వ్యాస పరిణామం Degree 5th semester

 వ్యాస పరిణామం


ప్రక్రియ ఏదైనా దానికి ఓ పరిణామక్రమం ఉంటుంది. ఆవిర్భావం, వికాసం ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి, కాలం, అవసరాలను బట్టి వ్యాసం కూడా అనేక మార్పులకు గురై ఇప్పటి పరిణత రూపం సంతరించుకున్నది. అనేకమంది రచయితల కృషి ఫలితంగా తెలుగువ్యాసం వస్తువులో, భాషలో, శైలిలో, ప్రయోజనంలో ప్రత్యేకతను, పరిపూర్ణతను సాధించింది. వ్యాసం చర్చించే విషయం, అప్పటి పరిస్థితులు, వాటి తీవ్రతను బట్టి ఆ పరిణామాలు సంభవించాయి. విమర్శనాత్మకమైనవి, వ్యక్తిగత విషయాలపై సాగేవి, చారిత్రక విషయాలను చర్చించేవి, శాస్త్ర వైజ్ఞానిక, సాంకేతిక విషయాలను ఆవిష్కరించేవి, రచనల్లోని పాత్రలనూ, వ్యక్తులనూ పరిచయం చేస్తూ సాగేవి, స్వీయ అనుభవాలను తెలియజేస్తూ రాసేవి. ఆయా విషయాలపై అభిప్రాయాలను తెలియజేస్తూ సాగే సంపాదకీయాల వంటివి. వంగ్య హాస్య ప్రధానమైనవి. వినోద ప్రధానమైనవి. ఇలా అనేక విభాగాలుగా తెలుగు వ్యాసం విస్తరించింది. ప్రారంభ దశ (1862-1910)


1862-1876 మధ్య కాలంలో సామినేని ముద్దునరసింహనాయుడు, పరవస్తు వేంకట రంగాచార్యులు, జియ్యరు సూరి వ్యాస పరిణామంలో ప్రధానవ్యక్తులుగా గుర్తించవచ్చు. అయితే వీరు వ్యాస లక్షణాలు కలిగి ఉన్న వచన రూప రచనలు గ్రంథం, ప్రకరణములు, ప్రమేయములు, సంగ్రహములు అనే పేర్లతో వెలువరించారు.


మొదట్లో విద్య, వైద్య, దైవ, సంఘ, స్త్రీ గౌరవానికి, అభ్యుదయానికి సంబంధించిన వ్యాసాలు వచ్చాయి. కందుకూరి వీరేశలింగం పంతులు తన వివేకవర్ధిని, సతీహిత బోధిని వంటి పత్రికల్లో విభిన్న అంశాల మీద వ్యాసాలు రాశాడు. ఆయన వ్యాసాల్లో స్త్రీ జనోద్ధరణ ప్రధాన అంశం. దానితో పాటు సాంఘికం, మతం, దేశం, విజ్ఞానం, జీవితచరిత్ర, శాస్త్రం, నైతిక విలువలు, విద్య, సాహిత్యం, చరిత్రలకు సంబంధించిన వ్యాసాలు రచించాడు. అవి సమాజాన్ని చైతన్యం చేయడంతో పాటు వ్యాస ప్రక్రియ వికాసానికి దోహదపడ్డాయి.

వికాస దశ (1910-1960)

క్రమంగా ఉపన్యాసం, ప్రమేయం వంటి పదాల స్థానంలో వ్యాసం అనే పేర్ల స్థిరపడిపోయింది. తెలుగు వ్యాస పరిణామంలో ఇది గుర్తించుకోదగిన దశ. గురజాడ అప్పారావు గిడుగు రామ్మూర్తి రాసిన వ్యాసాలు ఈ ప్రక్రియను మరింత పరిపుష్టం చేశాయి. కాకీభత్స బ్రహ్మయ్యశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, పానుగంటి లక్ష్మీనరసింహారావు, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ మొక్కపాటి నరసింహశాస్త్రి, ముట్నూరి కృష్ణారావు తదితరులు వ్యాస ప్రక్రియ బలోపేతం కావడానికి కృషి చేశారు.


చిలుకూరి వీరభద్రరావు ఎన్నో సారస్వత, చారిత్రక వ్యాసాలు రాసి చరిత్ర పరిశోధన రంగంలో గణనీయమైన కృషి చేశాడు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు పంతులు చారిత్రక పరిశోధనలో అగ్రగణ్యుడు. చరిత్ర, కళలు, సారస్వతం, ప్రకృతి శాస్త్రం, శాసనాలకు సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాసి లక్ష్మణరాయ వ్యాసావళి పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించాడు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంలోని ఆయన వ్యాసాలు గంభీర భావాలతో, మధురమైన శైలిలో ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి.


మల్లంపల్లి సోమశేఖరశర్మ చారిత్రక వ్యాసాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన వ్యాసాల్లో తెలుగు వెలమల శౌర్యపరాక్రమాలు, రెడ్డి రాజుల కీర్తి వైభవాలు, తెలుగు జాతి ఆచార వ్యవహారాలు, సాంఘిక జీవన మార్గాలు ఉదాత్తమైన శైలిలో వివరించబడ్డాయి. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు తెలుగుజాతి గర్వించదగ్గవి. ఆయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషాలు మన చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను చాటి చెబుతాయి.


ఒక ప్రాంత వికాసానికి దాని చరిత్ర దోహదం చేస్తుంది. తెలంగాణ అస్తిత్వం బలపడటానికి ఇక్కడి చరిత్రపై తొలినాళ్లలో ప్రసరించిన కొత్త వెలుగులు ఎంతో ఉపకరించాయి. తెలంగాణ చరిత్రను వెలికితీయడానికి వట్టికోట ఆళ్వారుస్వామి 'తెలంగాణం' పేరుతో వ్యాస సంకలనం ప్రచురించాడు. అందులో ఆదిరాజు వీరభద్రరావు రాసిన పది వ్యాసాలు కాకతీయ రాజవంశం మొదలుకొని నేటి తెలంగాణ వరకు ఎన్నో విలువైన అంశాలను వివరించాయి. చొల్లేటి నృసింహశర్మ, సర్వాయి పాపన్న, మాదన్నల గురించి తెలిపిన వివరాలు అప్పటి చారిత్రక వైభవాన్ని తెలియజేస్తాయి.


బిరుదురాజు రామరాజు మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించి అనేక వ్యాసాలను సంకలనంగా వెలువరించాడు. ఆయన 'మరుగునపడిన మాణిక్యాలు' ఎంతో ప్రసిద్ధమైంది. కట్టమంచి రామలింగారెడ్డి వ్యాసాలు ఉపన్యాసం, విమర్శ, పీఠికల రూపంలో ఉన్నాయి. పీఠికలను కూడా వ్యాసాలుగా స్వీకరించడం కట్టమంచి కృషి వల్లనే జరిగిందని చెప్పవచ్చు. తెలుగు సాహిత్య విమర్శ వ్యాస పరిధిని విస్తృతం చేసిన ఖ్యాతి కూడా ఆయనకు దక్కుతుంది.

రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ సారస్వతాలోకము, నాటకోపన్యాసములు, పింగళి లక్ష్మీకాంతం గౌతమ వ్యాసములు, ఖండవల్లి లక్ష్మీరంజనము 'లక్ష్మీరంజన వ్యాసావళి', వెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి 'కథలు గాథలు', గుడిపాటి వెంకటాచలం 'ఆనందం-విషాదం' సంపుటాలు తదితరాలన్నీ గొప్ప వ్యాస సంకలనాలుగా భవిష్యత్తు వ్యాసకర్తలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. 

ఆధునిక దశ (1960 నేటి వరకు)

ఈ దశలో తెలుగువ్యాసం ఎన్నో రంగాలకు విస్తరించింది. పత్రికల సంఖ్య పెరగడం, సామాజిక, రాజకీయ వ్యాసాలతో పాటు సాహిత్య వ్యాసాలకు చోటు కల్పించడం అందుకు కారణాలు.


శ్రీశ్రీ వ్యాసాలు వైవిధ్యభరితమైన వస్తువు, దృష్టికోణానికి తార్కాణాలు, పీఠికలు, ఉపోద్ఘాతాలు వంటి ప్రక్రియల్లో శ్రీశ్రీ ఎన్నో వ్యాసాలు రాశాడు. సాహిత్యం, సాంఘికం, కళాత్మకం విషయం ఏదైనా సూటిగా, స్పష్టంగా, నిర్మొహమాటంగా రాయడం శ్రీశ్రీ ప్రత్యేకత, తిరుమల రామచంద్ర 'నుడి - నానుడి', 'సాహితీ సుగతుని స్వగతం' వ్యాస సంపుటాలు చెప్పుకోదగినవి.


దేవులపల్లి రామానుజరావు 'సారస్వత నవనీతము', జి.వి. సుబ్రహ్మణ్యం 'సారస్వత సౌరథం' కొత్త ఆలోచనలకు ఊటబావుల వంటి రచనలు. వాటిలోని వ్యాసాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. హృదయాన్ని కదిలిస్తాయి, రససిద్ధి కలిగిస్తాయి. ఇలాంటి రచనల వల్ల తెలుగు వ్యాసం సాహిత్య ప్రక్రియలన్నింటిలో అగ్రస్థానం పొందిందని చెప్పవచ్చు. ఇప్పటి కవులు, రచయితలు, పరిశోధకులు అనేక అంశాల మీద వ్యాసాలు రాస్తున్నారు. పుస్తకాలుగా వెలువరిస్తున్నారు. తెలంగాణ చైతన్యంతో జయశంకర్, కేశవరావు జాదవ్, సింహాద్రి వంటి ఆలోచనాపరులు రాసిన వ్యాసాలు సమాజాన్ని కదిలించాయి. తెలంగాణ భావజాల వ్యాప్తికి విశేషంగా దోహదం చేశాయి.


పత్రికల్లో వ్యాస పరిణామం ప్రత్యేకంగా చెప్పుకోదగినది. మొదట సాహిత్య పత్రికలు, సంచికలకు మాత్రమే పరిమితమైన వ్యాసం నేడు రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, సాహిత్య పత్రికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. పత్రికల్లో వ్యవహార భాష ప్రయోగించడం ఈ ప్రక్రియ బలపడటానికి మరో కారణం. ఫలితంగా వ్యాసం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. 1870 నుంచి తెలుగు పత్రికల్లో ప్రచురితమవుతున్న వ్యాసాలు పాఠకుల్లో ఆయా అంశాల పట్ల అవగాహన, చైతన్యం కలిగిస్తున్నాయి.


సుప్రసిద్ధ పత్రికా రచయితలు నార్ల వేంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావుల వ్యాసాలు భావానికి అనుగుణమైన వాక్య విన్యాసానికి నిదర్శనాలు. చేకూరి రామారావు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 1986 నుంచి 'చేరాతలు' శీర్షికతో ఎనిమిదేళ్లు వ్యాసాలు రాశారు. ' ఆధునిక కవిత్వాన్ని అర్ధం చేసుకునే దృష్టి ఆయన చేరాతల ద్వారా కల్పించాడు. శ్రీవార కవయిత్రులకు, రచయిత్రులకు గుర్తింపు తెచ్చాడు. ఎన్నో వాదోపవాదాలు, చర్చలకు చేరాతలు నిలయంగా ఉండేవి.


ఇదే కాలంలో ఆంగ్లం, ఇతర భారతీయ భాషల నుంచి తెలుగులోకి అనువాదం. అయిన వ్యాసాలు ఉన్నాయి. బెంగాలీ, మరాఠీ, హిందీ, కన్నడ, తమిళ తదితర భాషల నుంచి తెలుగులోకి అనువాదమయ్యాయి. వీటివల్ల తెలుగువారిలో కలిగిన బౌద్ధిక వికాసం ఎంతో గొప్పది. జాతీయ, అంతర్జాతీయ అవగాహన పెంపొందించడానికి అనువాద వ్యాసాలు బాగా ఉపకరించాయి.


వచన రచనలో ఇతర ప్రక్రియల కన్నా వేగంగా, ఉన్నతంగా ముందుకు సాగుతున్నది. తెలుగు వ్యాసం. కాలగమనంలో అనేక పరిణామాలకు లోనవుతూ వ్యాసం అత్యధిక జనావళి వద్దకు చేరుకుంటున్నది. భాషలో ప్రజాస్వామికీకరణ, సరళీకరణ జరుగుతున్న క్రమంలో తెలుగు వ్యాసం జాతి చైతన్యంలో విలక్షణమైన పాత్ర పోషిస్తున్నది. నూట యాభై సంవత్సరాల చరిత్రలో సమకాలీన సమాజ, సాహిత్య విలువలను నమోదు చేస్తున్నది. అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ సమాజానికి దిక్సూచిలా దారి చూపుతున్నది వ్యాస ప్రక్రియే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?