వ్యాస రచనా పద్ధతులు Degree 5th semester Telugu

 వ్యాస రచనా పద్ధతులు


ఒక విషయాన్ని వివరించి, క్లుప్తంగా రాయడం వ్యాసమని ముందు పాఠంలో నేర్చుకున్నాం. వ్యాసం పరిమితమైన అంశంతో, పూర్వ పర సమన్వయంతో వచన రూపంలో ఉంటుంది. విషయ నిర్ణయార్హతను మానసిక సామర్ధ్యాన్ని స్వేచ్ఛగా తెలిపేదే వ్యాసమని చెప్పవచ్చు. అర్ధవంతమైన వ్యాసం రాయడానికి అనేక రచనా పద్ధతులున్నాయి. వ్యాస రచన ప్రావీణ్యత కోసం శిక్షణ అవసరం. ఒక విషయాన్ని స్థూలంగా చదివి, దానిలోని సారాంశాన్ని సంగ్రహించి కొత్త ఆలోచనలతో విషయాన్ని రాయడం ఎలాగో రచనా పద్ధతుల్లో తెలుసుకుంటాం. వ్యాస రచనా పద్ధతులు


పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులను పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు వ్యాస రూప సమాధానాలు రాయండి అని అడుగుతారు. వాటికి మార్కులు కూడా ఎక్కువ. పరీక్షకుడు పాఠ్యభాగ సారాంశాన్నో లేక ఏదేని పాత్ర గురించో సమాధానం రాయమని విద్యార్థులను ఈ ప్రశ్నల్లో అడుగుతాడు. దానికి విద్యార్థులు తెలిసిన విషయాన్ని విస్తారం చేసి రాస్తారు. సమాధానం వ్యక్తీకరించడంలో కొన్ని నిర్దిష్ట పద్ధతులు అనుసరించి రాసినవారు . ఎక్కువ మార్కులు సాధిస్తారు. కేవలం పేజీలు నింపినవారు విఫలమవుతారు. ఇది విద్యార్థులందరికీ అనుభవంలో ఉన్నదే. అలాగే పోటీ పరీక్షల్లో కూడా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై అడిగిన ప్రశ్నలకు వ్యాసనియమాలను అనుసరించి సమాధానాలు రాసిన వారు విజేతలుగా నిలుస్తారు.


వ్యాసరూప సమాధానం రాసేటప్పుడు ఒక క్రమపద్ధతి పాటించాలని తెలుస్తుంది. విషయం వివరించడంలో మెళకువలు అనుసరించాలని అవగతమవుతున్నది. అటువంటి పద్ధతులు ఏ వ్యాసం రాసినా అనుసరించవలసి ఉంటుంది. అప్పుడే మనం రాసే వ్యాసాలు ప్రామాణికంగా నిలుస్తాయి. ఈ పాఠంలో వ్యాస రచన పద్ధతుల గురించి తెలుసుకుందాం.

వ్యాసం ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. అవి ప్రారంభం, విషయ వివరణ, ముగింపు. ప్రారంభం పాఠకునికి వ్యాసం పట్ల ఆసక్తి రేకెత్తించాలి. విషయ వివరణ విస్తృతంగా విశ్లేషణాత్మకంగా ఉండాలి. కొత్త సమాచారం అందించాలి. ముగింపు నిర్మాణాత్మకంగా ఉండాలి. అది పాఠకునిలో కొత్త ఆలోచనలకు బీజం వేయాలి. పాఠకున్ని వ్యాస ప్రారంభం అర్ధమయితే, విషయ వివరణం, ముగింపు అర్ధం అవుతాయి. మధ్యలో ఉండే వ్యాస విషయ వివరణను వ్యాస శరీరం అని కూడా అంటారు... 

ఎలా ప్రారంభించాలి?

ముందుగా ఏ అంశంపై వ్యాసం రాయాలనుకుంటున్నామో స్పష్టతకు రావాలి. రచయితకు ఆసక్తి ఉన్న వ్యాసాంశాన్నే ఎంపిక చేసుకోవాలి. దానికి ఒక శీర్షిక నిర్ణయించుకోవాలి. శీర్షిక వ్యాసం ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలి. వ్యాస విషయానికి సంబంధించిన సమాచారాన్ని సమీకరించుకోవాలి. ఆ సమాచారం ప్రామాణికమైనదై ఉండాలి. ఆధార రహిత సమాచారం. వ్యాసంలో ఉండకూడదు. ఆ విషయమై గతంలో వచ్చిన వ్యాసాలను అధ్యయనం చేయాలి. ముఖ్యాంశాలు నమోదు చేసుకోవాలి. అందిన సమాచారాన్ని ప్రణాళికాబద్ధంగా విభజించుకోవాలి.


శీర్షికకు అనుగుణంగా వ్యాస ప్రారంభం వైవిధ్యంగా ఉండాలి. విషయ విశిష్టతను ప్రకటించే మంచి సూక్తి లేదా కవితాపంక్తితో ప్రారంభించాలి. వ్యాసంలోని ముఖ్యాంశం ధ్వనించేలా పరిచయం ఉండాలి. ఆరంభ వాక్యాలు చదువగానే పాఠకుడు వ్యాసంతో అనుసంధానం కావాలి.


విషయంలోకి వెళ్లినప్పుడు ఉదాహరణలు, అనుకూల, ప్రతికూల ప్రతిపాదనలు చేయాలి. వివరణ తార్కికంగా, హేతుబద్ధంగా కొనసాగాలి. వ్యాసకర్త రాసే అంశంపై పూర్తి అవగాహన, పట్టు ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. వ్యాస శరీరంలో వైవిధ్యమైన పార్శ్వాలు స్పృశించాలి. ఆ ఆలోచనల పొందిక పూర్తి సమన్వయంతో ఉండాలి. ప్రధానాంశమునకు చేసే వివరణలు చెట్టు కాండానికి ఉన్న కొమ్మల్లా ఉండాలి. వాక్యాలు చెట్టును వదిలినట్లు ఉండకూడదు.


ముగింపు క్లుప్తంగా, అర్థవంతంగా ఉండాలి. నిర్మాణాత్మకమైన సూచనలు అందించాలి. వ్యాస సారాంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాసం ముగించాలి. విషయం సూటిగా అర్ధమయ్యేటట్లు సంధించాలి. ఎటువంటి అస్పష్టతకు తావుండకూడదు. ముగింపు ఒక సత్యాన్నో, ఒక సిద్ధాంతాన్నో ప్రతిపాదించేదిగా ఉండాలి.


వ్యాసరచనలో జనవ్యవహార భాషనే ప్రయోగించాలి. అనివార్యమైన చోట జన వ్యవహారంలో స్థిరపడ్డ పరభాషా పదాలను కూడా ప్రయోగించవచ్చు. భాష విషయంలో సామరస్యం, సమన్వయం రచయితలకు చాలా అవసరం. ఎక్కడా అభ్యంతరకర పదాలు రాకూడదు. భాషా దోషాలు, వాక్య దోషాలు చొరబడనీయవద్దు. ఉపన్యసించేటప్పుడు సాధారణంగా వచ్చే ఊతపదాలు, పునరుక్తులు వ్యాసంలో చొరబడకూడదు. సరళమైన, అన్వయక్లిష్టత లేని వాక్యాలు ప్రయోగించాలి. చిన్న వాక్యాలు విషయాన్ని పాఠకుని హృదయానికి త్వరగా చేర్చుతాయి. భావ ప్రకటన స్వేచ్ఛగా జరగాలి. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు ప్రతిబింబం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. విషయ వైవిధ్యాన్ని బట్టి పేరాల విభజన చేయాలి. చిన్న పేరాలు పాఠకునిలో పఠనాసక్తిని కలిగిస్తాయి. అలాగే రచయిత సందర్భోచితమైన జాతీయాలు, సామెతలు వ్యాసానికి అదనపు బలాన్నిస్తాయి. దాశరథి యాత్రాస్మృతిలోని ఈ వ్యాస భాగాన్ని పరిశీలించండి.


యేడు వందల మందికి ఒకటే పంపు! యెట్టా ధరించేది? ఈ పాడు కంపు


అంటూ ఒక గేయం పాడుతూ వట్టికోట ఆళ్వారుస్వామి పంపు దగ్గరకు వచ్చాడు. 'నిన్ను చూస్తే నాకూ కవిత్వం వస్తుంది' అన్నాడు. యేడు వందలకు పైగా రాజకీయ ఖైదీలను నిజామాబాదు సెంట్రల్ జైలులో నిర్బంధించారు. ఒక్కటే నీళ్ల పంపు, అంతా అక్కడే స్నానం చేయాలి. బట్టలు ఉతుక్కోవాలి. భోజనాలు చేసి పళ్లాలు, నీళ్లు త్రాగే అల్యూమినియం గొట్టాలక్కడే కడుక్కోవాలి. ఉదయం ఆరు కానిదే బ్యారక్స్ లో నుంచి బయటకు రానిచ్చేవారు కాదు బందాజులు (వారైనులు) '


ఇది సన్నివేశాన్ని దృశ్యమానం చేసేలా ఉన్నది. ఇటువంటి వ్యాస రచనా పద్ధతిని కథనాత్మక పద్ధతి అంటారు. ఇది కథ, నవల వంటి ప్రక్రియల్లో కనిపిస్తుంది.


మరో ఉదాహరణ. యువభారతి వారి కవిసమయములు అనే సిద్ధాంత వ్యాసంలో ఇదివెంటి కృష్ణమూర్తి ఇలా అన్నాడు. 'తెలుగులో సాహిత్య శాస్త్రం స్వతంత్రమైనదొకటి లేకపోవడం. వల్ల సంస్కృతాలంకారికులు పేర్కొన్న కవిసమయములనే తెలుగు కవులు గ్రహించారు. తొమ్మిదవ శతాబ్దంలో మొదట రాజశేఖరుడు తన కావ్య మీమాంసలో కవిసమయమును స్థాపించి, నిర్వచించి లక్ష్యలక్షణ సమన్వయం చేశాడు. అతని తరువాత అజితసేనుడు, హేమచంద్రుడు, దేవేశ్వరుడు, విశ్వనాథుడు, కేశవమిశ్రుడు, అనంతాచార్యుడు తదితరులు రాజశేఖరుడు చెప్పిన కవి సమయములతో పాటు మరికొన్ని చేర్చారు. ఇందులో కవిసమయముల ప్రయోజనం గురించి, కల్పనా ప్రధానమైన కావ్యజగత్తులో వాటి ప్రాముఖ్యం గురించి వివరించారు. ఇది శాస్త్ర వివరణాత్మక పద్ధతి.


ముకురాల రామారెడ్డి రాసిన 'మబ్లూమ్ - శ్రీశ్రీ' అనే వ్యాసంలో 'సాహిత్యం ఒక కళ. కళ, శాస్త్రం, తత్త్వం అనే ఈ మూడింటిలో భావాలకు, ఆలోచనలకు మాత్రమే మొదటి స్థానమని నిరూపించినవారు మఖూమ్ - శ్రీశ్రీలు' అంటాడు వ్యాసకర్త, ప్రజాకవిత్వం అంటే ప్రజలు రాసిన కవిత్వమా? జానపద కవిత్వమా? అనే సందేహాలకు ముగింపునిస్తూ, సాధారణ ప్రజల సమస్యలు చిత్రించగలిగింది, ప్రజలకు బాగా అర్ధమయ్యే శైలిలో రాసినది, చదువురా ప్రజలకు బాగా దగ్గరయ్యేదన్నది ప్రజాకవిత్వం అని వివరించాడు. ఈ వాక్యాల్లోని క్లుప్తత. స్పష్టత వాడుక భాష గమనార్హం.


భాషకు, భావ ప్రకటనకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ రెండింటి కలయిక వల్లనే వ్యాసకర్త రచనా వ్యక్తిత్వం బయటపడుతుంది. అస్పష్ట భావ ప్రకటనల వల్ల వ్యా సంకోచం కలుగుతుంది. అందుకే వంద అస్పష్ట భావ సంగతుల కంటే, ఒక స్పష్టమైన విషయం వల్ల వ్యాసకర్తకు, పాఠకుడికి స్పష్టత ఉంటుందనేది వ్యాస రచన చేసేటపుడు గుర్తుంచుకోవాలి. స్పష్టత, క్లుప్తత వ్యాసకర్త వ్యక్తిత్వాన్ని రూపొందించే లక్షణాలు.


వ్యాస రచనలో ఉన్న ఆలోచనానుభూతి మిగతా సారస్వత ప్రక్రియలకు లేదు. వ్యాసంలో మనిషి బుద్ధి నుంచి ధారగా విషయాన్ని చెప్పవచ్చును. దానికి మెరుగులు దిద్ది, జ్ఞానతృష్ణను పదిమందికి పంచే పనిని సాధన చేస్తే అందరికీ ఉపయోగపడే వ్యాసమవుతుంది. ఏ పద్ధతి అనుసరించినా అంతిమంగా పాఠకుడ్ని మెప్పించేలా వ్యాసం ఉండాలని గమనించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?