వ్యాసంలో వస్తు వైవిధ్యం Degree 5th semester

 వ్యాసంలో వస్తు వైవిధ్యం


వ్యాసం నిర్వచనం. పరిణామం, రచనా పద్ధతుల గురించి ముందు పాఠాల్లో తెల్చుకున్నాం. ఇందులో వ్యాసంలోని వస్తు వైవిధ్యం గురించి నేర్చుకుందాం. ఇంతకీ వస్తువు అంటే ఏమిటి? అందులో వైవిధ్యం ఎలా ఉంటుంది? దానికి నిర్దిష్టమైన సూత్రాలు ఉన్నాయా? అనే విషయాలు పరిశీలిద్దాం.


వస్తువంటే వ్యాసం రాయడానికి ఎంచుకున్న విషయం. ఏ అంశం మీద వ్యాస రచన చేస్తామో అది వస్తువు. వ్యాసంలో వస్తువే ప్రధానం. వైవిధ్యం అంటే వివిధత్వం. అంటే అనేక రకాలుగా ఉండటం. వ్యాస వస్తువు ఫలానా అయి ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. రంగం ఏదైనా కావచ్చు. ఆ రంగానికి సంబంధించిన ఆలోచనల పరంపరను క్రమపద్ధతిలో కూర్చడం, విషయాన్ని విభజించి కళాత్మకంగా పేర్చడం వల్ల మంచి వ్యాసం రూపుదిద్దుకుంటుంది. వ్యాస వస్తువు రచయిత అభిరుచి, అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అది కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది.


వ్యాసం ఒక సృజనాత్మక కళ. అది సామాజిక చైతన్యానికి వాహిక. అది విభిన్న అంశాల పట్ల అవగాహన కలిగిస్తుంది. పరిసరాలను, ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. తార్కిక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. వ్యక్తుల బుద్ధి వికాసానికి దోహదం చేస్తుంది. హృదయాన్ని చలింపజేస్తుంది. స్పందింపజేస్తుంది. వ్యాస రచనలో ఆత్మాశ్రయ లక్షణం కూడా ఉండాలని అంటారు. అలా ఉన్న వ్యాసాలు పాఠకులను ఆత్మానుభూతికి గురిచేస్తాయి. ఏ వస్తువు తీసుకున్నా సమాచారాన్ని అందించడం, సహానుభూతి కలిగించడం వ్యాసానికి ఉండవలసిన లక్షణాలు.


ప్రతి వ్యక్తికి ఒక దృక్పథం ఉంటుంది. సమాజం మీద, దేశం మీద, జీవితం మీద, సామాజిక స్థితిగతుల మీద తనకంటూ ప్రత్యేకమైన దృష్టికోణం ఉంటుంది. దానికి అధ్యయనం, స్వీయ అనుభవాల నేపథ్యం ఉంటుంది. వాటి ఆధారంగా వ్యాసంలో రచయిత తనను తాను వ్యక్తం చేసుకుంటాడు. దానికి విశ్లేషణాత్మకమైన వ్యాఖ్యానం చేస్తాడు.

ఆరంభం -  వైవిధ్యం

ఆధునిక యుగారంభంలో తెలుగు రచయితలు తమ భావాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి వ్యాసాన్ని ఒక సాధనంగా ప్రయోగించారు. కందుకూరి వీరేశలింగం సంఘసంస్కృత స్త్రీ జనాభ్యుదయం, మూఢనమ్మకాల పట్ల నిరసన, శాస్త్రీయ దృక్పథం, నైతిక విలువల ప్రబోధం వంటి అంశాలను వ్యాస వస్తువులుగా గ్రహించారు. వ్యవహారిక భాష కోసం అవిశ్రాంత కృషి చేసిన గిడుగు రామమూర్తి సామాన్య ప్రజలకు బోధపడని పాండిత్య ప్రకర్షను ఖండిస్తూ వ్యవహారిక వాదానికి పట్టాభిషేకం చేస్తూ వ్యాసాలు రాశాడు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు సా వ్యాసాలలో చమత్కారం, వ్యంగ్యం, అవహేళన పాళ్ళు మేళవించాడు.


వ్యాస రచనకు విస్తృత ఖ్యాతి తెచ్చినవారు గురజాడ అప్పారావు. ఆయన పురోగామి దృక్పథం, ఆధునికత, సమకాలీన అమానవీయ భావాల మీద ఆక్షేపణ వంటి అంశాలను వస్తువులుగా గ్రహించి వ్యాసాలు రచించాడు. అవి వ్యాస చంద్రిక' పేరుతో వెలువడ్డాయి. గురజాడ దృష్టి అంతా అనాటి సమాజంలోని మూఢత్వాన్ని పారద్రోలడం పైననే కేంద్రీకరించాడు. తర్వాత వైవిధ్యభరితమైన వస్తు ప్రయోగంతో తెలుగు వ్యాసాన్ని పరిపుష్టం చేసిన వారిలో కొమర్రాజు లక్ష్మణరావు, కోరాడ రామకృష్ణయ్య, ముట్నూరి కృష్ణారావు, చిలుకూరి వీరభద్రరావు, కట్టమంచి రామలింగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, తాపీ ధర్మారావు, ఆరుద్ర, శ్రీశ్రీ, వట్టికోట ఆళ్వారుస్వామి, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహన్ రావు, తిరుమల రామచంద్ర, సి. నారాయణరెడ్డి వంటి వారెందరో ఉన్నారు.


దాశరథి రంగాచార్య 'అర్ధరాత్రి అరుణోదయం' ఒక చారిత్రక సందర్భాన్ని కండ్ల ముందు నిలిపే వ్యాసం. సమాజం ఒక యుగం నుంచి మరో యుగానికి పరివర్తన చెందుతున్న దృశ్యాన్ని చిత్రించాడు. నిజాం పాలన అంతమవుతున్న సందర్భంలో హైదరాబాద్ రాజ్యా పరిస్థితులు, నాటి సామ్రాజ్యవాదుల కుటిల యత్నాలు, బ్రిటిష్ వారు ఇండియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి దారితీసిన పరిణామాలు, అప్పటి అనివార్యతలు అందులో చక్కగా వివరించాడు. అలాగే సురవరం ప్రతాపరెడ్డి 'మామిడిపండు' మరో విశిష్ట వ్యాసం, సాధారణ అంశాన్ని తీసుకొని అసాధారణంగా చేసిన రచన. మామిడిపండు చెప్పుకోవలసిన విషయమా! అంటూనే ఆసక్తి, ఆశ్చర్యం కలిగించే విషయాలతోపాటు మామిడిపండ్ల రకాలు, దాని పేర్లు, పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, చమత్కారం మేళవించి అద్భుతంగా వివరించాడు.


ఆధునిక సమాజం అవసరాలు పెరిగిపోయాయి. అభివృద్ధి అనేక రూపాల్లో దూసుకుపోతున్నది. ఇప్పుడు భావవ్యక్తీకరణకు సరికొత్త వేదికలు అందుబాటులోకి వచ్చాయి.. సాంకేతికత ప్రతి మనిషినీ పలుకరిస్తున్నది. సోషల్ మీడియా విస్తృతమైంది. ఇప్పుడు రచయితలు. వ్యాసాలు పత్రికలే ప్రచురించాలని ఏమీ లేదు. ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ఫేస్బుక్,వాట్సప్, ట్విట్టర్, ఇంస్టాగ్రాం వంటి మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకు అనుగుణంగా ఆధునిక వ్యాసం కూడా విస్తృత రూపం సంతరించుకున్నది. తమ అభిప్రాయాలను చిన్న చిన్న వ్యాసాలుగా ఆయా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. చర్చిస్తున్నారు. సమర్ధవంతంగా వ్యక్తీకరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు తిరుగులేని సాధనంగా నేడు ఆధునిక వ్యాసం రూపొందింది.


వ్యాస వస్తువు - రకాలు


వస్తువును బట్టి వ్యాసాలను స్థూలంగా విషయ ప్రధాన వ్యాసాలు, వినోద ప్రధాన వ్యాసాలు, సామయిక వ్యాసాలు అని విభజించవచ్చు. మొదటి రకం శాస్త్ర సంబంధమైనవి. శాస్త్ర విషయాల్లో ఉన్న మూలసూత్రాలు అందరికీ తెలిసే విధంగా చెప్పడానికి వీటి ద్వారా రచయిత ప్రయత్నిస్తాడు. ఇటువంటి వ్యాసాల్లో నిర్దిష్టత ఉంటుంది. వినోద ప్రధానమైన వ్యాసాల్లో హాస్యం, వ్యంగ్యం, విమర్శ ప్రముఖంగా ఉంటాయి. వీటిలో కాల్పనికతతో పాటు రచయిత -వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. మూడో రకం వ్యాసాలు ప్రధానంగా పత్రికలు వాహికగా వెలువడుతాయి. సమకాలీన సంఘటనలకు మేధోపరమైన వ్యాఖ్యానాలుగా వెలువడుతాయి. వీటి కాలవ్యవధి తక్కువైనా ఎక్కువ మంది వద్దకు చేరుతాయి. ఇటువంటి విశ్లేషణ వ్యాసాలు ఎందరివో పుస్తకాలుగా ప్రచురించబడి ఆదరణ పొందినాయి.


సూక్ష్మంగా పరిశీలిస్తే వ్యాస వస్తువులో మరిన్ని వైవిధ్యరూపాలు గమనించవచ్చు. సాహిత్య వ్యాసాలు, సిద్ధాంత వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు, వైజ్ఞానిక వ్యాసాలు, కళాత్మక వ్యాసాలు, జీవితచరిత్రను తెలిపే వ్యాసాలు, తాత్విక వ్యాసాలు, ప్రబోధాత్మక వ్యాసాలు అందులో ముఖ్యమైనవి. పీఠికలను కూడా వ్యాసాలుగానే గుర్తించవచ్చు. కొందరు వీటితో పాటు వర్ణనాత్మక వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, హాస్య వ్యంగ్య వ్యాసాలు, భాషావ్యాసాలు, సామాజిక వ్యాసాలు, ఆర్ధిక వ్యాసాలు, క్రీడారంగ వ్యాసాలు, సినిమా వ్యాసాలను కూడా చేర్చారు. పరిశోధన, కళాతత్వ వ్యాసం, జీవిత పరిచయ వ్యాసం, ప్రత్యేక సంచికల వ్యాసం, సాహిత్య చరిత్ర, సాహిత్య విమర్శ వంటివి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వ్యాసాలు,


వ్యాసాన్ని పెంచి పోషించిన తల్లిగా పేరుపొందిన పత్రికా రంగం వైవిధ్యభరితమైన వ్యాసాలకు చోటు కల్పిస్తున్నది. సంపాదకీయం, ప్రధానవ్యాసం, వార్తా కథనం, శీర్షికలు, సమీక్షలు, లేఖల రూపంలో ఉన్న వ్యాసాలు అందులో ముఖ్యమైనవి. ఇవి ప్రజాబాహుళ్యాన్ని అధికంగా ప్రభావితం చేస్తున్న రూపాలు, ఇతర మాధ్యమాల కంటే వ్యాసాన్ని ప్రజల వద్దకు, పాఠకుల వద్దకు పత్రికలే తీసుకెళ్తున్నాయనడంలో సందేహం లేదు.


దినపత్రికలతో పాటు వార, పక్ష, మాస పత్రికల్లోనూ వివిధ రంగాలకు చెందిన విలువైన వ్యాసాలు నిత్యం వెలువడుతున్నాయి. తెలుగు పత్రికలతో పాటు ది హిందూ, టైమ్స్,ఆఫ్ ఇండియా, పోలిటికల్ అండ్ ఎకనామికల్ వీక్లీ వంటి ఇంగ్లీషు పత్రికలు జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపై అమూల్యమైన వ్యాసాలు అందిస్తున్నాయి.


రామచంద్ర గుహ, పాలగుమ్మి సాయినాథ్, రాజ్ దీప్ సర్దేశాయ్ తదితరులు రాసి వ్యాసాలను అన్ని ప్రముఖ దినపత్రికలు తెలుగులో అందిస్తున్నాయి. కురుక్షేత్ర, యోజన, ఫ్రం లైన్, ఇండియా టుడే, మలయాళ మనోరమ లాంటి పత్రికలు ప్రామాణికమైన సమాచారం విశ్లేషణలను పోటీ పరీక్షలకు అవసరమైన పద్ధతిలో ప్రచురిస్తున్నాయి. ఇవన్నీ పాఠకులకు . విషయ పరిజ్ఞానం అందించటంతో పాటు ప్రాపంచిక దృక్పథం ఏర్పడటానికి దోహదం చేస్తాయి. ఈ వ్యాసాలు వైవిధ్యభరితమైన మేధో చింతన ద్వారా ప్రజాస్వామిక, మానవ విలువలు పెంపొందించడానికి కూడా ఇతోధిక కృషి చేస్తున్నాయి.


వ్యాసవస్తువు ఇన్ని రకాలు అని నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వంలోని ఉన్న ఏ వస్తువైనా వ్యాస విషయం కావచ్చు. మన జీవితంలోని ఏ ఘట్టాన్నైనా, అనుభవాన్నైనా వ్యాసంగా మలచవచ్చు. మనల్ని సంతోషపరిచిన సందర్భాలు, గాయపర్చిన ఘటనలు, మరపురాని జ్ఞాపకాలు, బాల్యస్మృతులు, ఊరి ముచ్చట్లు ఏవైనా వ్యాసవస్తువు కావచ్చు. మనిషికి సంబంధించిన సర్వ విషయాలు వ్యాస రచనలో వస్తువుగా స్వీకరించవచ్చు. వ్యాస రచయిత నన్ను నేనే చిత్రించుకుంటున్నా అనుకోవాలి. స్త్రీ స్వాతంత్య్రం నుంచి స్త్రీ జుట్టు ముడి వరకు, ఆకాశంలో నక్షత్రం నుంచి ఇసుక రేణువు వరకు, భగవంతుని ఆకారం నుంచి భక్తుని కన్నీరు వరకు, అదీ ఇదీ అనటం ఎందుకు ఏ విషయమైనా వ్యాసంలో అవకాశం కలిగి ఉంటుంది' అని తెలుగు వ్యాసం మీద విస్తృత పరిశోధన చేసిన కొలకలూరి ఇనాక్ అన్నాడు.


అసలు మొదటి వ్యాసం పుట్టింది జీవితానుభవం నుంచే. ఫ్రెంచివాడైన 'మైకేల్ డీ 'మాంటేన్' తన చరమదశలో అరణ్యం మధ్యలో, కోటలాంటి భవనంలో, రెండో అంతస్తులో కూర్చొని తన జ్ఞాపకాలు, అనుభవాలను నెమరువేసుకుంటూ వ్యాసాలుగా రాసినాడట. అతడు వాటిని 1580లో వ్యాససంపుటిగా ప్రకటించాడు. అదే మొదటి వ్యాస సంపుటిగా గుర్తింపు పొందింది. వ్యాసవస్తువు మన జీవితంలోంచే పుడుతుందని ఈ ఉదంతం నిరూపిస్తుంది.


ఎంచుకున్న వస్తువు ఏదైనా మొత్తం వ్యాసం ఆ అంశం చుట్టే తిరగాలి. ఆకట్టుకునే పరిచయం ఉండాలి. ఆనందం పంచినా, సాహిత్య విమర్శ చేసినా, సంఘ సంస్కరణ కోసం కృషి చేసినా, ఏ విషయం వివరించినా వ్యాసంలోని వస్తువు ప్రాథమికంగా మనిషి చుట్టే తిరుగుతుంది. వ్యాసం మానవుని సాంఘిక జీవనానికి వ్యాఖ్యానంలా ఉంటుంది. అంతః ప్రేరణ కలిగి ఉంటే ఆసక్తి ఉన్న అంశాన్ని వస్తువుగా ఎంచుకుని అర్థవంతమైన వ్యాసం రాయడం ఎంతమాత్రం కష్టం కాదు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?