అధ్యయన సంస్కృతి Degree 5th sem

 అధ్యయన సంస్కృతి

మన సమాజం క్రమానుగతంగా పరిణామం చెందింది. ప్రకృతిలో భాగమైన ఆదిమ. సమాజం నుంచి ఆధునిక యుగం వరకు మనుషులు సుదీర్ఘ ప్రయాణం చేశారు. ప్రకృతిలో జరిగే పరిణామాలకు కార్యకారణం తెలియక అమూర్తభావనలోకి ఇంకిపోయారు. సూర్యుడు. ఉదయించటం, వెన్నెల కురియటం, మేఘం వర్షించటం, మెరుపు మెరవటం, ఉరుము ఉరమటం, పిడుగు పడటం, భూమి చలించటం, విత్తనం మొలకెత్తటం, పువ్వు కాయగా మారటం, ఆకు రాలిపోవటం, వసంతం చిగురించటం, పక్షుల కిలకిలా రావాలు, పులి గాండ్రింపు, లేడి గంతులు, నెమలి నాట్యం ఇలా ఎన్నో మరెన్నో అద్భుతాలను తొలిమానవులు చూశారు. విన్నారు. కానీ ఆ ప్రకృతి రమణీయతను అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది.


భూమిని సాగు చేయటం, నీటికి అడ్డుకట్ట వేయటం ఆ కాలపు మనిషి సాధించిన అద్భుత ప్రగతి. 'భూమితో మాట్లాడితే జ్ఞానమిస్తుంది' అనేది సూక్తి, నిజంగా వ్యవసాయం ప్రారంభం కావటం మానవవికాసదశలో ముఖ్యమైనది. భూమిని సాగుచేస్తున్న క్రమంలో మనుషులు ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నారు. ప్రకృతిలో దొరికిన పదార్థాలను ఏ రోజుకారోజు తిని జీవించే స్థితినుంచి పంటను ఉత్పత్తి చేసి తర్వాతి కాలానికి నిల్వ చేసుకునే స్థాయికి సమాజం ఎదిగింది. జంతువులను మచ్చిక చేసుకొని వ్యవసాయంలో ఉత్పత్తి స్థాయిని పెంచారు. భూమిచుట్టూ మనిషి దృష్టికి కేంద్రీకరించడం ప్రారంభమయింది. కొందరికి సంపద పోగుపడింది. కుటుంబ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. రాజ్యయంత్రాంగం ఏర్పడింది. సాహిత్యం, కళలు రూపొందాయి. మనుషులు ప్రకృతి మీద పోరాడుతున్న క్రమంలోనే, అంటే ఉత్పత్తి క్రమంలోనే భాష పుట్టింది. ఆ భాష ఆధారంగా కళలు, సాహిత్యం వ్యక్తమయ్యాయి.


ఉత్పత్తిలో పాల్గొంటున్న మనుషుల జీవితం సాంస్కృతిక విషయాల చుట్టూ కేంద్రీకృతమైంది. మనిషి జీవితమే సంస్కృతిగా మారింది. భూమిని సాగు చేసినట్లుగానే మనిషి జీవితంలో ప్రారంభమైన సాగు సంస్కృతిగా మారింది. అగ్రికల్చర్ నుంచే కల్చర్ వచ్చింది. మాట, గానం,అక్షరాలు, రచన, అధ్యయనం.... ఇవన్నీ సంస్కృతిలో భాగంగా వికసించాయి. కనుక అధ్యయనాన్ని, సంస్కృతిని వేర్వేరు అంశాలుగా కాకుండా పరస్పర సంబంధాలుగా, సంస్కృతిలో అధ్యయనం ఒక భాగంగా అర్ధం చేసుకోవాలి. సంస్కృతి సామూహికమయినది. సామా పరిణామక్రమంలో ఏర్పడింది. ఇది బాహ్యపరిస్థితుల ప్రభావానికి మార్పులకు గురవుతు ఉంటుంది. సంస్కృతిలో జాతిలక్షణాలు, ప్రాంతీయలక్షణాలు ఉంటాయి. కనుక సంస్కృతి మనిషి ముఖ్య అవసరాలలో ఒకటి. ఏ సంస్కృతిలోనైనా ఆ యుగధర్మం ఉంటుంది. అందుకే అధ్యయన సంస్కృతి నిర్మాణం కావలసింది వ్యక్తిత్వంలోనే ఈ విశాల మానవజీవితాన్ని ముందుకు నడపగలిగినది ఆర్థిక రాజకీయ సంస్కృతే, సంస్కృతిని భిన్నపార్వాలకు విస్తరింపచేసుకొన్ని అధునాతనంగా మార్చుకున్న జాతులు పురోగమిస్తాయి. ప్రాచీనత వద్దే ఆగిపోయిన జాతులు- గిడసబారిపోతాయి. అధ్యయనం మనిషి ప్రాథమిక విషయంగా పరిగణించినప్పుడు అద్యా సంస్కృతిగా మారుతుంది.


అర్థవివరణ-నిర్వచనం


అధ్యయనం అనే పదం 'అధ్యేత' నుంచి రూపొందింది. 'అధ్యేత' అంటే ఒక క్రమాన్ని అనుసరించి నియమబద్ధంగా దేని తర్వాత దేనిని చదవాలో నిర్ణయించుకొని పఠించడం.. అధ్యయనం అంటే 'గురుముఖముగా వేదమును చదువువాడు' అని శబ్దరత్నాకరం చెబుతుంది. ఈ కాలంలో అధ్యయనమంటే చదవటం అని అర్ధం. అధ్యయన సంస్కృతిలో సంస్కృతి గురించి ఆలోచిస్తే చాలా విషయాలు, స్ఫురణలోకి వస్తాయి. మనుషులు రాళ్లను చెక్కి పరికరాలు తయారు చేసుకోవటం ఆరంభించిన నాటి నుంచి సంస్కృతి ప్రారంభమయింది. సంస్కృతి క్రమంగా అభివృద్ధి చెంది, విస్తరించి, వేల సంవత్సరాల తరవాత నాగరికతగా రూపొందింది. నగరాలతో ప్రారంభమయిన నాగరికత. ఇలా చూసినప్పుడు 'ఒక జాతి అభివృద్ధి మార్గమున నడిచిన రీతిని సంస్కృతి అంటారు'. మనిషి జీవితంలో ఇమిడి, ఆచరించిన ప్రతీ విషయాన్ని సంస్కృతిగా చెబుతాం. స్థూలంగా చెప్పాలంటే పుట్టుక మొదలు మరణించేవరకు మనిషి జీవితంలో వ్యక్తమయ్యే ప్రతిదీ సంస్కృతే.


అధ్యయన సంస్కృతి నేపథ్యం


చదువని వాఁడజ్ఞుండగు

జదివిన సదసద్వివేక చతురత గలుగుం

జదువగ వలయును జనులకు

జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ! 

భాగవతంలో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో మాట్లాడిన సందర్భంలోని పద్యమిది.

పోతన హిరణ్యకశ్యపుడి ద్వారా చదువు ప్రాధాన్యతను చెప్పించాడు. బాబూ! చదువు చాలా ముఖ్యం. చదువుకోనివాడు అజ్ఞానిగా ఉంటాడు. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచీ, ఇది చెడూ అనే వివేకం కలుగుతుంది. మనిషి అయిన ప్రతీవాడు తప్పకుండా చదువుకోవాలి. మంచి గురువుల వద్ద చదివిస్తాను. చదువుకో నాయనా! అని హిరణ్యకశ్యపుడు కొడుకుతో అన్నాడు. మధ్యయుగంలో పోతన ఈ పద్యాన్ని రాశాడు. ఆనాడే చదువు ప్రాధాన్యతను చెప్పాడు. ఆ సమాజాలలో కొందరికైనా అధ్యయనం జీవితంలో భాగమయిందని అర్ధమవుతుంది. జీవితంలో అధ్యయనం భాగమయిందంటే అదొక సంస్కృతిగా ఉందని తెలుస్తుంది. జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని సంస్కృతిగా భావిస్తున్నాం, చదువును కూడా అధ్యయన సంస్కృతిగా ప్రస్తావించుకోవచ్చు. సమాజంలో ఎగువ, దిగువ సమూహాలకు ఎవరి సంస్కృతి వారికి ఉన్నప్పటికీ, ఎగువ సమూహాల సంస్కృతి ప్రభావితంగా ఉంటుందనే వాస్తవాన్ని ఇప్పటికీ మనం గమనిస్తూనే ఉన్నాం. సంస్కృతిలో ఈ భిన్నత్వం ఉన్నప్పటికీ అధ్యయనం పట్ల వారికి ఉన్న ఆసక్తిని బట్టి అదొక సంస్కృతిగా కొనసాగిన తీరును తెలుసుకోగలుగుతున్నాం. విద్య అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో అధ్యయన సంస్కృతి మరింత విస్తృతం కావలసిన అవసరం ఉంది.


మనిషి రోజూ ఆచరించే వాటిలో అధ్యయనం భాగం కావాలి. దంతధావనం చేసుకున్నట్లు, స్నానం చేసినట్లు, బట్టలను శుభ్రం చేసుకున్నట్లు, ఇంట్లో దుమ్మును దులిపినట్లు మెదడును పదును పెట్టుకోవాలి. ఆలోచనలను మెరుగు పర్చుకోవడం సాంస్కృతిక విలువగా ఉండాలి. ఖాళీ పొట్టకు భోజనం ఎంత అవసరమో మెదడుకు మేత అంతే అవసరం. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మెదడుకు అధ్యయనం అలాంటిది. మన మెదడును నిరంతరం శుభ్రం చేసుకోవడమనేది అధ్యయనం ద్వారానే సాధ్యమవుతుంది. మన అవసరాలను తీర్చుకోవడం. కోసం చేసే కృషి మనిషి జీవితంలో సాంస్కృతిక విలువగా ఎలా ఉంటుందో, అధ్యయనం కూడా ఒక సంస్కృతిగా మారాలి. చదవకపోతే ఏదో కోల్పోతున్నామనే భావనకు మనిషి గురైనప్పుడే అధ్యయనం సంస్కృతిగా మారుతుంది. అది ఒక తరం నుంచి మరో తరానికి ఉన్నత విలువగా అందించబడుతుంది. మేధోసంపత్తి కలిగిన వ్యక్తుల సంఖ్యను బట్టే ఒక సమాజపు స్థాయిని అంచనా వేస్తారు. కనుక మన ఉదాత్తమైన సంస్కృతిలో అధ్యయన సంస్కృతి అవిభాజ్యంగా మారాలి.


గతకాలపు ఆలోచనా విధానం నుంచి బయట పడకపోతే కొత్త విషయాలను నేర్చుకోవడానికి మన మెదడు సిద్ధపడదు. అలా జరగాలంటే అధ్యయనం ఒక సంస్కృతిగా అభివృద్ధి చెంది విస్తరించాలి. మన విద్యావిధానం ఇప్పటికీ పాశ్చాత్యదేశాల ప్రయోజనాలను నెరవేర్చేదిగా ఉంది. ఫలితంగా దేశీయ అవసరాలను తీర్చిదిద్దే అధ్యయన సంస్కృతి రూపొందలేదు.

 ప్రధానంగా మనం వ్యవసాయిక దేశంగా ఉండటం వలన మన ఆలోచనా విధానంలో విజ్ఞానశాస్త్ర వలసతత్వం, సాంప్రదాయిక అధ్యయన సంస్కృతే కొనసాగుతుంది. మనం కుల భావనలతో తిరోగామిగా ఉండటమే గొప్ప విలువగా, సంస్కృతిగా భావిస్తున్నాం. ఈనాటికి కూడా పద్ధతిని జీవితానికి, అధ్యయనానికి అన్వయించే సంస్కృతి మనలో ఎదగలేదు. ప్రతీ విషయాన్ని భిన్న కోణాలలో, శాస్త్రీయంగా పరిశోధించి సమస్యను, సాహిత్యాన్ని అధ్యయనం చేసే సంస్కృతికి మన మేధోరంగంలో అనేక పరిమితులు ఉన్నాయి. మన ఆలోచనలో స్వేచ్ఛను, సామాజిక, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే సంస్కృతిని, ముందుకు తీసుకెళ్లే పూనికను మన అధ్యయన సంస్కృతి ఇవ్వాలి.


రాజకీయసంస్కృతిని అలవర్చుకున్న పౌరులు వివిధ సందర్భాలలో అనేక అంశాల మీద స్పందిస్తూ ఉంటారు. తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే అధ్యయన సంస్కృతి అభివృద్ధి చెందకపోవటం వలన పౌరులుగా వ్యక్తం చేస్తున్న చైతన్యం, పాఠకులకు లేకపోవడవు. ఒక విషాదంగా ఉంది. రాజకీయాలలో ఎదురయ్యే అనర్థాలను ఖండించడంలో చూపే చొరవను సాహిత్య సమాజంలో ఎదురయ్యే సవాళ్లను, తప్పులను సరిదిద్దటానికి కేటాయిస్తే మన సాహిత్య స్థాయి ఉన్నతంగా ఎదిగేది. ఉబుసుపోకడలను చదివే వాళ్లే మనలో ఎక్కువ. కానీ చైతన్యం. కోసం, జ్ఞానార్జన కోసం చదివే వాళ్లు తక్కువ. పాఠకులు ఈ ఘనీభవస్థితి నుంచి బయట పడినప్పుడే మన అధ్యయన పద్ధతులు మెరుగుపడుతాయి.


రచన సామాజిక కార్యకలాపం అయినప్పుడు అధ్యయనం కూడా సామాజిక కార్యకలాపంగా ఎందుకు మారటం లేదనే ప్రశ్న ఉదయిస్తే సమాధానం సంక్లిష్టంగా ఉంటుంది. దీనికి కారణం అధ్యయనం ఒక సంస్కృతిగా మన జీవితంలో భాగం కాకపోవడమే. చదువటం వచ్చిన వారందరూ పుస్తకాలు చదువుతారా? అంటే కాదనే సమాధానం వస్తుంది. అయితే రచనను, అధ్యయనాన్ని జీవిత సంస్కృతిగా, ఉద్యమ విలువగా భావించేవాళ్లు పరిమిత సంఖ్యలోనైనా ఉంటారు. జీవితం, సమాజం, మనుషుల గురించి తెలుసుకోవాలని, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొనే జ్ఞానాన్ని పొందాలని అధ్యయనం చేసేవాళ్లూ ఉంటారు. వీళ్లే అసలైన పాఠకులు. వీరు అధ్యయనం చేయకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తుంటారు. తమ సంస్కారం ఏ పద్ధతిలో ఉందో పరీక్షించుకోవడానికి చదివేవాళ్లూ ఉంటారు. ఇలాంటి వారిని సాహిత్య పరిభాషలో నిబద్ధత కలిగిన పాఠకులుగా భావిస్తుంటాం.


సమాజ పరిణామ క్రమంలో మనిషి రూపొందించుకున్న గొప్ప సాధనం భాష, భాషను సందర్భాన్ని బట్టి వినడానికి, మాట్లాడానికి, రాయడానికి, చదవడానికి ఉపయోగిస్తాం. అక్షరాలతో ఏర్పడిన పదాలను గుర్తుపట్టి చదవటం అనే ప్రక్రియ అతి ప్రారంభదశ. ముద్రింపబడిన అక్షరాల ద్వారా వివిధ పద్ధతులలో చదివి జ్ఞానాన్ని గ్రహిస్తాం. ఈ క్రమంలో చదవటం • గ్రహించిన విషయాన్ని వ్యాపింపచేస్తాం. ఎన్నో విషయాలను చదువుతాం. కొన్నింటినే ద్వారా గ్రహిస్తాం. మనం పొందే జ్ఞానం మనం చదివే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రదర్శించే ఆసక్తి, వైఖరి చదివే పద్ధతుల మీద ప్రభావం చూపుతుంది.


లిపి ఉన్న భాషలోనే చదువు నేర్చుకుంటాం. మొదట అక్షరాలను నేర్చుకుంటాం. ఆ తరువాత పదాలను, పదాల సహాయంతో వాక్యాలను నేర్చుకుంటాం. చదవడం మనుషులు జీవితంలో సంస్కృతిగా రూపొందే క్రమంలో అభ్యసన మీద, అభ్యాసం మీద దృష్టిపెడుతాం. ప్రారంభంలో పాఠకుల స్థాయిని బట్టి చదివే పుస్తకాలను నిర్ణయించుకుంటాం. రచనలోని శైలి. కేతాలను బట్టి అధ్యయనంలో మెళకువలను పెంచుకుంటాం. వివిధ పుస్తకాలలోని విషయాన్ని గ్రహిస్తాం. రచనలోని భాషను అర్థం చేసుకోవటం మొదలయ్యాక అధ్యయన స్థాయి, వేగం పెరుగుతాయి. రచన మౌలికతకు భంగం కలగకుండా అర్ధం చేసుకోవడమనేది కృషి మీద ఆధారపడి ఉంటుంది.


ఇరవై సంవత్సరాల వయసులో మనం అధ్యయన సంస్కృతిని అలవరుచుకున్నప్పుడు పుస్తక పఠనానికి కొన్ని దశలు ఉంటాయి. ఈ సమయంలో మన జీవితం నిదానంగా అధ్యయన సంస్కృతికి అలవాటు పడుతుంది. అందుకే ఈ సందర్భంలో చదివిన పుస్తకాలు అంతగా ప్రభావితం చేయవు. కొంత అనుభవం, అధ్యయనం వలన జాగ్రత్త పెరుగుతుంది. అధ్యయనం ఒక సంస్కృతిగా రూపొందే క్రమం మొదలవుతుంది. చదివిన రచనను విమర్శించడం, విలువ కట్టడం చేస్తాం. సామాజిక సంస్కృతి పురోగమనానికి అధ్యయన సంస్కృతిని ఆలంబనగా చేసుకుంటాం. పఠనం వలన ఏదో ఒకటి పొందాలనే ఆలోచనల స్రవంతి చదువులోకి ఒక సంస్కృతిగా ప్రవేశించటం పురోగామి సమాజ లక్షణం.


అధ్యయన పద్ధతులు


సాహిత్య, సమాజ సంబంధాలలో భాగంగానే సాహిత్య అధ్యయన సంస్కృతి ఉంటుంది. అధ్యయనానికి విడి అస్తిత్వం లేదు. కనుక ఏకరూపమైన సాహిత్యం ఎలా ఉండదో అధ్యయన పద్ధతులు కూడా ఏకశిలా సదృశ్యంగా ఉండవు. అధ్యయన పద్ధతికి ఒక క్రమానుగతి ఉండాలి.

 1)ఎందుకు చదువుతున్నామనే లక్ష్య విచారణతో అధ్యయనం చేయాలి.

2. సాహిత్యాన్ని చదివి పొందడం సహజం. అయితే అంతటితో ఆగిపోకుండా చారిత్రక నేపథ్యంతో చదివే సంస్కృతిని ప్రోత్సహించాలి. 

3) పాఠకుల అభిప్రాయాల కంటే సామాజిక వాస్తవికత రచనలో ప్రతిబింబించిన విధానాన్ని ప్రధానంగా చూడాలి.

4. వర్తమాన, భవిష్యత్తు జీవితాల పెనుగులాటను పరిష్కరించి జీవితాన్ని ఉన్నతీకరించడానికి సాహిత్య అధ్యయనం చేయాలి.


5. గత, వర్తమాన సాహిత్యాలను చారిత్రక కోణంలో సమ్యక్ దృష్టితో అధ్యయనం చేయాలి.


6. అధ్యయనం చేసేటప్పుడు పాఠకులలో అహంకార స్వభావం, పక్షపాత లక్షణం


ఉండకూడదు. 7. సాహిత్యం విద్యలన్నింటికి మూలధాతువు. అలాంటి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం. జ్ఞాన మార్గానికి ప్రవేశం దొరికినట్లుగా భావించాలి.


8.


ఏ కళ గురించైనా పాఠకులు అధ్యయనం చేయాలంటే ఆ కళలో ప్రావీణ్యం


లేకపోయినప్పటికీ ప్రవేశం ఉండితీరాలి. అది సాధ్యం కావాలంటే చదవటం ఒక


కళలాగా, సంస్కృతిలాగా ఉండాలి. అప్పుడే పాఠకస్థాయి నుంచి కళాకారుడి స్థాయికి ఎదిగి వ్యక్తమైన కళని హృదయపూర్వకంగా అభినందించగలరు, ఆనందించగలరు. ఏకాగ్రతతో చదివితే ఎంతటి జటిలమైన విషయాన్నైనా ఆకళింపు చేసుకునే నైపుణ్యం వస్తుంది. 9.


10. చదవటం ఒక సంస్కృతిగా సమాజంలో వికసించాలంటే ప్రతీ పాఠకుడు రోజులో కొన్ని గంటలను అధ్యయనం కోసం కేటాయించుకోవాలి. పౌరసమాజం, ప్రభుత్వం ఈ విషయంలో విధాన నిర్ణయాన్ని కలిగి ఉండాలి.


11. కాలక్షేపం కోసం కాకుండా ఉత్తమ పాఠకులు కవి జీవితం ఆధారంగా కవి ఆత్మీయత ప్రాతిపదికన కావ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 

12. కవుల జీవిత కాలానుసారంగా అధ్యయనం చేయాలి.

13. కావ్యాన్ని లేదా రచనను కాలక్రమ దృష్టితో, దాని పరిణామక్రమాన్ని నిరూపించే విధంగా అధ్యయనం చేయాలి.

14. భాషాశాస్త్రాలను అధ్యయనం చేసేవాళ్లు శాస్త్రీయ పద్ధతిని అనుసరించాలి.


అధ్యయనానికి ఉండే విశాలత్వం వలన, సృజనాత్మక గుణం వలన విజ్ఞానానికి ఆధారమైన గ్రంథాలను, కావ్యాలను, సిద్ధాంతాలను ఒకే తీరుగా చదువలేం. మనిషి మనిషికి చదివే పద్ధతిలో తేడా ఉన్నట్లే, ఒక్కో ప్రక్రియను చదివే పద్ధతిలో కూడా భిన్నత్వం ఉంటుంది. కథ, నవల అనే ప్రక్రియలను ఒక తలంలో చదువుతారు. కవిత్వాన్ని మరో తలంలో అధ్యయనం చేస్తారు. దినపత్రికను ఒకలాగా, రాజకీయార్థిక సిద్ధాంత రచనలను ఇంకోలా చదువుతారు.

తెలివైన పాఠకులు ఏకాంతంగా చదువుకోవడానికి ఉద్దేశించిన ప్రక్రియ కథ, నవల, ఈ ప్రక్రియలకు ఒక నిర్మాణం ఉంటుంది. నిర్మాణంలో భాగమైన అల్లిక ఈ ప్రక్రియలలో కొన్నిసార్లు కవిత్వాన్ని పోలి ఉంటుంది. పాఠకులలో అధ్యయన సంస్కృతి లోపిస్తే కథాంశం అంత సులభంగా మెదడులోకి చేరదు. ప్రక్రియను బట్టి పాఠకుల ఆలోచనా స్థాయిలో మార్పు ఉంటుంది. ఏ ప్రక్రియను చదువాలనుకున్నా అధ్యయనంలో ఉండే అభ్యాసమే పునాదిగా పనిచేస్తుంది. అప్పుడే ప్రక్రియలోని అంతర్గత సూత్రాలను అలవోకగా అర్ధం చేసుకోగలుగుతారు. కథను చదివే పాఠకులు కథా శీర్షిక ఆధారంగా మొగ్గుచూపుతారు. కానీ అధ్యయనాన్ని ఒక అలవాటుగా కల్గి ఉన్నవాళ్లు మాత్రం విషయానికే ప్రాధాన్యత ఇస్తారు. రచయిత కంఠస్వరాన్ని అర్ధం చేసుకొని చదివే పాఠకులున్న చోట సాహిత్య ప్రమాణాలు పెరుగుతాయి. రచయిత రచనా దృక్పథాన్ని అర్ధం చేసుకునే స్థాయిని కూడా పాఠకులు అధ్యయనం ద్వారానే పొందగలుగుతారు. కథా, కథాంగాల సమ్మేళనం పాఠకులకు అర్థం కావాలంటే పాఠకస్థాయిలో మార్పు ఉండాలి. పాఠకులు రచనా వస్తువును, రచయిత భావాన్ని రచయిత దృక్పథం నుంచి చేసుకుంటూ చదవాలి. పాఠకులు తెలివితేటలను అవమానించే కథలను గమనించే స్థాయి పాఠకులకు అధ్యయనం ద్వారానే సాధ్యమవుతుంది. గత అభిప్రాయాలతో సంబంధం లేకుండా కథను, నవలను అధ్యయనం చేసే పాఠకులే ఉత్తమ పాఠకులవుతారు.


లలితకళలో ప్రథమస్థానంలో ఉన్న కవిత్వాన్ని చదివే పద్ధతి గురించి కూడా మనం ఆలోచించాలి. కవిత్వాన్ని చదవడం కాదు, అస్వాదించాలి. ఉదయాన్నే దినపత్రికలలో వార్తలు, సంపాదకీయం, రాజకీయార్ధిక, సామాజిక వ్యాసాలు చదువుతుంటాం. సమయం దొరికితే కథలు, నవలలు, జీవితచరిత్రలు అధ్యయనం చేస్తుంటాం. అయితే ఈ రచనా ప్రక్రియలను చదవడం కవిత్వాన్ని చదవడం ఒకటి కాదు. దినపత్రికలలోని వార్తలు మనకు సమాచారాన్ని ఇస్తాయి. వ్యాసాలు మనకు వివిధ అంశాల పట్ల జ్ఞానాన్ని ఇస్తాయి. నవల, కథలలోని సృజనాత్మకత వలన మనోవికాసం జరుగుతుంది. కానీ కవిత్వాన్ని కేవలం చదవడం కాదు. పాఠకులు అందులోకి ప్రవేశించాలి. కవితారహస్యాలను తెలుసుకోవాలి. కవితా పాదాలలోని అర్ధాలను పట్టుకోవాలి. కవితలోని సొంత అనుభూతులను పాఠకులు పొందాలి. కవితలో వ్యక్తమైన నూతన పోకడలను కూడా పాఠకులు తెలుసుకోవాలి. కొన్ని కవితలు ఒకసారి చదివితే అర్ధంకావు. మనస్సు పెట్టి రెండుమూడు సార్లు చదవాలి. కవితావాతావరణాన్ని తెలుసుకోవాలి. కవిత్వంలోని కవి స్వరాన్ని తెలుసుకోవాలి. కవిత్వం మనసులో చదవకూడదు. బిగ్గరగా చదవాలి. అప్పుడే పదాల మధ్య ఉండే అస్పష్టత పాఠకులకు తెలుస్తుంది. కవి దృక్పథం కూడా అర్థమవుతుంది.

ఏ రచన అయినా ప్రకృతిసత్యాన్ని సౌందర్యవంతం చేసి చెబుతుంది. అనుభవాలు, అనుభూతులు, ఆవేశాలు, భావాలు భాషారూపంలో సాహిత్యంగా వ్యక్తమవుతాయి. ప్రతీ రచయిత ఎంతో కొంత ఈ ప్రపంచాన్ని మార్చాలని తన భావాలను సాహిత్యరూపంగా వ్యక్తం చేస్తాడు, రచయిత తన జ్ఞానాన్ని ఇతరులకు సులువుగా అందించడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక పాఠకులు అధ్యయనం ద్వారా ఆ రచనను మరింత మెరుగుపర్చుతారు. మంచి విమర్శ ఉన్నచోట మంచి సాహిత్యం వస్తుంది. మంచి అధ్యయన సంస్కృతి ఉన్న చోటనే మంచి సారవంతమైన విమర్శ వస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?