వ్యాసం Degree 5th semester Telugu

 సమకాలీనంలో జరుగుతున్న విషయాలను గతంలో జరిగిన విషయాలను వచన రూపంలో రికార్డు చేయడమే వ్యాసం. చరిత్రలో జరిగిన విషయ సంఘటనలు నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది. వచన రచనగా వ్యాసం ఉన్నందువల్ల విషయం. తొందరగా పాఠకునికి చేరుతుంది. పాఠకునిలో కొత్త ఆలోచనలకు నాంది పడుతుంది. ఆ ఆలోచనల ప్రభావం వివిధ మార్గాల ద్వారా సమాజంపై ప్రతిఫలిస్తుంది. దీంతో ఒక సామాజిక పరివర్తనకు కొత్త మార్గం ఏర్పడుతుంది. ఈ మార్గాన్వేషణ వ్యాసం ద్వారా స్పష్టంగా కలుగుతుంది.


ప్రతి వచన రచనకు మూలం వ్యాసమే. ఇదే వివిధ రూపాలను, మార్పులను పొంది. వెలువడుతున్నది. ఒక నూతన ఆలోచనా విధానాన్ని కలిగిస్తున్నది. విభిన్న వస్తు రూపాలున్నా దేని మార్గం దానిదే, దేని ప్రతిఫలనం దానిదే. ఇది వ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 

నిర్వచనం

వ్యాసం ఒక ఆధునిక సాహిత్య ప్రక్రియ. ఈ పదానికి ప్రయత్నం, పరిశీలనం అని అర్ధాలున్నాయి. ప్రయత్నం రాతకు, పరిశీలనం ఆలోచనకు సంబంధించినది. ఒక విషయానికి పరిమితమై దాన్ని చర్చించడం, దానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిష్కరించడం, కొత్త ఆలోచనలను కలిగించడం, కొత్త విషయాన్ని పరిచయం చేయడం, కొత్త ప్రతిపాదనలు చేస్తూ వచనంలో సాగే ప్రక్రియను వ్యాసం అని నిర్వచించవచ్చు.

అర్థం.

వ్యాసాన్ని ఆంగ్లంలో ఎస్సె (Essay) అంటారు. లాటిన్ భాష నుంచి ఆవిర్భవించిన ఈ పదానికి తూచడం, పరిశీలించడం అని అర్థాలున్నాయి. 'శబ్దార్ధ చంద్రిక' లో 'ఏదైన ఒక విషయమును విరివిగా వ్రాయుట' అని ఉంది. వ్యాసమంటే విభాగం అనే అర్ధం కూడా ఉన్నది. ఏదైనా విషయం తీసుకొని అందులోని అంశాలను విభజించి వివరించడాన్ని వ్యాసం అనవచ్చు.


వ్యాస శబ్దానికి సంస్కృతంలో విస్తారం, విగ్రహమనే పర్యాయ పదాలున్నాయి. విశేషంగా చెప్పుకొనుట, విశేషంగా గ్రహించుట, అనేక విధాలుగా ఉండుట అనేవి దీని వ్యుత్పత్తులు.. ఈ మూడు లక్షణాలు ఆధునిక తెలుగు వ్యాసాన్ని నిర్వచించడానికి ఉపయోగపడుతాయి.


వ్యాసాన్ని కన్నడంలో ప్రబంధమనీ, నిబంధమనీ, మరాఠీ, హిందీ, సంస్కృతాల్లో నిబంధ అనీ, లేఖ్ అనీ పిలుస్తున్నారు. తెలుగులో 'వ్యాసం' అనే పేరు స్థిరపడిపోయింది. అంతకుముందు ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం అని వ్యవహరించేవారు. ఒక ప్రత్యేక అంశంపై సంగ్రహంగా రాస్తే వ్యాసం అని, మాట్లాడితే ఉపన్యాసం అని తెలుగు సాహిత్యంలో నిలిచిపోయింది.


చరిత్ర


సామినేని ముద్దు నరసింహం నాయుడు 1862లో వెలువరించిన 'హితసూచి'ని తెలుగులో తొలివ్యాస సంకలనం. అయితే అందులోని వ్యాసాలను ఆయన ప్రమేయము'లని. అన్నాడు. 1876లో జియ్యర్ సూరి బాలికా పాఠశాలలకు ఉపయోగపడటానికి సులభశైలిలో 'స్త్రీ కళాకల్లోలిని' అనే వ్యాస సంకలనం వెలువరించాడు. ఆయన ఆంగ్లాంధ్రాల్లో పీఠిక రాసుకొని Essay అనే పదాన్ని గ్రంధం' అనే పేరుతో ప్రయోగించాడు.


కందుకూరి వీరేశలింగం తన వ్యాసాలను 'ఉపన్యాసాలు' అన్నాడు. గురజాడ అప్పారావు తన వ్యాసాలను 'వ్యాసచంద్రిక' పేరుతో వెలువరించి ఈ పదాన్ని, ప్రక్రియను వ్యాప్తిలోకి తెచ్చాడు. ఆయనతో పాటు గిడుగు రామ్మూర్తి పంతులు వాడుక భాషను ప్రయోగించి, వ్యాస ప్రక్రియకు ప్రత్యేక ఆకర్షణ కలిగేలా పాఠకులకు విషయాన్ని సులభంగా చేరవేసే ప్రయత్నం చేశాడు, ఆయన రచనలు వ్యాసప్రక్రియకు బలమైన పునాదులు వేశాయి. లక్షణాలు

లక్షణాలు

వ్యాసం విషయ ప్రధానమైనది. ఏదో ఒక విషయాన్ని అర్ధవంతంగా, స్పష్టంగా వివరిస్తుంది. ఒక అంశాన్ని గ్రహించి సంక్షిప్తంగా రాసినా, సమగ్రంగా రాసినా అందులోని వివరణ ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. మూల అంశాన్ని వదిలి అనేక అంశాల చర్చ ఉండదు. వ్యాసంలో శాఖాచంక్రమణం ఉండరాదు. వ్యాసం శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక, సామాజిక, సాంస్కృతిక, కళా, సాహిత్యపరమైనది ఏదైనా కావచ్చును. ఏది చెప్పినా దండలో దారంలా ప్రధానాంశం చుట్టే తిరుగుతుంది. ఈ మూల సూత్రం పాటించాలి. వ్యాసంలో వ్యాసకర్త పాఠకునితో పరోక్షంగా మాట్లాడాలి.


తెలుగు వ్యాసంలో ప్రధానంగా ఏడు లక్షణాలను గమనించవచ్చు. 1. వచనత్వం 2. అన్నితత్వం 3. మిత్రత్వం 4. హాస్యత్వం 5. సృజనత్వం 6. అసంపూర్ణత్వం 7. వ్యక్తిత్వం.

వచనత్వం

వ్యాసం వచనంలోనే ఉండాలి. కవిత్వ ప్రక్రియల్లో ఉండరాదు. ఇది ప్రధాన లక్షణం, కొందరు రచయితలు కవితాత్మక వ్యాసాలు రాసినా వచన నియమం పాటించారు.


అనిర్ణీతత్వం


ప్రతి రచనా ప్రక్రియకు ఒక పరిమితి ఉంటుంది. దాన్ని ఇతివృత్తం, సన్నివేశం ఆధారంగా నిర్ణయించాలి. వ్యాసం ఇక్కడ ముగిసిపోతుంది, ముగిసిపోవాలి అన్న నిర్బంధం ఉండదు. రచయిత నూతన ఆలోచనలతో ముగిసిన వ్యాసం అక్కడినుంచి మళ్లీ కొత్తగా ప్రారంభం కావచ్చు. వస్తు స్వభావంలోనే వ్యాసం అపరిమితంగా సాగే అవకాశం కలిగి ఉంటుంది. అది రచయిత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటుంది. రచన ఎంత విస్తృతంగా పెరిగినా వ్యాసంగా పరిగణించలేం. వ్యాసాన్ని గ్రంథంగా రాసినవాళ్లు కూడా ఉన్నారు. వ్యాసం స్వల్పకాలంలో __చదవటానికి, కొద్ది పుటల్లో ముద్రించటానికి అనుకూలంగా ఉండాలి. 

మిత్రత్వం

వ్యాసం మిత్రసమ్మితం. వ్యాసకర్త పాఠకులతో మాట్లాడినట్లు ఉండాలి. ఈ మాట్లాడే తీరు అధికారిలా కాక ఒక మిత్రుడిలా ఉండాలి. మిత్రునికి సలహా ఇస్తున్నట్లు, అభిప్రాయం కోరుతున్నట్లు, ముచ్చటిస్తునట్లు ఉన్న వ్యాసాలను పాఠకులు ఆదరిస్తారు. వ్యాసకర్త ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాఠకుల పట్ల మైత్రి ప్రదర్శించకపోయినా, మైత్రీ పూర్వకంగా ఉన్నట్లు అభిప్రాయం కలిగించినా ఈ లక్షణం పాటించినట్లే భావించవచ్చు.


హాస్యం ఆహ్లాదాన్ని, కొత్తశక్తిని అందిస్తుంది. వ్యంగ్యం, పరిహాసం, అధిక్షేపం పాఠకుడిని జీవిత సత్యాలను గ్రహించేలా చేస్తుంది. సాక్షి, వదరుబోతు వ్యాసాల్లో ఈ లక్షణాలు ఉన్నాయి. వ్యాసం నుంచి పాఠకులు దూరం కాకుండా హాస్యం కాపాడుతుంది. అయితే అన్ని రకాల వ్యాసాలకు ఈ లక్షణం వర్తించదు. 

సృజనత్వం

వ్యాసంలో పాండిత్య ప్రదర్శన మాత్రమే ఉండకూడదు. సృజనాత్మకంగా ఉండాలి. ఆలోచనల్లో కొత్తదనం కనిపించాలి. సృజనలో రచయిత ఆత్మీయత ప్రతిబింబిస్తుంది. హృదయం నుంచి వెలువడే అభిప్రాయాలు సృజన గుణం కలిగి ఉంటాయి. ఈ ధర్మం వల్ల వ్యాసం పాఠకుల హృదయానికి సన్నిహితం అవుతుంది. వ్యాసం సృజనాత్మకమైతే దానితో చాలా లక్షణాలు అనుసంధానం అవుతాయి. కథ, నవల వంటి ఇతర సృజనాత్మక ప్రక్రియల కంటే వ్యాసం ఆలోచనామృత రూపంలో ఉంటుంది. పాఠకులను కూడా ఆలోచింపజేస్తుంది.


అసంపూర్ణత్వం


వ్యాసం చిన్నదయినా, పెద్దదయినా అందులో విషయం పరిపూర్ణంగా, సమగ్రంగా, కూలంకషంగా ఉండదు. అది సాధ్యం కూడా కాదు. వ్యాస విషయం సంపూర్ణంగా రాయడం కుదరదు. వ్యాసంలో చెప్పదలచుకున్న విషయం సంపూర్ణంగా ఉండాలని రచయిత కూడా కోరుకోదు. వ్యాసంలో అసంపూర్ణత్వం కూడా ముఖ్య లక్షణమే. అంటే వ్యాస విషయానికి ఇంకా కొనసాగింపు ఉంటుందన్నమాట. ఉండాలి కూడా. వీలైనంత సమగ్రంగా ఉండవచ్చు కానీ సర్వం సమగ్రంగా రాయడం ఎవరికీ సాధ్యం కాదు.


వ్యక్తిత్వం


వ్యాసంలో రచయిత వ్యక్తిత్వం ఆత్మాశ్రయ రీతిలో వ్యక్తమవుతుంది. వ్యాసాన్ని రచయిత ఉత్తమ పురుషలో రాయవచ్చు. పాత్రగతంగా రాయవచ్చు. ఎలా రాసినా రచయిత వ్యాసంలోంచి పాఠకులతో మాట్లాడటం ప్రధాన ధర్మం. రచయిత అవగాహన, దృక్పథం, అనుభవ నేపథ్యం అతని వ్యాసంలో ప్రస్ఫుటమవుతాయి. వ్యాసంలో రచయిత వ్యక్తిత్వం పెరుగుతున్న కొద్దీ సృజనధర్మం పెరుగుతుంది. అందువల్ల సృజన ధర్మం, రచయిత వ్యక్తిత్వం వ్యాసంలో పరస్పర దోహదకారులు.


వ్యాసంలో ఈ లక్షణాలు అన్నీ ఉండాలని ఏమీ లేదు. కొన్ని లోపించినా ఆ రచన వ్యాసం అవుతుంది. చదివించే గుణం వ్యాసంలో ఉండాల్సిన ప్రధాన లక్షణం. అది రచయిత నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. నిపుణుడైన రచయిత రాసిన వ్యాసాలు ఉత్తమ శ్రేణిలో నిలుస్తాయి. అవి బుద్ధి వికాసానికి దోహదం చేస్తాయి. ఆలోచింపజేస్తాయి. సమాజంలో మార్పు తెస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?