని కొలుచుకుంటూ ఈ పాట సాగడం విశేషం.

దృశ్యశాఖ

జానపద సాహిత్యంలో సుస్థిరమైన రూపాన్ని కలిగివుండి కళాత్మకంగా కనిపించేది దృశ్యశాఖ. జానపదులు ప్రదర్శించే ప్రదర్శనకళలు ఈ శాఖలోకి వస్తాయి. దృళ్ళు శ్రవణ వికాసాన్ని కలిగించేది దృశ్యశాఖ. ఇది జానపదుల సంస్కృతిని, ఆటలని, వినోదాన్ని, సృజనాత్మకత ప్రతిభా పాటవాలను తెలుపుతుంది. సినిమా, టివి, రేడియోలు లేనప్పుడు మానవుడికి వినోదాన్ని అందించింది. ప్రదర్శన కళలే. పూర్వం వీణ వాద్యాల సంగీతం, శాస్త్రీయ నృత్యాల సందడి కేవలం రాజుల ఆస్థానాలలో, దొరల గడీలలో మాత్రమే ఉండేది. శ్రమజీవులైన పేద ప్రజల వినోదం మాత్రం ఈ జానపద ప్రదర్శన కళలే. ఇంత గొప్ప ప్రాముఖ్యత గల ప్రదర్శన కళలు రెండు రకాలు. అవి మానవుడు స్వయంగా ప్రదర్శించేవి. మానవుడు ప్రదర్శింపజేసేవి. పగటి వేషాలు, వీధినాటకాలు, యక్షగానాలు, బుర్ర కథలు, హరిదాసుల కథలు, కోలాటం, బతుకమ్మ, ఆట, తప్పెటగుళ్ళు, పులివేషాలు, గుస్సాడి, ధింసా, లంబాడీ వంటివి మానవుడు స్వయంగా ప్రదర్శించే కళలు, తోలు బొమ్మలాట, గంగిరెద్దులాట, కోతులు, పాములు, ఎలుగుబంటి. వంటివాటిని ఆడించడం మానవుడు ఇతర సాధనాలు, జంతువులతో ప్రదర్శింపజేయడంలోకి వస్తాయి.

యక్షగానం

తెలుగునాట పుట్టి బాగా ప్రచారంలో ఉన్న జానపద కళారూపం యక్షగానం. యక్షులని పిలువబడే జక్కులవారు ఈ కళను ప్రదర్శిస్తారు. గేయం, వచనం, ప్రదర్శనం అనే మూడింటి కలబోతగా ఈ ప్రదర్శనకళ ఉంటుంది. యక్షగాన కళాకారులలో జక్కుల పురంద్రీ పాత్రను విశేషంగా చెప్పుకోవచ్చు. ఆమె అందంగా అలంకరించుకొని నర్తిస్తుంటే మిగతా కళాకారులు. వాద్యాలను వాయిస్తుంటారు. చిందు కళాకారులు కూడా తమదైన శైలిలో యక్షగానాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరు ఆధునిక కాలంలో వర్తమాన అంశాలపై వినూత్నమైన దృక్పథంతో ప్రదర్శనలిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.


ఒగ్గు కథ


తెలంగాణ కళారూపాల్లో ఒగ్గుకథ ఒక ప్రదర్శన కళ. ఒగ్గు అనగా శివుని చేతిలోని ఢమరుకం, ఒగ్గు కథాగానాన్ని గొల్లకురుమలు గానం చేస్తూ ప్రదర్శిస్తారు. వీరిని ఒగోళ్ళు అని కూడా అంటారు. తమ మూలపురుషుడైన బీరప్పు, మల్లన్నల శూరత్వాన్ని వీరు కథలుగా చెబుతారు. ఈ ప్రదర్శనకళలో ఒక ప్రధాన కళాకారుడు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వంతుకులు ఉంటారు. మధ్యమధ్యలో ఆడవేషం వేసుకున్న కళాకారులు ప్రేక్షకులను అలరించడం విశేషం. డోలు, తాళం, కంజీరవంటి వాద్యాలు కథాగానానికి సంగీతాన్ని అందిస్తాయి. వీరు తమకు ఎల్లమ్మ ప్రసాదించిందని భావించే గవ్వలహారాన్ని ధరిస్తారు. నేటి

 సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని కథలుగా అల్లి ప్రదర్శిస్తారు.

తోలుబొమ్మలాట


తోలుతో చేసిన బొమ్మలకు దారాలు కట్టి, వాటిని ఆటకు తగ్గట్టు లయబద్ధంగా పాట పాడుతూ ఆడించేది తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాటలో తెరవెనుక ఉన్న గాయకులు పాడుతూ సంభాషణలు చెబుతుంటే తోటి వాద్యకారులు వాద్య సహకారాన్ని అందిస్తారు. వీరి ప్రదర్శనల్లో మహాభారత, రామాయణ ఘట్టాలతో పాటు గుణసుందరి వివాహ ఘట్టం, రేణుక ఎల్లమ్మ త్యాగం వంటివి ప్రదర్శిస్తారు. గంగిరెద్దులాట


తెలుగు ప్రాంతాలలో జరుపుకునే సంక్రాంతి వంటి పండుగలప్పుడు ఈ గంగిరెద్దులవారు తమ గంగిరెద్దులను అందమైన బట్టలతో, గంటలతో, మువ్వలతో అలంకరించి ఊరూరా : తిరుగుతూ ఆడిస్తారు. గంగిరెద్దులు తన యజమాని చెప్పినట్టు రెండు కాళ్ళు వంచి నమస్కారం చేయడం, రెండుకాళ్ళపై నిలబడడం వంటి విన్యాసాలు చేస్తాయి. ఇవి జంతువుల ప్రదర్శింపబడే కళలకు ఉదాహరణలు. వచనశాఖ


జానపదుల నిత్య జీవితంలో చెప్పుకునే గేయరహితాలైన కథలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, పలుకుబడులు, పదబంధాలే కాక కథాసహితాలైన నీతి, అద్భుత, వీరగాథా సాహిత్యమంతా వచనశాఖలో చేరుతుంది. రమ్యమైన పోలికలతో జీవితాన్ని ఆవిష్కరించడం, సామెతలను ఉపయోగిస్తూ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడం, పొడుపు కథలతో కాలక్షేపం, మేధోమథనం చేయడం వంటివి జానపదుల జీవితాల్లో ముఖ్యమైనవి. ఇవి మానవ సంబంధాలకు, సామాజికపరిస్థితులకు అద్దం పడతాయి.


గేయశాఖకు, దృశ్యశాఖకు భిన్నమైనది వచనశాఖ. ఈ శాఖలో భాగమైన కథా సాహిత్యం పిల్లలను, పెద్దలను అలరిస్తుంది. వింతలు, విశేషాలు, మంత్రతంత్రాలు, అద్భుతాలు, అలౌకిక పాత్రలతో ఆద్యంతం ఆసక్తిని కలుగజేయడం ఈ కథలకున్న విశిష్టత. ఈ కథల్లో జంతువులు, మనుషులు, పక్షులు పాత్రలుగా ఉండి నైతిక విలువలను సందేశంగా అందిస్తాయి. జానపదుల అనుభవాలైన జీవనాంశాలను, వారి కాలంలో ప్రజలకోసం పోరాటాలు చేసిన అమరుల త్యాగాలను కథలుగా చేసి చెప్పుకోవడం అనాదిగా వస్తున్నది. సమ్మక్క సారక్క కథ, సర్వాయి పాపన్న కథ, లంబాడి రామన్న కథ, పండగ సాయన్న కథ వంటి వీరుల కథలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. తమ తరువాత తరాలకు యుక్తిని, అనుబంధాల తీపిని గుర్తుచేస్తూ ఎన్నో నీతికథలు పెద్దలు చెప్పడం మనం గమనించవచ్చు.

 కథ

అన్నదమ్ములు- ఒక పెళ్లి కథ. ఈ కథలో ఏడుగురు అన్నదమ్ములు ఒక నది ఒడ్డున గల అడవికి దగ్గరగా నివసిస్తుంటారు. బ్రహ్మచారులైనవారి దగ్గరకు ఒక స్త్రీ వచ్చి తాను. అడవిలో దారి తప్పిపోయానని ఆశ్రయమివ్వమని అడుగుతుంది. వారు ఆశ్రయం ఇచ్చాడ కొన్నాళ్ళకు తనని తన ఇంటికి తోలిరమ్మంటుంది. తాను ఒంటరిగా ఇంటికి వెళితే ఇన్నాళ్ళు . ఎక్కడికి వెళ్లావు అని తన వాళ్ళు తిడతారని అందువల్ల మీలోంచి ఒకరిని పెళ్ళాడుతానంటుంది.. అన్నదమ్ములలో పెద్దవాడు ఆమెను పెళ్లి చేసుకొని అడవి గుండా ఆమె ఇంటికి పయనమవుతాడు. దారిలో వాగు దాటేటప్పుడు ఆమె దయ్యంగామారి అతడ్ని తినేస్తుంది. కొన్నాళ్ళకు మళ్లీ యువకుల దగ్గరికి వచ్చి మీ సోదరుడు అలిగి మా ఇంటి వద్దే ఉన్నాడని చెప్పి కొన్నాళ్ళు ఉండి. మళ్లీ తనను అడవి దాటించమంటుంది. అలా మరో ముగ్గురు యువకులను తినేస్తుంది. ఆఖరివాడు నదిలో ముఖం కడుక్కుంటూ ఆమె ప్రతిబింబాన్ని నీటిలో చూసి ఆమె దయ్యమని పసిగట్టి పారిపోతాడు. విషయం ఊరివారందరికి చెప్పి ఆ దయ్యాన్ని తరిమి కొడతాడు. తన అన్న దమ్ములను తిరిగి బ్రతికించుకుంటాడు. ఈ కథలో యుక్తితో అపాయాన్ని గుర్తించడం, దయ్యం మానవరూపంలో రావడం వంటివి ఆసక్తికి కారణమవుతాయి.


సామెతలు


వచన శాఖలో మరో ప్రధానమైన అంశం సామెతలు, జానపదుల జీవితంలో సామెతకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అనంతమైన జీవనసారాన్ని అల్పాక్షరాలలో నింపి సందర్భాన్ని సందేశమయం చేసేది సామెత. జనులకు ఉపదేశాన్ని, లోకగతిని అందిస్తుంది సామెత. సునిశితమైన హాస్యాన్ని తోడుగా చేసుకొని వ్యంగ్యంగా లోకానుభావాన్ని పంచుతుంది. అందుకే 'సామెతలేని మాట ఆమెతలేని ఇల్లు వంటిది అన్నారు పెద్దలు, సామెత అనేది సామ్యత అనే పదం నుండి ఏర్పడింది. సామ్యత అంటే పోలిక అని అర్థం. సామెతను ఆంగ్లంలో Proverb అంటారు. హిందీలో కహావత్, కన్నడంలో గాదె, తమిళంలో పనిమొళి, మలయాళంలో పళించోల్: అని అంటారు. తెలుగులో సామెతకు నానుడి, లోకోక్తి, శాస్త్రం, జనశ్రుతి అన్న అర్ధాలున్నాయి. సామెత అనే పదాన్ని 15వ శతాబ్దంలో వరాహపురాణంలో తొలిసారిగా ప్రయోగించారు. సామెతకు నాలుగు లక్షణాలు ఉన్నాయి. అవి సరళత, సరసత, సహజత, సంక్షిప్తత,జానపదులు దేశ కాలానుగుణంగా సామెతలను వాడుతారు. 


అందుకే సామెత దేశకాల పరిస్థితులను దర్భణమానం చేస్తుంది. సామెతల్లో వ్యవసాయ, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు కనిపిస్తాయి. నేటికీ పల్లె సీమల ప్రజల నోళ్ళలో సామెతల గుబాళింపును చూడవచ్చు. సామెత బహుళ ప్రచారంలో ఉండి సంక్షిప్తంగా ఉంటుంది. విషయాన్ని నిగూఢంగా కలిగి ఎదుటి వ్యక్తి హృదయానికి తగిలే విసురును కల్గి ఉంటుంది. సామెత దానం చేయని చేయి కాయలు కాయని చెట్లు ఒకటే'


మనిషన్న తర్వాత జాలి, దయ, మమత అనేది ఉండాలి. సాటి మనిషి గురించి ఆలోచించాలి. అవసరం పడ్డప్పుడు శక్తికొలది సహాయసహకారాలు ఏదో ఒక రూపంలో చేయాలన్న సందేశాన్ని ఈ సామెత అందిస్తుంది. ఏ విధంగానైతే కాయలు కాయని చెట్టును ఎవరూ గుర్తించరో అదే విధంగా దానగుణం లేనివారిని సమాజం గుర్తించదు. దానగుణం మనిషిని అత్యున్నత వ్యక్తిత్వం కలవాడిగా తీర్చి దిద్దుతుంది.

 సామెత:

 'ఏచ్చేవాడికి ఎడమ పక్కన, కుట్టేవాడికి కుడి పక్కన కూర్చోరాదు'


పక్కన పదులకు ఉన్న లోకానుభవాన్ని, లోకం పోకడను తెలిపే సామెత ఇది. ఏడ్చేవాడు. ఎడమచేత్తో ముక్కు చీదుతూ ఉంటాడు కాబట్టి వాడికి ఎడమ పక్కన కూర్చోవద్దని, అలాగే బట్టలకు కుట్లు వేసేవాడు సూదిని కుడి చేత్తో పట్టుకుని కుడుతుంటాడు. అతనికి కుడి కూర్చుంటే ఆ సూది మనకు గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అటు హితోక్తిని కట హాస్యాన్ని మేళవిస్తూ ఈ సామెతను అల్లారు. 'ఉన్నమాట చెప్పరాదు ఊళ్ళో ఉండడారు. 'అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో లాంటివి మరికొన్ని

సామెత : 

మన దీపమని ముద్దాడితే మూతి కాలకుండా ఉంటుందా!


ఈ సామెత మానవ సంబంధాలు ఎంతవరకు హద్దుల్లో ఉండాలో తెలుపుతుంది. ముఖ్యంగా అయిన వారితో, బంధువులతో, తెలిసిన వారితో మనం చనువు కొద్ది దగ్గరైతే వారు ఎలా స్వీకరిస్తారో తెలియదు. దీపం వెలుగునిస్తుంది. ఆ వెలుగుని ఉపయోగించుకొని పనులు చక్కదిద్దుకోవాలి. అది సరియైన పని. అంతేకానీ దానిని దగ్గరకు తీసుకొని కాల్చుకోకూడదు. మన మంచి కోరేవారిని, మనకు సహాయం చేసేవారి సహాయాన్ని తీసుకొని పైకి ఎదగాలేకానీ, వారికి కోపం తెప్పించకూడదు. ఒక వస్తువును సరైన విధంగా ఉపయోగించుకుంటే చక్కటి ఫలితాన్నిస్తుంది. లేకుంటే మొదటికే మోసమొస్తుంది అని ఈ సామెతలోని భావం. 

పొడుపు కథలు

పొదుపు కథలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆలోచనకు పదునుపెడతాయి. వచనశాఖకు మరింత వన్నె తెచ్చినవి పొడుపుకథలు. జానపద విజ్ఞానంలో పొడుపు కథకు అత్యంత ప్రాముఖ్య ఉన్నది. ఎదుటి వ్యక్తిలో శోధనా సామర్థ్యాన్ని లేవనెత్తి అతనిలో జిజ్ఞాసకు కారణమవుతుంది పొడుపుకథ. పొదుపు అంటే ఉదయం. వ్యక్తిలో జ్ఞానానికి ఉదయాన్ని కలిగిస్తుంది కనుక ప్రక్రియను పొడుపుకథ అంటారు.


పొడుపుకథకు శాస్త్రం, తట్టు, ఇచ్చుకథ, మారుకథ, విప్పుకథ, విచ్ఛుకథ, అడ్డుకు అనే పేర్లు ఉన్నాయి. దీనిని ఆంగ్లంలో Riddle, ప్రాకృతంలో , ప్రహేళి, హిందీలో పహేళి, సాహిత్యం జానపదం తమిళంలో విడికతై, మలయాళంలో విడికద, కన్నడంలో నౌగటు, వడగతే, బెంగాలిలో పహేలి, పెయ్, మరాఠీలో ఉనాణ, ఆహాణ, గుజరాతిలో ఉఖానో, సింధిలో ఉఖాణి అంటారు.


మనిషిని సమస్యలు ఎదుర్కొనే విధంగా తయారుచేసేందుకుగాను సంసిద్ధం చేసేవి పొదుపు కథలు. పొడుపుకథ బుద్ధిపూర్వకమైన ద్వంద్వార్థం లేక గూఢార్థం ఉన్న వాక్యం. ఈ పొదుపు కథకు ఆరు లక్షణాలు ఉన్నాయి. అవి బుద్ధి చతురత, ఆశ్చర్యత, ఆలంకారికత, చమత్కారికత, హాస్యస్పోరకత, ప్రవృత్తి కారికత. పొడుపుకధల వికాసం మహాభారత కాలంలో జరిగింది. నీతికి, ప్రకృతి రక్షణకు, ధర్మానికి సంబంధించిన పొడుపుకథలు మహాభారతంలో చూడవచ్చు.

 పొడుపుకథ : 

‘కొనా కొమ్మ మీద మిఠాయి బెల్లం ముట్టుకోబోతే మొదటికి మోసం' (తేనెపట్టు) తేనెపట్టును ఆవరించి ఉన్న తేనెటీగలు తమ తుట్టెను ముట్టుకుంటే కలిగించే ప్రమాదాన్ని తెలియజేస్తుందీ పొడుపుకథ. తేనెటీగలు తేనెపట్టును చెట్లమీద చిటారు కొమ్మలకు అమరుస్తాయి. ఎల్లప్పుడు తమతుట్టెను అందులోని తేనెను కాపాడుతూ ఉంటాయి. తేనె తుట్టెను ముట్టుకుంటే తేనెటీగలు వెంటాడి కుడతాయి. ఈ ప్రమాదాన్ని కొంత వ్యంగ్యంతో, హాస్యంతో కూడిన మాటలో ఈ పొడుపుకథ ఇమిడి ఉంటుంది. ఈ పొడుపు కథలో మిఠాయి బెల్లం అంటే తేనే, మొదటికే మోసం అంటే తేనేటీగల వల్ల కలిగే ప్రమాదం అని అర్థం. 

పొడుపుకథ:

 'ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు' (నిప్పు)


ఈ పొడుపు కధ చదివిన వెంటనే యాపిల్ పందో, దానిమ్మ పందో మదిలో మెదులుతుంది. ఎరుపు రంగులో ఉండే పండ్లు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్న ఆలోచన మొదలౌతుంది. ఎక్కువమంది ఇలాగే ఆలోచిస్తారు. తెలివైన వారు మాత్రం భిన్నంగా ఆలోచిస్తారు. పండ్లమీద ఈగలు వాలడం సహజమే. కాని ఈ పొడుపు కథ పండుమీద ఈగ వాలదు అని చెబుతుంది. ఈ కోణంలో ఆలోచిస్తే కాని సమాధానం చిక్కడు. అగ్నిని గూర్చి అల్లిన ఈ రుపుకథ ఎదుటివారిలో జిజ్ఞాసను, శోధనా గుణాన్ని ప్రేరేపిస్తుంది.

 పొడుపుకథ : 

'రూకలెంచలేము, చాప చుట్టలేము' (చుక్కలు, ఆకాశం)


ఆకాశం చాపతో, చుక్కలను రూకలతో పోల్చి ఈ పొడుపుకథను అల్లారు జానపదులు. ఆకాశం ఎంతో విశాలమైంది. దాని ఆది, అంతం ఎక్కడుందో మానవుడు చెప్పలేదు. అలాగే, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి. వాటిని లెక్కబెట్టడం ఎవ్వరికి సాధ్యం కాదు. సాధ్యంకాని ఈ ప్రయత్నాన్ని కొంత హాస్యంతో, చతురతతో చెప్పారు జానపదులు. ఇటువంటి పొడుపుకథలు వ్యక్తిలో జిజ్ఞాసను జాగృతం చేస్తాయి. 'మిద్దెమీద మిరపచెట్టు నీకే కాని నాకు కనబడదు' (బొట్టు) 'గట్టుమీద పోరడు ముట్టంగనే ఏడుస్తడు' (డప్పు), ఇలాంటివి ఇంకెన్నో. ఉన్నాయి.


జానపద సాహిత్యం మానవుని మూలాలను దర్శింపజేస్తుంది. మానవునికి తమ పూర్వీకుల జ్ఞానసంపత్తిని పరిచయం చేస్తుంది. అనాది కాలం నుంచి ఆధునిక కాలం వరకు గల మానవ పరిణామక్రమంలో జానపదులు జ్ఞానపదులుగా ఎదిగిన తీరును మన కళ్ళకు కడుతుంది. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా తన అస్తిత్వం జానపదంలోనే ఉన్నదని గుర్తుంచుకునేలా చేస్తుంది జానపద సాహిత్యం. జోలపాటలు, లాలిపాటలు, బతుకమ్మపాటలు, వెన్నెల పదములు, తుమ్మెదపదములు, సామెతలు, పొడుపుకథలు, వీరగాథలు మొదలైనవి జానపదుల నిధినిక్షేపాలు. లిఖితసాహిత్యానికి సమాంతరంగా మౌఖిక సాహిత్య సంపదను సృష్టిస్తూ జానపదులు కాదు. జ్ఞానపదులుగా నిలుస్తున్నారు.


మనిషిని మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళమన్నాడు సోక్రటీసు. జానపద విజ్ఞాన వేత్తలు మనిషిని తమ మూలాలలోకి వెళ్ళమంటారు. అందుకు ఒకటే మార్గం ఉన్నది. అది జానపద సాహిత్య అధ్యయనం మాత్రమే. అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినట్లే జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడే మానవుడు పరిపూర్ణుడవుతాడు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem